గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. గతనెల వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. సోమవారం నాటికి జీతాలు చెల్లిస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జీతాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని కోర్టుకు విన్నవించింది. సోమవారం లోపు కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాల్చింది. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడంతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.