వ్యవసాయ పెట్టుబడి పథకానికి అవసరమైన నిధుల సమీకరణకు కేంద్ర సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఏప్రిల్ తొలి వారంలోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పు తీసుకునేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేయనుంది. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు.
ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రతి సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. మేలోనే ఈ డబ్బులు పంపిణీ చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. లక్షలాది మంది రైతులకు సాయమందించే పథకం కావటంతో భారీగా నిధులు అవసరమని ప్రభుత్వం లెక్కలేసింది. సాగు భూముల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుందన్న అంచనాకు వచ్చింది. ఇందుకు మేలోనే రూ.5,680 కోట్లు కావాలని తేల్చింది. ఇంత భారీగా నిధులు సమకూర్చటం కష్టతరమేనని ఆర్థిక శాఖ అప్రమత్తమైంది.