కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ఆదివారం చేపట్టిన ధర్నా కొనసాగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా సోమవారం రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇన్నాళ్లూ అటు ఎన్డీయే, ఇటు యూపీఏలకు సమ దూరంలో ఉన్న బీజేడీతోపాటు అనేక విపక్ష పార్టీలు ఈ అంశంలో మమతకు మద్దతు పలికాయి. పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇదే అంశంపై దద్దరిల్లాయి. అటు శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసం అంశంపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించే విషయమై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.