తన హత్యకు టీడీపీ నేతలు రెక్కీ నిర్వహించారని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. తిరుపతి తుమ్మలగుంటలో మంగళవారం సాయంత్రం ఆయన.. నిందితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాత్తు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి.. పులివర్తి నాని సహకారంతోనే ఇద్దరు రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. ఓటమి భయంతోనే తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నేరచరిత్ర కలిగిన ఆ ఇద్దరికి రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి డ్రైవర్ల ముసుగులో తమ వద్దకు పంపారని, నెల రోజులుగా వారు తనతో పాటు, తన కుటుంబ సభ్యుల కదలికలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పులివర్తి నానికి చేరవేస్తున్నారని చెప్పారు.