నమ్మించి వంచించి హతమార్చడం, తడిగుడ్డతో గొంతు కోయడం వంటి చాలా ఘాతుకాలు సినిమాల్లో చూసినప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. అదంతా కల్పన అని తెలిసికూడా ఇంత ఘోరమా.. అని శరీరం జలదరిస్తుంది. అయితే వాస్తవ జీవితంలోనూ ఇలాటి కల్పనలకు మించిన దిగ్భ్రాంతికర పరిణామాలు చోటుచేసుకుంటాయని గేదెల రాజు, పద్మలతల హత్యోదంతాలను గమనిస్తే అర్థమై నివ్వెరపోవడం మనవంతవుతుంది. సుపారీలిచ్చి కిరాయి మనుషులతో హత్యలు చేయించే సంస్కృతి మన చుట్టూ ఇంతగా అభివృద్ధి చెందినందుకు గుండెల్లో అలజడి సుడులు తిరుగుతుంది.