కేంద్ర ప్రభుత్వంపై తొమ్మిదోసారి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై వంద మందికి పైగా ఎంపీల మద్ధతు కూడగట్టామని, సభలో స్పీకర్ నేడు చర్చ చేపట్టాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు రాజీనామాలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి అని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు.
ఏదో సాకు చూపించి తీర్మానంపై చర్చ చేపట్టకుండా సభను వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ తీర్మానంపై చర్చనుంచి తప్పించుకోవడానికి బీజేపీ చూస్తుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కేవలం తన రాజకీయలబ్ది కోసమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ జపం చేస్తున్నారని విమర్శించారు. లాలూచీ కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వస్తున్నారని, టీడీపీ అసమర్ధత వల్లే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. గత నాలుగేళ్ల నుంచి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.