జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా రేగొండ మండలం గోరి కొత్తపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పుట్టినరోజునే.. ఏడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అనంతరం హతమార్చిన ఘటన విషాదం నింపింది. స్థానికంగా నివాసం ఉంటున్న రాజు, ప్రవళిక దంపతుల కూతురు రేష్మ నిన్న సాయంకాలం సమయంలో పెళ్లి ఊరేగింపు వద్దకు వెళ్ళింది. అయితే రాత్రి వరకూ ఆ చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో రేగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పొలాల్లో రేష్మ అత్యాచారానికి గురై మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.