ప్రాణాంతక వ్యాధి బారిన పడిన పేదోడికి పెద్దాసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేలా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి భరోసా కల్పించారని ఉయ్యూరు సభలో వైఎస్ షర్మిల అన్నారు. కిలో బియ్యం రెండు రూపాయల నుంచి రూ. 5.25 లకు చంద్రబాబు చేస్తే.. మహానేత వైఎస్ఆర్ 30 రూపాయల రేటు పలికే బియ్యాన్ని 2 రూపాయలకే అందించారని షర్మిల గుర్తు చేశారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మహానేత వైఎస్‌ఆర్ ఏనాడు ఏ ఒక్క ఛార్జీ పెంచలేదని ఆమె అన్నారు. వైఎస్ఆర్ తన హయాంలో విత్తనాలు, గ్యాస్, ఎరువులు, బస్సు ఛార్జీలు కూడా పెంచలేదని, ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రికార్డు సృష్టించారన్నారు. ఆ మహానేత మరణాంతరం సీల్డ్‌కవర్‌లో ఊడిపడిన కిరణ్.. మహానేత పథకాలకు తూట్లుపొడిచాడని షర్మిల ఆరోపించారు. పన్నులు, ఛార్జీలు పెంచడమే పనిగా పెట్టుకుని కిరణ్ పేద ప్రజల్ని కష్టాల పాలు చేశాడని ఉయ్యూరులో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.