సూపర్ సైక్లోన్‌లలో ఒకటిగా నిలిచిన హుద్‌హుద్ తుపాను విరుచుకుపడి నేటికి సరిగ్గా మూడేళ్లయింది. నాటి పెను తుపానుకు కకావికలమైన విశాఖపట్నం కాస్త తేరుకున్నప్పటికీ నాటి గాయాలు ఇంకా బాధితులను వెంటాడుతున్నాయి. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు తుపాను హోరులో కలిసిపోయాయి. సరిగ్గా మూడేళ్ల క్రితం (అక్టోబర్ 12న) హుద్‌హుద్ ఉత్తరాంధ్రపై విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. 61 మంది మృత్యువాత పడ్డారు. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఒక్క ఈపీడీసీఎల్‌కే రూ.499 కోట్ల నష్టం వాటిల్లింది.