మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమతమ పనులు చూసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు లాక్‌డౌన్ ప్రకటించిందో అర్థం చేసుకోకుండా గుంపులు గుంపులుగా తిరిగేస్తున్నారు. ఇది తమ మంచికే అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో, రాష్ట్రంలో కరోనా ఎంత ప్రమాదకరంగా మారిందో, భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుపుతూ ఓ డాక్టర్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియోను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ డాక్టర్ చెప్పింది శ్రద్దగా వినండి అని పేర్కొన్నారు.