సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్కు నిరాశ ఎదురైంది. భారీ స్కోరు సాధించినా విజయం వరించలేదు. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా బుధవారం కింగ్స్ లెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆరు వికెట్లతో ఓటమి చవిచూసింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగా నాలుగు వికెట్ల నష్టానికి అలవోకగా విజయతీరాలకు చేరింది. సెహ్వాగ్ 4 పరుగులకే వెనుదిరిగినా మనన్ వోరా (47), సాహా (54), మ్యాక్స్వెల్ (43), డేవిడ్ మిల్లర్ విజృంభించడంతో పంజాబ్ గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 205 పరుగులు సాధించింది. సొంతగడ్డపై హైదరాబాద్ బ్యాట్స్మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు శిఖర్ ధవన్ (45), అరోన్ ఫించ్ (20) 65 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. అనంతరం నమన్ ఓజా (36 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఓజాకు డేవిడ్ వార్నర్ (23 బంతుల్లో 44) జతకలవడంతో హైదరాబాద్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. స్కోరు 200 దాటింది. పంజాబ్ బౌలర్ రుషి ధావన్ రెండు వికెట్లు తీశాడు.