తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్)లో అట్టుడుకుతోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్థానిక స్టెరిలైన్ కంపెనీని మూసివేయాలంటూ ప్రజాసంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వటంతో తూత్తుకుడిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలు ధ్వంసం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... స్టెరిలైన్ కంపెనీని మూసివేయాలంటూ మంగళవారం ఆందోళనకారులు వేలాదిగా తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు.
వారి ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లదాడి చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఇద్దరు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.