మహానగరంలో అతిపెద్ద సామూహిక వేడుక వినాయక శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఆదివారం నగరం నలువైపుల నుంచి వైభవంగా ప్రారంభం కానున్న గణనాథుడి శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాయి. పోలీసులు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు. లక్షలాది మంది భక్తజనం వేడుకలకు తరలిరానున్న దృష్ట్యా అడుగడుగునా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ చుట్టూ సుమారు 30 వేల మంది పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖలు రంగంలోకి దిగాయి.