టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి, విద్యను వ్యాపారంగా మార్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ప్రవేశపెట్టిన పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ-2019 బిల్లును సభ మధ్యాహ్నం ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చ గురించి మంత్రి ఆదిమూలపు సురేష్ వివరిస్తూ.. బిల్లు పరిధిలోకి జూనియర్ కాలేజీలు కూడా వస్తాయని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నష్టపోయాయని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల కంటే, ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉండడమే దానికి నిదర్శనమన్నారు. మరోవైపు ప్రైవేటు సెక్టార్‌లో కూడా విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదికాక, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య ఆవశ్యకత - నాడు, నేడు అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీష్ ప్రపంచ భాష అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయం పట్ల ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రశంసిస్తూ కథనాలు రాశాయని సభ దృష్టికి తీసుకొచ్చారు.