రాజధాని పేరిట ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నట్లు టీడీపీ దుష్ఫ్రచారం చేస్తోందని మండిపడ్డారు. భీమిలిలో గజం స్థలం కూడా కబ్జాకు గురికాలేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు రోజుకోక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో టీడీపీ నేతల భూ దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ల్యాండ్ మాఫీయాను పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పారు. ఆక్రమణలు, భూ కబ్జాల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. అవినీతి రహిత పాలన అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.