విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. విజయనగరంలో భూమన విలేకరులతో మాట్లాడుతూ..బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) నివేదికతో వైఎస్ జగన్‌పై ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటన వెనక కుట్ర కోణం ఉందన్న విషయం మరోసారి బట్టబయలైందన్నారు. బీసీఏఎస్ నివేదిక మా అనుమానాన్ని నిజం చేసేలా ఉందన్నారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావుకు అక్టోబర్ నెల వరకు మాత్రమే విమానాశ్రయంలో అనుమతి ఉందన్న సివిల్ ఏవియేషన్ రిపోర్టులోని అంశం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.