భారత క్రికెట్ చరిత్రలో మహా నాయకుడి శకం ముగిసింది. మైదానంలో అందరినీ ఆశ్చర్యపరిచే తన వ్యూహాలలాగే మహేంద్ర సింగ్ ధోని మరోసారి అంచనాలకు అందకుండా వ్యవహరించాడు. ‘కెప్టెన్ ఇలా కూడా ఉంటాడా’ అనిపించిన క్షణాల నుంచి ‘ఇలా కూడా ఉండవచ్చు’ అని చూపిస్తూనే ఇలాగే ఉండాలి అంటూ నిరూపించిన మహేంద్రుడు తన బాధ్యతను ముగించాడు. లీడర్ హోదాలో అన్నగా, అండగా ఎందరో కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేసిన మహి, తన కర్తవ్యం పూర్తయిందనిపించాడు. ‘ముందుండి నడిపించే’ భారాన్ని మాత్రం తొలగించుకొని వికెట్ల ముందు, వెనకా మరోసారి తనలోని పాత ధోనిని ప్రదర్శించేందుకు మాత్రం సిద్ధమంటూ ధనాధన్ నిర్ణయం తీసుకున్నాడు.