తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించి విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కేసీఆర్‌ని టీడీపీ నెత్తినపెట్టుకోవాలని చూసిందని, చంద్రబాబును ఓటుకు కోట్లు కేసులో శిక్షించి ఉంటే నేడు పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, దానికిప్రతిగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని కేసీఆర్ ప్రకటించారని.. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు ఊసరవెల్లి మాటలపై ఆలోచించాలని ప్రజలను కోరారు. హరికృష్ణ చనిపోయిన సందర్భంలో టీఆర్ఎస్‌తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే అన్నారు.