చంద్రబాబు పరిపాలనను పక్కన పెట్టి దోమలపై దండయాత్రలు, ఈగలపై యుద్ధాలు చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవికే చంద్రబాబు చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య ఆయన మాటల్లో వైరాగ్యం కూడా కనిపిస్తోందని.. ఓటుకు కోట్ల కేసులో రేవంత్ రెడ్డి వాడినవన్నీ 500 నోట్లే కావడం వల్లే ఇంత వైరాగ్యం వచ్చిందా అని అడిగారు. 500, 1000 నోట్ల రద్దు విషయం సరేగానీ లంచగొండితనం, అవినీతి గురించి కూడా మాట్లాడాలన్నారు. ఇక నల్లధనం అంశంపై ఆయన ప్రధానికి ఉత్తరం రాయాలనుకుంటున్నారు గానీ.. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే లేఖ రాసేశారని చెప్పారు.