ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ షాట్స్ అంటే.. దిల్‌స్కూప్.. స్విచ్ షాట్స్.. ర్యాంప్ షాట్.. వాక్‌వే కట్.. పెరిస్కోప్ షాట్.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ధోనీ హెలికాప్టర్ షాట్.. అని టకటకా చెప్పేయొచ్చు. కానీ గురువారంనాటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ కొట్టినషాట్లకు మాత్రం కొత్త పేర్లు వెతుకుతున్నారు క్రీడాపండితులు!! ఐపీఎల్ 2018లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. బ్రహ్మాండం బద్దలయ్యే రేంజ్‌లో(63 బంతుల్లో 7 సిక్సర్లు, 15 ఫోర్లు 128 పరుగులు) ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మామూలుగానే అగ్రెసివ్ ఆటను ప్రదర్శించే పంత్.. నిన్న ఘోరతప్పితాలు చేసినందుకే ద్విగుణీకృత బాధ్యతతో ఆడానని చెప్పుకొచ్చాడు.