అమరావతి బాండ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అప్పులు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అమరావతి బాండ్లపై 10 శాతానికి మించి వడ్డీ ఇస్తున్నారని.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకరా లేక స్టాక్ బ్రోకరా అని ప్రశ్నించారు. కేవలం రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేస్తే సరిపోదని సూచించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరువు కనబడటం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.