శివరాత్రి పర్వదినాన క్రీడాభిమానులను సంతోషంలో ముంచెత్తుతూ టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. సఫారీ గడ్డపై భారత్ పాతికేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలితాన్ని అందించింది. గతంలో ఆరు సార్లు పర్యటించినా ఒక్క వన్డే సిరీస్‌లో కూడా విజేతగా నిలవలేకపోయిన టీమిండియా ఈసారి కోహ్లి నేతృత్వంలో సగర్వంగా నిలిచింది. తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకొని సత్తా చాటింది. రెండేళ్ల క్రితం సొంతగడ్డపై ఎదురైన వన్డే సిరీస్ పరాజయానికి కూడా సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 16న) సెంచూరియన్‌లో జరుగనుంది.