రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరు శాతం నేరాలు తగ్గాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయని చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ‘2019 వార్షిక నేర నివేదిక’ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్.. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గత ఆరు నెలల్లో రాష్ట్ర పోలీస్ శాఖలో వినూత్న కార్యక్రమాలను చేపట్టడంతో అనేక రాష్ట్రాలు మనరాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు.