Features
-
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ!
జీవనసహచరులు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో కలిసి నడిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం మరింత సులువవుతుంది. గమ్యాన్ని చేరుకునే క్రమంలో అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. అందుకే.. అన్ని వేళలా అండగా ఉండే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదంటారు. గ్లెన్ మాక్స్వెల్- వినీ రామన్ దంపతులు కూడా ఆ కోవకే చెందుతారు. గ్లెన్ మాక్స్వెల్.. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌గా క్రికెట్ ప్రపంచానికి సుపరిచితం. మేటి జట్టులో ఆల్‌రౌండర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న ఈ విక్టోరియా వీరుడు ఒకానొక సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయాడు. చెయ్యి విరగ్గొట్టుకోవాలని చూశా ‘‘నేను చేసిన పనులన్నీ.. నేను చేయనివిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నా. వరల్డ్‌కప్ సమయంలో నా చెయ్యి విరగ్గొట్టుకునేందుకు ట్రై చేశా. నాకు బ్రేక్ కావాలి. ఎవరిని చూసినా ఎందుకో కోపం వస్తోంది. నిజానికి అది నా మీద నాకున్న కోపం ప్రపంచకప్ ఈవెంట్లో నేను సరిగ్గా ఆడలేకపోయినందుకు వచ్చిన విసుగు. దీని నుంచి తొందరగానే బయటపడదామనుకున్నాను. కానీ.. అనుకున్నంత సులువేమీ కాదు’’ అంటూ తాను డిప్రెషన్‌తో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని 2019లో తొలిసారి బయటపెట్టాడు మాక్సీ. శ్రీలంకతో టీ20 సిరీస్ మధ్యలోనే జట్టును వదిలివెళ్లాడు. ‘‘అతడొక ప్రత్యేకమైన ఆటగాడు’’ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా కూడా మాక్సీ నిర్ణయానికి మద్దతునిచ్చింది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కూడా.. ‘‘ముందు ఆరోగ్యం.. ఆ తర్వాతే ఆట’’ అని చెప్పకనే చెప్పిన తన స్నేహితుడికి అండగా నిలిచాడు. మనసుకు దగ్గరైన మనిషి చెబితేనే బయట నుంచి ఎవరు ఎంతగా మద్దతునిచ్చినా మనసుకు దగ్గరైన మనిషి చెప్పే మాటలే ఎక్కువ సాంత్వన చేకూరుస్తాయి. మాక్సీ సమస్యను ముందుగానే పసిగట్టింది వినీ(అప్పటికి తను మాక్సీ గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే). ఒత్తిడి నుంచి అతడిని బయటపడేసే మార్గం గురించి ఆలోచించింది. ఇది తేలికగా కొట్టిపారేసే విషయం కాదని.. స్పెషలిస్టును కలవాల్సిందేనంటూ పట్టుబట్టింది. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీలేదంటూ మానసిక ధైర్యాన్నిచ్చింది. మాక్సీ ఆమె మాటను కాదనలేకపోయాడు. గుండెల మీది భారం దిగిపోయింది వినీ చెప్పినట్లు చేశాడు. గుండె మీది నుంచి పెద్ద కుంపటి దించుకున్నట్లయింది. నెలలపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాక్సీ మళ్లీ మునుపటిలా చలాకీగా మారిపోయాడు. పునరాగమనంలో తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానగణాన్ని ఖుషీ చేస్తున్నాడు. తాజాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఆరంభంలో బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయిన్పటికీ బంతితో ప్రభావం చూపగలిగాడు. అయితే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీతో మెరిసిన మాక్స్వెల్.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో డబుల్ సెంచరీ బాదాడు. మంత్రదండంతో మాయ చేసినట్లు తన చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లు నిలబడిన చోట నిలబడినట్లే.. మంత్రదండంతో ఏదో మాయ చేసినట్లు పరుగుల వరద పారించాడు. గాయం కారణంగా అంతకు ముందు మ్యాచ్‌కు దూరమైన మాక్సీ నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరు ఊహించగలరు! ఓడిపోతుందన్న మ్యాచ్‌ను గెలిపించి ఐదుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను తాజా ఎడిషన్‌లో ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చాడు. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరనీయక జట్టుకు చిరస్మరణీయ విజయం అందించిన తీరు ముచ్చటగొలిపింది. తన భర్తకు సంబంధించిన ఆనంద క్షణాలను ఫోన్ కెమెరాతో బందించిన వినీ.. ‘‘100 కాదు.. 201*.. భావోద్వేగాల సమాహారం’’ అంటూ సోషల్ మీడియాలో ఫొటోను పంచుకుంది. ఈ ఒక్క క్యాప్షన్ చాలు.. మాక్సీ డబుల్ సెంచరీ తమకు కేవలం ఒక నంబర్ కాదు.. ఓ ఎమోషన్ అని చెప్పడానికి!! భారత సంతతి అమ్మాయి.. తమిళనాడు ఆడపడుచు తమిళనాడుకు చెందిన వెంకట్ రామన్, విజయలక్ష్మీ రామన్ దంపతులు చాలా ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మెల్బోర్న్లో నివాసం ఏర్పరచుకున్న ఈ ఇండియన్ కపుల్‌కి 1993, మార్చి 3న వినీ జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వినీ ఫార్మాసిస్ట్‌గా కెరీర్ నిర్మించుకుంది. తీరిక దొరికినప్పుడల్లా స్నేహితులతో ప్రయాణాలు చేయడం వినీకెంతో ఇష్టం. అలా కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2018లో మాక్స్వెల్ ఆమెకు పరిచయమయ్యాడు. రెండు సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న తర్వాత మాక్సీనే వినీ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తన మనసులో ఉన్న మాట.. కోరుకున్నవాడి నోటి నుంచి.. బయటకు వస్తే ఏ అమ్మాయికి మాత్రం సంతోషంగా ఉండదు. వినీ కూడా అంతే.. ఇష్టసఖుడి ప్రతిపాదనను నవ్వుతూ అంగీకరించింది వినీ. ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమను పెళ్లిపీటలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అలా 2022లో క్రిస్టియన్, హిందూ వివాహ పద్ధతిలో మాక్స్వెల్- వినీ రామన్ వివాహం జరిగింది. గర్భస్రావం.. మానసిక సంఘర్షణ తమ ప్రేమకు గుర్తుగా ముద్దూమురిపాలు మూటగట్టే చిన్నారి రాబోతుందనే వార్త తెలిసి నూతన జంట ఆనందంలో తేలిపోయింది. కానీ.. దురదృష్టవశాత్తూ వినీకి గర్భస్రావమైంది. ఆ సమయంలో ఆమె కుంగిపోకుండా అండగా నిలబడ్డాడు మాక్సీ. మానసిక ధైర్యం కోల్పోకుండా కంటికి రెప్పలా కాచుకున్నాడు. ఆ విషాదం తర్వాత.. లోగాన్ మెవెరిక్ రూపంలో వారి జీవితాల్లో మళ్లీ కొత్త వసంతాలు చిగురించాయి. లోగాన్ మరెవరో కాదండి.. మాక్సీ- వినీల ముద్దుల కుమారుడు. రెయిన్బో బేబీ రాకతో ఇక ముందు తల్లిదండ్రులం అవుతామో లేదోనన్న భయాలతో ఆ దంపతుల మనసులో చెలరేగిన అలజడిని.. తుఫాన్ తర్వాత వచ్చే ఇంద్రధనుస్సులా మాయం చేసిన బుజ్జాయి. (రెయిన్ బో బేబీ- గర్భస్రావం తర్వాత జన్మించిన బిడ్డ). ఈ ఏడాది సెప్టెంబరు 11న జన్మించాడు. నాన్నకు ఆట నుంచి కాస్త విరామం దొరకగానే ఎంచక్కా అతడి గుండెల మీద వాలి హాయిగా నిద్రపోతాడు లోగాన్!! ఇక ఒకరికోసం ఒకరు అన్నట్లు జీవిస్తున్న వినీ- మాక్సీ తమ గారాల పట్టిని నిద్రపుచ్చేందుకు జోలపాట పాడుతూ లాలిస్తూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా!? -సుష్మారెడ్డి యాళ్ల -
గాన సరస్వతి
పువ్వుకు రాగం అబ్బితే ఎలా ఉంటుంది? ఆ పువ్వు స్వరాన్ని ఎలా సవరించుకుంటుంది? ఆ తావి గానాన్ని ఎలా శ్రుతి చేసుకుంటుంది? అక్షరాలను పూలరెక్కల్లా పొదివి పట్టుకుంటుంది. సరిగమలు కందకుండా సున్నితంగా గానం చేస్తుంది. ఆ గాన సరస్వతి... మన రావు బాలసరస్వతీదేవి. పువ్వు పాడితే ఎలా ఉంటుందో... రావు బాలసరస్వతీదేవి పాట వింటే తెలుస్తుంది. హైదరాబాద్, మణికొండలోని గాయత్రి ప్లాజాలో ఆమె ఫ్లాట్ గోడలు ఆ గానసరస్వతి రాగాలను నిత్యం వింటుంటాయి. తొంభై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో రాగం శ్రుతి తప్ప లేదు. తొంభై ఏళ్లుగా సాగుతున్న సాధనతో ఆ స్వరం అద్దుకున్న తియ్యదనం అది. పారిజాత పువ్వులాంటి మృదుత్వం ఆమె రాగానిది. ఆ గొంతు సన్నజాజి మొగ్గలా పరిమళం వెదజల్లుతోందిప్పటికీ. ఆ సుమధుర గానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తొమ్మిది దశాబ్దాల ఆమె సంగీత సేవను గౌరవిస్తోంది. నవంబర్ ఒకటవ తేదీన (రేపు) ఆమె వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. గ్రామఫోన్ నుంచి సీడీల వరకు సరస్వతి నాలుగవ ఏట నుంచి వేదికల మీద పాడుతున్నారు. ఆరవ ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్‌లో రికార్డు చేసింది. తెలుగు సినిమాలో తొలి నేపథ్య గాయనిగా రికార్డు ఆమెదే. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు సింహళ గీతాలనూ ఆలపించారు. బాలనటిగా, బాల గాయనిగా సినీరంగం ఆమెను గారం చేసింది. పేరు ముందు ‘బాల’ను చేర్చింది. కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతాలు సాధన చేసింది. సినిమా షూటింగ్‌ల కారణంగా స్కూలుకెళ్లడం కుదరకపోవడంతో ఆమె చదువు కోసం ట్యూటర్ ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. ఆమెకు ఇంగ్లిష్ నవలలు చాలా ఇష్టం. ఆ అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గ్రామఫోన్ రికార్డుల కాలం నుంచి క్యాసెట్ టేప్‌లో రికార్డ్ చేసే టెక్నాలజీని చూశారు. సీడీలు, ఎంపీత్రీలనూ చూశారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతూ వచ్చారు. కానీ, సినిమా సంగీతం, సాహిత్యంలో వచి్చన భాషాపరంగా విలోమమవుతున్న ప్రమాణాలను అంగీకరించలేకపోయారు. సినిమా అంటే శక్తిమంతమైన వినోదసాధనం. పిల్లలు, యువతకు మానసిక వికాసం, మేధో వికాసంతోపాటు వాళ్ల అభివృద్ధికి... వినోదం అనే సాధనంతో బాటలు వేసే గొప్ప కళామాధ్యమంగా ఉండాలి సినిమా. అంతే తప్ప విలువలను దిగజార్చుకునే సాధనం కాకూడదని చెబుతారామె. రెండు వేలకు పైగా పాటలు పాడిన ఈ సంగీత సరస్వతి ఈ రోజుల్లో పాటల సాహిత్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాట కలిపింది ఇద్దరినీ! చెన్నై (మద్రాసు) లో పుట్టి పెరిగిన బాల సరస్వతి పెళ్లి తర్వాత కోడలిగా కోలంక జమీందారీలో అడుగుపెట్టారు. ప్రకృతి ఇద్దరు వ్యక్తులను దూరం చేసిన విషాదాంతాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ ప్రకృతి ఇద్దరు మనుషులను దగ్గర చేయాలనుకుంటే చాలా చమత్కారంగా దగ్గర చేస్తుంది. అందుకు ఈ గానసరస్వతి పెళ్లే గొప్ప ఉదాహరణ. ‘‘నా పాటను వినడానికి స్వయంగా కోలంక జమీందార్... శ్రీ రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారు మద్రాసులో మా ఇంటికి వచ్చారు. నేనప్పుడే ‘కలువ రేకుల కనులు గల నా స్వామీ’ అనే పాట రికార్డింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. మా నాన్న పాట పాడమనగానే అదే పాట పాడాను. రాజా వారేమో తన పెద్ద కళ్లను వరి్ణస్తూ, వారి మీద ప్రేమను అలా పాట రూపంలో వ్యక్తం చేశాననుకున్నారట. అదే మా పెళ్లికి నాందీ గీతం’ అంటూ ఆనాటి జ్ఞాపకాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారామె. అందుకే తనకు ఇష్టమైన ప్రదేశం మద్రాసేనని చెబుతారామె. ఈ బాల రెండో బాల్యమిది! బాలసరస్వతీ దేవికి హాఫ్ వైట్ పట్టు చీరలిష్టం. క్రీమ్ కలర్‌తో అనేక రంగుల కాంబినేషన్లలోనే ఎక్కువగా కనిపిస్తారు. ఆమెకు మల్లెలన్నా ఇష్టమే. ఇక స్వీట్స్... ముఖ్యంగా గులాబ్ జామూన్, జాంగ్రీలను చూస్తే చిన్నపిల్లయిపోతారు. చాక్లెట్ చేతికిస్తే పసి పిల్లల ముఖం వికసించినట్లే ఆమె ముఖంలో నవ్వులు పూస్తాయి. భోజనం గుప్పెడే కానీ, ఆ వెంటనే స్వీట్ తినడం ఆమెకిష్టం, ఆ తర్వాత తియ్యగా పాడడం మరింత ఇష్టం. ఆ సరిగమల వారసత్వం ఇద్దరు కొడుకులకు రాలేదు, మనుమడు, మనుమరాలికీ రాలేదు. కానీ మనుమరాలి కూతురు నేహకు వచ్చింది. గానసరస్వతి కళ్ల ముందే ఆ ఇంట్లో సరిగమల కొత్తతరం వెల్లివిరుస్తోంది. తొంబై ఐదేళ్ల వయసులో హైదరాబాద్‌లోని పెద్ద కుమారుని ఇంటిలో ప్రశాంతంగా పసిబిడ్డలా జీవిస్తున్నారు బాల సరస్వతీదేవి. కన్నతల్లిని ‘కన్నక్కా’ అని పిలుస్తూ తల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారాయన. కోడలు అత్తగారి చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆమె కొన్ని సంగతులు చెప్తూ మధ్యలో మర్చిపోతుంటే ఆమె పెద్ద కొడుకు, పెద్ద కోడలు అందుకుని పూర్తి చేయడమే అందుకు నిదర్శనం. సినిమాలకు మాత్రమే దూరం... స్వరానికి కాదు! పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు బాల సరస్వతీదేవి సినిమాల కోసం పాడడం మానేశారు. కానీ సంగీత సాధన మాత్రం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారామె. ఎనభై ఏళ్ల వయసులో ఆమె తనకిష్టమైన కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. కోవిడ్‌కి ముందు 2018లో అంటే ఆమె తొంబయ్యేళ్ల వయసులో ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాడడమే ఆమె చివరి వేదిక. ఆ వేడుక తర్వాత మూడవ రోజు ఇంట్లో జరిగిన ప్రమాదం ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయితే ఆశ్చర్యంగా జారి పడడంతో విరిగిన తుంటి ఎముక దానంతట అదే సరయింది. సంగీతమే తనను స్వస్థత పరిచిందంటారామె. ఇప్పటికీ రోజూ ఆ స్వరం రాగాలను పలుకుతుంటుంది. ఆమె ఊపిరితిత్తులకు శక్తినిస్తున్నది సంగీతమేనని వైద్యులు కూడా నిర్ధారించారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: మోహనాచారి -
Seshanka Binesh: పేదపిల్లల గుండెచప్పుడు
శశాంక బినేశ్... మంచి వక్త. సామాజిక కార్యకర్త... ఓ విజేత. ‘మీ తరఫున మేము మాట్లాడుతాం’ అంటోంది. ‘మీ ఆరోగ్యాన్ని మేము పట్టించుకుంటాం’ అంటోంది. ‘ఉద్యోగినులకు అండగా ఉంటాను’ అంటోంది. ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ కోసం పని చేస్తాను’ ... అని ప్రకృతికి భరోసా ఇస్తోంది. శశాంక బినేశ్ సొంతూరు హైదరాబాద్, చందానగర్. బీఫార్మసీ తర్వాత యూకేకి వెళ్లి ‘లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ’ నుంచి ఫార్మసీలో పీజీ చేశారామె. ఇండియాకి వచ్చి కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ అది సంతృప్తినివ్వలేదు. ‘‘సొంతంగా ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలనే ఆలోచన చాలా గట్టిగా ఉండేది. ఈ లోపు మరో ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో డిజిటల్ మార్కెటింగ్ మీద మంచి పట్టు వచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు. ఇంట్లోనే ఒక గదిలో సొంతకంపెనీ ‘వి హాంక్’ మొదలుపెట్టాను. ఇప్పుడు ప్రతి వ్యాపారమూ బ్రాండింగ్ మీదనే నడుస్తోంది. బ్రాండ్‌కి ప్రమోషన్ కల్పించే పని మేము చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే... మీ గురించి, మీ వ్యాపారం గురించి మేము హారన్ మోగిస్తామన్నమాట’’ అంటూ తన సేవా ప్రయాణాన్ని వివరించే ముందు ఉపాధి కోసం తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన విషయాన్ని చెప్పారామె. ‘సామాజిక కార్యకర్తగా ఈ పనులు ఇప్పుడు కొత్తగా చేస్తున్నవి కావు, మా ఇల్లే నేర్పించింది’’ అన్నారు శశాంక బినేశ్. తాత... నాన్న... నేను! నా చిన్నప్పుడు చందానగర్ నగరంలో భాగం కాదు, గ్రామం. మా తాత మందగడ్డ రాములు గ్రామానికి ఉప సర్పంచ్, సర్పంచ్‌గా ఊరికి సరీ్వస్ చేశారు. పేదవాళ్లు నివసించే శాంతినగర్ కాలనీ వాళ్లకు ఇళ్లు, కరెంటు వంటి సౌకర్యాలు ఆయన హయాంలోనే వచ్చాయి. మా నాన్న విక్రమ్ కుమార్ ఇప్పటికీ శ్రామికుల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉన్నారు. నా అడుగులు కూడా అటువైపే పడ్డాయి. యూకేలో చదువుకుంటున్నప్పుడు పార్ట్‌టైమ్ జాబ్... షెఫీల్డ్ నగరంలో ఒక వృద్ధాశ్రమంలో. పెద్దవాళ్లకు ఒళ్లు తుడవడం, దుస్తులు మార్చడం, వీల్‌చెయిర్‌లో తీసుకెళ్లడం వంటి పనులు చేశాను. ఆ ఉద్యోగం... జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసింది. ఇండియాలో మా నాన్న తన స్నేహితులతో కలిíసి 2007లో నాదర్గుల్ దగ్గర ఒక ట్రస్ట్ హోమ్ స్థాపించారు. ఆ హోమ్ కోసం పని చేయడం మొదలుపెట్టాను. ఇక డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో సినీనటి సమంత, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని తో పరిచయమైంది. అప్పటినుంచి ‘ప్రత్యూష సపోర్ట్’ స్వచ్ఛంద సంస్థతో పని చేస్తున్నాను. పేదపిల్లలకు వైద్యసహాయం అందించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాను. ఇప్పటివరకు 650కి పైగా సర్జరీలు చేయించగలిగాను. స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీతో కలిసి హెచ్ఐవీ పిల్లలకు ‘విష్ ట్రూ కమ్’ ప్రోగ్రామ్, అనాథ పిల్లలకు ‘వింగ్స్ ఆఫ్ హోప్’ ద్వారా విమాన ప్రయాణాలు చేయించడం వంటి పనులతో సేవాకార్యక్రమాల్లో ఉండే సంతృప్తిని ఆస్వాదించాను. పేదరికం... అనారోగ్యం... రెండూ శాపాలే! నా సర్వీస్‌ని ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు తనం, అనారోగ్యాల నిర్మూలనల మీదనే కేంద్రీకరించడానికి బలమైన కారణమే ఉంది. పేదరికమే ఒక శాపమైతే, అనారోగ్యం మరొక విషాదం. ఈ రెండూ కలిస్తే ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. పిల్లలకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు పడే గుండెకోతను చెప్పడానికి ఏ భాషలోనూ మాటలు దొరకవు. సమాజంలో ఇన్ని సమస్యలుంటే ఇవి చాలవన్నట్లు మనుషులు ఒకరినొకరు కులాల పరంగా దూరం చేసుకోవడం మరొక విషాదం. భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నన్ని రోజులూ నాకు కులాల గురించి తెలియదు. ఇంటర్‌కి మా వాళ్లు ర్యాంకుల ప్రకటనలతో హోరెత్తించే కాలేజ్‌లో చేర్చారు. బీసీ వర్గానికి చెందిన నేను అక్కడ వివక్షను చూశాను, ఎదుర్కొన్నాను కూడా. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన ఈ తరంలో కూడా ఇలా ఉంటే మా నానమ్మ, ఇంకా ముందు తరాల వాళ్లు ఎంతటి వివక్షకు లోనయ్యారో కదా అనే ఆలోచన మెదలుతుండేది. మా ట్రస్ట్ హోమ్‌లో కులం లేని సమాజాన్ని సృష్టించగలిగాను. నేను లీగల్ గార్డియన్‌గా ‘జములమ్మ’ అనే అమ్మాయిని దత్తత చేసుకున్నాను. ఆ అమ్మాయి కులమేంటో చూడలేదు. వైద్యసహాయం అందిస్తున్న వారి కులాలూ చూడం. నేను రక్తదాతల సంఘం సభ్యురాలిని కూడా. రక్తం అవసరమైన పేషెంట్లు రక్తదాత కులాన్ని చూడరు. సమంత చూపిన బాట! మేము పేషెంట్‌కి వైద్యసహాయం కోసం ఎంపిక చేసుకునేటప్పుడు త్రీ పార్టీ ఫండింగ్ విధానాన్ని అవలంబిస్తుంటాం. మూడింట ఒకవంతు మేము సహాయం అందిస్తాం, ఒక వంతు పేషెంట్ కుటుంబీకులు, ఒక వంతు హాస్పిటల్ వైపు నుంచి బిల్లులో తగ్గింపు ఉండేటట్లు చూస్తాం. సరీ్వస్ విషయంలో సమంత ప్రభావం నా మీద ఎంతగా ఉందంటే... ఆమె చేనేతల ప్రమోషన్ కోసం పని చేస్తున్న సమయంలో నా వంతుగా ప్రకృతికి ఉపకరించే పని చేయాలని స్టూడియో బజిల్ హ్యాండ్లూమ్ క్లోతింగ్ బిజినెస్ పెట్టాను. ఇన్నేళ్ల నా సరీ్వస్‌లో లెక్కకు మించిన పురస్కారాలందుకున్నాను. కానీ వాల్మీకి ఫౌండేషన్ నుంచి ఈ ఏడాది అందుకున్న ‘సేవాగురు’ గుర్తింపు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. మావారు బినేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ‘వి హాంక్’ కోసమే పూర్తి సమయం పని చేయడం కూడా నాకు అందివచి్చన అవకాశం అనే చెప్పాలి. నన్ను నేను మలచుకోవడంలో బినేశ్ నాకు పెద్ద సపోర్ట్’’ అన్నారు శశాంక బినేశ్. ‘పోష్’ చైతన్యం మహిళలు పని చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా ‘సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. ధనలక్ష్మీ బ్యాంకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలిని. చాలా మంది మహిళలకు తమ పని ప్రదేశంలో అలాంటి కమిటీ ఉందనే సమాచారమే ఉండడం లేదు. ఇందుకోసం అవగాహన సదçస్సుల ద్వారా మహిళలను చైతన్యవంతం చేయడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. సమస్య ఎదురైతే గళం విప్పాలనే తెగువ లేకపోవడం కంటే గళం విప్పవచ్చనే చైతన్యం కూడా లేకపోవడం శోచనీయం. నేను ధైర్యంగా ఇవన్నీ చేయడానికి మా నాన్న పెంపకమే కారణం. ‘ఆడవాళ్లు మానసికంగా శక్తిమంతులు. ఎన్ని అవాంతరాలెదురైనా అనుకున్న పనిని మధ్యలో వదలరు’ అని చెప్పేవారాయన. ‘మహిళ ఒకరి మీద ఆధారపడి, ఒకరి సహాయాన్ని అరి్థంచే స్థితిలో ఉండకూడదు. తన కాళ్లమీద తాను నిలబడి, మరొక మహిళకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండాలి. సమాజం గురించి భయపడి వెనుకడుగు వేయవద్దు. జీవితం పట్ల నీ నిర్ణయం ప్రకారం ముందుకే వెళ్లాలి. నువ్వు విజయవంతమైతే సమాజమే నిన్ను అనుసరిస్తుంది’ అని చెప్పేవారు. నేను సాటి మహిళలకు చెప్పే మంచి మాట కూడా అదే. – శశాంక బినేశ్, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్‌గా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్‌లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్‌లో మా కుటుంబం అంతా హైదరాబాద్‌లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్‌గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్‌ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్‌ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్‌కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్‌ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్‌కి కమిటీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్‌కుమార్. హైదరాబాద్‌కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్‌టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్‌లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్‌లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్‌ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్‌కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్‌పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్‌పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్‌లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్‌పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్‌పాత్‌ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్‌లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్‌పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్‌గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్‌తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్‌ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్‌లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్‌లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
National Animal Rights Day: జంతువులను ప్రేమిద్దాం..
మన కాలనీలో ఓ కుక్క కాలు విరిగి ఈడ్చుకుంటూ వెళుతుంటుంది... చూసి, పట్టనట్టు వెళ్లిపోతుంటాం. ఓ చిన్న సందులో పిల్లి ఇరుక్కుని గిలగిల్లాడుతుంటుంది ... దానిని కాపాడటం మన పని కాదులే అని తప్పుకుంటాం. వాటికి ఆకలేసినా, ప్రమాదాలు జరిగినా మనసున్న మనుషులుగా మనమెంతవరకు పట్టించుకుంటున్నాం? మనతో పాటు మూగజీవాలకూ బతికే హక్కు ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిది అని అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న జంతుప్రేమికులు సాయిశ్రీ, పంచ్, శారద, డాక్టర్ కృష్ణప్రియ. ప్రజలలో మూగ జీవాల పట్ల అవగాహన కలిగించేందుకు, సురక్షితంగా ఉంచేందుకు నార్డ్ గ్లోబల్ ఆర్గనైజేషన్‌తో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేషనల్ యానిమల్ రైట్స్ డే సందర్భంగా జంతు ప్రేమికులు చెబుతున్న విషయాలు. స్కూల్, కాలేజీలకు వెళ్లి.. జంతువులకు కూడా జీవించే హక్కు ఉంది అని చెప్పడానికి నార్డ్ అనే సంస్థ అంతర్జాతీయంగా వర్క్ చేస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్‌తో కలిసి వర్క్ చేస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. మూడేళ్లుగా యానిమల్ సేవలో పాల్గొంటున్నాను. మనిషి కారణంగా ఏ జంతువూ బాధపడకూడదు. ఎవరూ వాటిని హింసించకూడదు. నేను ఒక స్ట్రీట్ డాగ్‌ను దత్తత తీసుకున్నా. అప్పటి నుంచి నాకు ఈ సేవ పట్ల ఆసక్తి పెరిగింది. స్కూల్, కాలేజీలకు వెళ్లి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాం. జంతు ఆధారిత ఉత్పత్తులను ఏవీ ఉపయోగించం. – పంచ్, యానిమల్ యాక్టివిస్ట్, సైనిక్‌పురి పూర్తి సమయం కేటాయింపు.. మన వీధిలో ఒక కుక్క ఉందంటే అది ఆ కాలనీవారందరి బాధ్యతగా ఉండాలి. దానికి ఏదైనా దెబ్బ తగిలినా, తిండి లేకుండా పడి ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అలాంటి కుక్కలు, పిల్లలు, గోవులు... వీధుల్లో తిరిగేవాటిని తీసుకొచ్చి, సేవ చేస్తాం. వీధుల్లో ఉండే కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయిస్తాం. ఐదేళ్లయ్యింది ఈ వర్క్ చేయబట్టి. ఎనిమిదేళ్ల క్రితం మా ఫ్రెండ్ అక్కవాళ్ల దగ్గర నుంచి ఒక కుక్కను తీసుకున్నాను. స్ట్రీట్ డాగ్స్‌కు దెబ్బలు తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేసేదాన్ని, చేయించేదాన్ని. ఆ తర్వాత షెల్టర్ స్టార్ట్ చేశాను. దీనికి మరొక ఫౌండర్ జత కలవడంతో ఇప్పుడు ఇక్కడ రెండు వందల వరకు యానిమల్స్ ఉన్నాయి. గోవులు ఆరున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేల స్ట్రీట్ యానిమల్స్‌కి సేవలందించాను. నేషనల్ బాక్సర్‌గా ఉన్న నేను ఈ వైపుగా ఆసక్తి పెరగడంతో పూర్తి సమయాన్ని జంతువుల సేవకే కేటాయిస్తున్నాను. వీగన్ పదార్థాల తయారీ, ప్రొడక్ట్స్ బిజినెస్ కూడా చేస్తుంటాను. వీటి వల్ల వచ్చే ఆదాయంలో 15 శాతం జంతు సేవలకే ఉపయోగిస్తుంటాను. – సాయి శ్రీ, బోరంపేట్, దుండిగల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది.. మా అపార్ట్మెంట్ దగ్గర 20 కుక్కలను సేవ్ చేసి, వాటికి షెల్టర్ ఏర్పాటు చేశాను. ఇందుకు చాలా మందితో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుక్కలకు ఆహారం పెడుతుంటే, పై నుంచి బాటిల్స్ వేసినవారున్నారు. అవే కుక్కల మీద పడితే, వాటికి ఎంత ప్రమాదం జరిగేదో అస్సలు ఆలోచించరు. న్యూసెన్స్ అవుతుందని కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. యానిమల్ రైట్స్ గురించి చెప్పినప్పుడు, అందరూ తగ్గారు. మొదట్లో స్ట్రీట్ డాగ్‌ని దత్తత తీసుకొని, పెంచేదాన్ని. ఆ తర్వాత ఆ కాలనీలో తిరుగుతున్నవాటిని రెస్క్యూ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్ షెల్టర్‌కి పంపిస్తుంటాను. – శారద, యానిమల్ యాక్టివిస్ట్, ప్రగతినగర్ బ్లడ్ అవసరమైతే.. నేను డెంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. అలాగే, అవసరమైన డాగ్స్‌కి బ్లడ్ అందేలా చూస్తుంటాను. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ల కుక్కకు ప్రమాదం జరిగి, బ్లడ్ అవసరమైంది. ఆ సమయంలో మరో కుక్క నుంచి బ్లడ్ తీసి, మ్యాచ్ చేసి ప్రమాదం నుంచి గట్టెక్కించారు. అప్పటి నుంచి కుక్కలకు కూడా బ్లడ్ అవసరం అని భావించి, రికార్డ్ చేస్తున్నాను. ఇందుకు సంబంధించి వెటర్నరీ డాక్టర్స్‌ని, వారి ద్వారా అవసరమైన కుక్కలకు మరో పెట్ పేరెంట్ ద్వారా బ్లడ్ అందేలా చూస్తుంటాను. – డాక్టర్ కృష్ణప్రియ, మలక్‌పేట – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కి'లేడీ' దొంగలు!
ఆడదానికి ఆడదే శత్రువు అన్న నానుడి నిజం చేస్తున్నారు 'గొలుసు' దొంగలు. లేడీ చైన్ స్నాచర్ల అవతారమెత్తి తోటి మహిళల మెళ్లో నుంచి బంగారపు గొలుసులు తెంపుకుపోతున్నారు. స్నాచింగ్‌లో మగాళ్లకు తామేమీ తీసిపోమని చోరశిఖామణులుగా మారిన మహిళలు నిరూపిస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర రాజధానిలోనే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ సాటి వాళ్లను హడలెత్తున్నారు కి'లేడీ'లు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సాధారణంగా స్త్రీలకు సువర్ణాభరణాలతో చెప్పలేంత ప్రీతి. కనక వస్తువులు ఒంటి నిండా అలంకరించుకోవాలని ఉవ్విళ్లూరని వనితలు తెలుగుగడ్డపై అరుదు. శుభకార్యాలు, వేడుకల్లో మహిళలు చూపే బంగారపు ధగధగల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గాజులు, జుకాలు, వడ్డాణాలు, పాపిడి బిందెలు, అరవంకీలు, కాసులపేర్లతో కళకళలాడి పోతుంటారు. ఎంత బంగారం అలంకరించుకున్నా అతివలకు తనివి తీరదు. ఈ మోజే వారి కొంప ముంచుతోంది. మహిళల మెడల్లోంచి బంగారపు గొలుసులు తెంపుకుపోవడాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఒంటరిగా బయటకు వచ్చిన వనితల మెడల్లోంచి బలవంతంగా చైన్లు లాక్కుపోవడం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడీ చోరీల్లో మహిళలు పాలుపంచుకోవడం విస్తుగొల్పుతుంది. తాజాగా తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్‌లో ఆడ దొంగలు స్వయంగా పాల్గొనడంతో పోలీసులకు పాలుపోవడం లేదు. జీడిమెట్లకి చెందిన ఉషారాణి ఆదివారం రాత్రి(ఆగస్టు 4) ఆమె తిరుమలగిరి టీచర్స్ కాలనీలో ఉన్న తన తల్లి ఇంటికి హోండా యాక్టివాపై బయల్దేరారు. కాలనీ వద్ద ఎదురుగా ఓ బైక్ వచ్చింది. యువకుడు బైక్ నడుపుతుండగా దాని వెనుక కూర్చున్న యువతి ఎదురుగా మరో వాహనంపై వస్తున్న ఉషారాణి మెడలోని 3 తులాల బంగారం గొలుసును రెప్పపాటులో లాఘవంగా తెంచి పరారైంది. పట్టుకోవటానికి ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. స్నాచింగ్‌కు పాల్పడిన యువతి పంజాబీ డ్రెస్సు.. దానిపై జాకెట్ వేసుకుందని, బైక్‌ను యువకుడు నడిపిస్తున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటిదే మరో ఘటన తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలోని కార్ఖానా ప్రాంతంలో కొద్దివారాల క్రితం చోటుచేసుకుంది. అయితే ఈ రెండు చోరీలకు పాల్పడింది ఒకరేనా, కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే మగ చైన్ స్నాచర్ల ఆట కట్టించేందుకు లేడీ కానిస్టేబుళ్లను సాధారణ మహిళల మాదిరిగా ముస్తాబు చేసి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న ప్రాంతాలకు వీరిని పంపి కొంతమంది మగ గొలుసు దొంగలను పట్టుకున్నారు. మరీ లేడీ చైన్ స్నాచర్లకు ముకుతాడు వేసేందుకు పోలీసులు ఎలాంటి ఎర వేస్తారో? -
బక్కచిక్కిపోతున్న రూపాయి
డాలర్‌తో పోల్చితే రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడంతో రూపాయి కొంత పుంజుకుంది. కానీ రెండు వారాలు కూడా కాకముందే మళ్లీ పతనం దిశలో కింద కిందకు వెళుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉంది. రూపాయి రోజు రోజుకు కిందకు పోతుండటంతో కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతోంది. గత నెల 31వ తేదీ బుధవారం డాలర్‌తో పోల్చితే 55.65 రూపాయలు కాగా, ఈరోజు 61.27కి పడిపోయింది. రూపాయి విలువ రోజురోజుకు దిగజారిaపోతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ పతనం ఇలాగే కొనసాగి 70 వరకు పడిపోతుందనే అంచనాలు వస్తుండటంతో అటు ఆర్థిక శాఖ, ఇటు రిజర్వ్ బ్యాంకు పలు చర్యలు చేపడుతున్నాయి. కానీ ఇవేవీ ఫలితం ఇస్తున్న దాఖలాలు లేవు. రూపాయి పతనంతో దిగుమతులు భారమవుతున్నాయి. రెండు నెలల్లో పెట్రోల్ ధర నాలుగు సార్లు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ ధర దాదాపు 78 రూపాయలకు చేరింది. రూపాయి గనుక 70కి చేరితే లీటర్ ధర 100 రూపాయలకు చేరే ప్రమాదం ఉంది. ఒక్క పెట్రోల్ మాత్రమే కాకుండా అనేక రకాల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గినా, రూపాయి విలువ పడిపోవడంతో మనదేశంలో బంగారం ధర పెరుగుతూ ఉంది. రూపాయి పతనం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం లేదు. ఇందువల్ల రూపాయిని నిలబెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద నగదు సరఫరాను తగ్గించారు. మార్కెట్లో వడ్డీరేట్లు పెరిగేలా చేశారు. ఈ చర్యల నేపథ్యంలో వారం కింద రూపాయి 55 వరకు బలపడింది. కానీ మళ్లీ అంతలోనే 61 దాకా వచ్చింది. ఇలాగే వదిలేస్తే 65 దాకా వెళ్లిపోతుందేమోనని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పతనాన్ని అడ్డుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ చర్యల్లో భాగంగా ప్రధానంగా విదేశాల్లో జరుగుతున్న రూపాయి లావాదేవీలను నియంత్రించనుంది. ఈ లావాదేవీలను టెక్నికల్‌గా నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్‌డిఎఫ్) అని పిలుస్తున్నారు. సింగపూర్, లండన్, న్యూయార్క్ నగరాల్లో ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. ఎం.ఎన్.సి. బ్యాంకులు, ఫండ్లు, పెద్ద పెద్ద ఇండియన్ కంపెనీలు ఈ లావాదేవీల కొనుగోళ్లు, అమ్మకాల్లో పాల్గొంటున్నాయి. గత పదేళ్లుగా ఈ తరహా లావాదేవీలు బాగా పెరిగాయి. మన దేశంలో రూపాయి గమనాన్ని ఇవి ప్రభావితం చేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఎన్డిఎఫ్లను అదుపు చేయాలని నిర్ణయించింది. ఈ పరిస్థితులలో వచ్చే నెల 4న రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన సారధ్యంలో రూపాయి బలపడుతుందని పలువురు భావిస్తున్నారు. రాజన్ తనకు ఉన్న అనుభవంతో ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెస్తారని ఆశిద్దాం. -
హైదరాబాద్‌తో పీటముడి
రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నేపథ్యంలో మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఒక్క హైదరాబాద్ విషయంలోనే పీటముడి పడింది. ఆరు దశాబ్దాలుగా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌పై హక్కులు ఎవరివనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ప్రత్యేక తెలంగాణ ప్రకటన కూడా ఎలాంటి స్పష్టత లేకుండా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎవరి సొత్తు? భాగ్యనగర అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎంత?. హైదరాబాద్ విలువ ఎంతో లెక్క కట్టడం సాధ్యమయ్యే పనేనా?! అసలు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏంచెబుతోంది? రాష్ట్రం విడిపోతే వాటాల పంపకాలు ఎలా జరుగుతాయి? ....ఇలా అనేక ప్రశ్నలు తలెత్తాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై గతంలో పెద్దగా చర్చ జరగలేదు. అసలు రాష్ట్రం విడిపోతుందా లేదా అనే ఊహాగానాలను తెరదించుతూ గత నెల 30న కేంద్రం ప్రకటన వెలువడింది. దాంతో ఇన్నాళ్లు జరిగిన చర్చలు మూలన పడి అసలు వాదనలు మొదలయ్యాయి. రాష్ట్రం విడిపోతే కొత్త రాష్ట్రాల ఏర్పాటు - అక్కడి అభివృద్ధి - కేంద్ర ప్యాకేజీలు ఇలాంటి విషయాలు పక్కన పెడితే అసలు రాజకీయమంతా హైదరాబాద్ చుట్టూనే తిరుగుతోందనేది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్ అవతరించి సుమారు 60 సంవత్సరాలు కావస్తోంది. ఈ ఆరు దశాబ్దాల పాటు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌పై హక్కులు తెలంగాణ వాసులవా లేకపోతే ఉమ్మడి సీమాంధ్రులకు కూడా చెందుతుందా అనేది ఇపుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణతో హైదరాబాద్ రాజధాని నగరమైంది. ఆంధ్రా - తెలంగాణ - రాయలసీమ మూడు ప్రాంతాలకు రాజధాని కావడంతో భాగ్యనగరంలో అభివృద్ధి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒక పెద్ద రాష్ట్రానికి రాజధాని నగరం కావడంతో అప్పటికే దేశ ప్రధాన నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ మరింత బలపడింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెరిగాయి. అంతే కాకుండా పరిశ్రమలు - విద్యా సంస్థలు - పరిశోధనా సంస్థలు - హైటెక్ హంగులు - అంతర్జాతీయ విమానాశ్రయం - ఫ్లైఓవర్లు.....ఇలా ఒక రాష్ట్ర రాజధానిలో ఉండవలసిన హంగులన్నీ సమకూరాయి. దాంతో హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా పెరుగుతూ వచ్చింది. ఈ నగరానికి జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు పెరగంతో అందరి దృష్టి పడింది. జాతీయ వ్యాపార వేత్తలతో పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వ్యాపారస్తులు తమ పెట్టుబడులకు అనుకూలంగా హైదరాబాద్‌ను ఎన్నుకున్నారు. దాంతో ఆంధ్ర, రాయలసీయ ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద ఎత్తున వలసలు కూడా పెరిగాయి. అదే ఈ రోజు రాష్ట్ర విభజనకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాజధాని కావడంతో హైదరాబాద్ అభివృద్ధి చెందినట్లుగా రాష్ట్రంలో వేరే ఏ ఒక్క నగరం కూడా అభివృద్ధి చెందలేదు. అప్పటి వరకు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న పలు జాతీయ స్థాయి సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, పరిశ్రమలు క్రమక్రమంగా హైదరాబాద్ పరిసరాలకు చేరుకున్నాయి. జాతీయ భధ్రతకు సంబంధించి - అలాగే కీలకమైన రక్షణ రంగానికి సంబంధిచినవి - వ్యూహాత్మక సంస్థలు...ఇలా మొత్తంగా 28 కేంద్ర సంస్థలు హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఇవి కాకుండా జాతీయ విద్య, పరిశోధన,అభివృద్ధి రంగాలకు సంబంధించిన మరో 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 9 విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు ఉన్న చాలా వరకు యూనివర్శిటీలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేవే. దాంతో హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలోని ఇతర జిల్లాలు, సీమాంధ్ర ఇతర జిల్లాల కంటే అధికంగా ఉంది. మూడు ప్రాంతాలకు హైదరాబాద్ రాజధాని కావడంతో రోడ్డు రవాణా వ్యవస్థలు, రైలు మార్గాలు, విమానయానం వంటి రవాణా వ్యవస్థలు మెరుగు పడ్డాయి. ఇదివరకే పెద్ద నగరాల్లో ఒకటిగా ఉండి, రాష్ట్ర రాజధాని కూడా కావడంతో అభివృద్ధి ఒక్క హైదరాబాద్ నగరానికే పరిమితమైంది. మిగిలిన ప్రాంతాలన్నీ కూడా నేటికీ హైదరాబాద్ కంటే వెనుకబడి ఉన్నాయనేది అందరికీ తెలిసిన సత్యమే. -
అసాధారణ ప్రతిభావంతుడు రాజన్
రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. అదే రోజు 23 గవర్నర్‌గా రాజన్ బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. రాజన్ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంకుకు ఐఏఎస్ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్ అధికారులే. ఐఏఎస్ కాకపోయినా రాజన్‌కు గవర్నర్ పదవి దక్కడానికి ఆయన మేధస్సే ప్రధాన కారణం. అసాధారణమైన ప్రతిభావంతుడిగా రాజన్‌కు పేరుంది. ప్రస్తుతం భారత దేశం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ బాధ్యతలు చేపట్టడం ఆశాజనకమైన పరిణామం. రఘురామ్ రాజన్ భోపాల్‌లో 1963 ఫిబ్రవరి 3న జన్మించారు. ఆయన తండ్రి దౌత్యవేత్త. అందువల్ల 7వ తరగతి వరకు రాజన్ విదేశాల్లోనే చదువుకున్నారు. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో చదువుకున్నారు. 1985లో ఢిల్లీ ఐఐటీ నుంచి గోల్డ్ మెడల్‌తో బీటెక్ పట్టా అందుకున్నారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. బ్యాంకింగ్ రంగంపై సమర్పించిన పత్రానికి ఎంఐటి పీహెచ్డీ మంజూరు చేసింది. రాజన్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పని చేశారు. ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఫైనాన్స్ రంగంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశారు. 2008లో ఆర్థిక సంక్షోభం రాబోతోందని అంచనా వేసిన వారిలో రాజన్‌కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అదే ఏడాది మన దేశానికి గౌరవ ఆర్థిక సలహాదారుగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నియమించారు. 2012లో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యంత చిన్న వయసులో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దువ్వూరి సుబ్బారావు తొలుత మూడేళ్ల కోసం గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం మరో రెండేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. సుబ్బారావు హయాంలో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఆయన వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లారు. ఈ పరిణామం కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని పెద్ద కంపెనీలు కూడా వాయిదాలు కట్టలేక చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరానికి, సుబ్బారావుకు మధ్య దూరం పెరిగింది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న రాజన్ ఈ దూరాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. -
సోనియా లేఖ... రాజకీయ కాక!
హస్తం పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పెద్ద చిక్కొచ్చిపడింది. స్వయంకృతంతో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారారు. తన కంటి సైగతో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ శక్తివంతమైన మహిళ తనకు తానుగా వివాదంలో వేలు పెట్టారు. పెద్దావిడ స్వయంగా అందించిన అస్త్రాన్ని అందిపుంచుకున్న విపక్షాలు దాన్ని వెంటనే ఆమె నిజాయితీపై గురిపెట్టాయి. సోనియా ద్వంద్వ వైఖరిని తూర్పారబట్టాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ వ్యవహారంలో సోనియా జోక్యం చేసుకుని ప్రధానికి లేఖ రాయడంతో రాజకీయ దుమారం రేగింది. యూపీలో ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన దుర్గాశక్తిపై అఖిలేష్ యాదవ్ సర్కారు సస్పెన్షన్ వేటు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోనియమ్మ లేఖ రాశారు. స్వార్థ ప్రయోజనాలకు ఎదురొడ్డి నిలబడినందుకు ఆమెను శిక్షించకూడదంటూ మన్మోహన్ సింగ్‌ను లేఖలో కోరారు. సోనియా లేఖపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), (ఏఏపీ), బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించాయి. సొంత అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారాన్ని బట్టబయలు చేసిన హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బదిలీ విషయంలో యూపీఏ చైర్పర్సన్ ఎందుకు కల్పించుకోలేదని ఈ పార్టీలు సూటిగా ప్రశ్నించాయి. సోనియాకు చిత్తశుద్ధి ఉంటే హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వాద్రా చేస్తున్న భూకబ్జాల గురించి కూడా ప్రధానికి మరో రెండు లేఖలు రాయాలని సమాజ్‌వాదీ పార్టీ సలహాయిచ్చింది. ఇంత జరుగుతున్నా నిజాయితీ ప్రభుత్వాధికారులపై సర్కారీ సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై హిస్టరీ షీట్ తెరిచిన ఎస్పీని అక్కడి కాంగ్రెస్ సర్కారు బదిలీ చేయడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, ఇతర రాష్ట్రాల విషయంలో మరోలా సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తాయి. అయితే ఖేమ్కా, దుర్గాశక్తిల అంశాలు రెండూ వేర్వేరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్, ఎంపీ జితిన్ ప్రసాద తమ నాయకురాలిని వెనుకేసుకొచ్చారు. ప్రస్తుత రాజకీయ సంకట స్థితి నుంచి సోనియా ఏవిధంగా బయట పడతారో చూడాలి. -
రెడ్‌లైట్ నుంచి న్యూయార్క్.. ఓ శ్వేత పయనం
కష్టాలు, కన్నీళ్లు ఆమెను నిరంతరం వెన్నంటి ఉండే నేస్తాలు. ఉండేది ప్రతినిత్యం రక్తమాంసాలతో వ్యాపారం సాగే నీచాతి నీచమైన ప్రాంతం. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలోని రెడ్‌లైట్ ప్రాంతంలో పెరిగి, పలుమార్లు లైంగిక అఘాయిత్యాలకు గురైన ఆ యువతి.. న్యూయార్క్ నగరంలో చదువుకోడానికి అమెరికా వెళ్లిపోయింది. పేదరికాన్ని, కష్టాలను అధిగమించి మరీ ఆమె ఈ విజయం సాధించింది. ఆమె పేరు శ్వేతా కత్తి (18). ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఉండే అనేక మంది అభాగినులలో ఆమె పేరు ఉన్నా.. పెద్దగా ఎవరికీ తెలియదు. న్యూయార్క్ లోని బార్డ్ కాలేజిలో సైకాలజీ డిగ్రీ చదివేందుకు ఆమెకు స్కాలర్షిప్ లభించింది. ఆ చదువు పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగొచ్చి, తనలాంటి అభాగినులకు సాయం చేయాలని శ్వేత భావిస్తోంది. చిన్నప్పటి నుంచే తాను అలా కలలు కన్నానని, కానీ ఆ కల సాకారం అవుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. శ్వేత పట్టుదల కారణంగా ఆమె ప్రపంచ ప్రఖ్యాత పత్రిక న్యూస్ వీక్ 'యంగ్ వుమెన్ టు వాచ్' పేరిట ఎంపిక చేసిన 25 మంది బాలికల్లో ఒకరిగా నిలిచింది. తాలిబన్ల దాడిలో గాయపడి, కోలుకున్న పాకిస్థానీ బాలిక మలాలా పేరు కూడా ఈ జాబితాలోనే ఉంది. చిన్ననాటి నుంచి ఆమె అనేక కష్టనష్టాలకు గురైంది. ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఆమె చూసిన నరకం అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు వచ్చి, ఎవరో ఒక మహిళను కొడుతుండేవాళ్లని, పోలీసులు ఎపు్పడు పడితే అప్పుడు వస్తుండేవారని, ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. సంతోషంగా లేకపోయినా కూడా తప్పనిసరిగా అక్కడున్నవాళ్లంతా వ్యభిచారం చేయాల్సి వచ్చేదని శ్వేత వివరించింది. తమ పక్కన పడుకొమ్మని మగవాళ్లు వచ్చి అడిగినప్పుడు చాలా బాధగా అనిపించేదని, కానీ తప్పేది కాదని తెలిపింది. తండ్రితో పాటు చాలామంది తనను తిట్టి, కొట్టేవారు గానీ, తన తల్లి మాత్రం.. నువ్వు ఏమైనా చేయగలవంటూ ప్రోత్సహించేదని చెప్పింది. తాను చాలా మొండిదాన్నని, పాఠశాలలో తన పేదరికం, తక్కువ జాతి కారణంగా అన్నివైపుల నుంచి వివక్ష ఎదుర్కొన్నానని వివరించింది. ఫ్యాక్టరీ కార్మికురాలిగా పనిచేసే తన తల్లి తనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చినట్లు చెప్పింది. శ్వేత కన్న కలలు సాకారం కావడంలో 'క్రాంతి' అనే స్వచ్ఛంద సంస్థ తన వంతు పాత్ర పోషించింది. ముంబై రెడ్‌లైట్ ప్రాంతంలోని అమ్మాయిలు సామాజిక మార్పు తీసుకురావడానికి సాధకులుగా ముందుకు రావాలన్నదే ఈ సంస్థ ధ్యేయం. క్రాంతి సంస్థ రెండేళ్ల క్రితం శ్వేతను రెడ్‌లైట్ ప్రాంతం నుంచి తీసుకెళ్లి తమ సంరక్షణలో ఉంచుకుంది. అక్కడే ఆమె తన ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని విస్తరించుకుని, క్రమంగా సైకాలజీ అంశంలో కూడా ఆసక్తి పెంచుకుంది. చివరకు అమెరికాలో చదువుకునే అవకాశం లభించడంతో అమితానందానికి గురైంది. ఇతరుల జీవితాలను కూడా ఇది మారుస్తుందని, తన నేపథ్యాన్ని కూడా తాను గౌరవిస్తానని ఆమె తెలిపింది. ఇటీవలే ముంబైలో విమానం ఎక్కి.. అమెరికాకు వెళ్లిపోయింది. -
ఫేస్బుక్ కలిపింది ‘భాయ్’
వీళ్ల నవ్వుల వెనుక ఓ మాంచి సెంటిమెంట్ సినిమాకు కావాల్సిన కథ ఉంది. చిన్నప్పుడు అన్నదమ్ములు విడిపోవడం.. ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడం వంటివి మనం సినిమాల్లో చూశాం. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ చూసేద్దాం. ఎందుకంటే పుణేకు చెందిన వీరిద్దరూ అలాంటివారే. 11 ఏళ్ల తర్వాత కలిశారు. ఇందులో గడ్డం, తలపాగాతో కనిపిస్తున్న యువకుడి పేరు అంకుశ్ అలియాస్ గురుబజ్ సింగ్. చిన్నప్పుడు తెగ అల్లరి చేసే అంకుశ్ ఓసారి తన అంకుల్ బైక్ తీసుకెళ్లి.. మరో వాహనానికి గుద్దించేశాడు. దీంతో అంకుల్, అమ్మ ఒకటే తిట్లు, వీపు విమానం మోత మోగిపోయింది. ఆ సమయంలో కోపంలో ఉన్న వాళ్లమ్మ హేమలత రూ.50 అంకుశ్ మొహాన విసిరేసి.. తనకిక కనిపించొద్దని అరిచింది. దీంతో ఫీలైన అంకుశ్ రోడ్డెక్కాడు. అప్పుడు అతడికి 13 ఏళ్లు. దారిలో అంకుశ్‌కు ఓ సిక్కు లారీ డ్రైవర్ లిఫ్ట్ ఇచ్చాడు. ముంబై నుంచి నాందేడ్ పోతున్న ఆయన అంకుశ్ విషయం తెలుసుకుని తనతోపాటు పంజాబ్ వచ్చేస్తే.. బాగా చూసుకుంటానన్నాడు. అయితే, అంకుశ్ ఇష్టపడకపోవడంతో నాందేడ్‌లోని ఓ గురుద్వారా వద్ద దింపేసి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి గురుద్వారాలోని వంట గ దిలో పనికి కుదిరిన అంకుశ్‌ను చూసి.. లూధియానాలోని ఓ గురుద్వారాలో పనిచేసే మేజర్ సింగ్ తనతోపాటు అక్కడికి తీసుకెళ్లారు. అక్కడే సిక్కుగా మారాడు. గురుబజ్సింగ్గా పేరుమార్చుకున్నాడు. తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని.. ప్రజలు దానం చేసే సామాన్లను గురుద్వారాకు తరలించే పనిని చేయడం ప్రారంభించాడు. అయితే, ఇటీవల సహచర ఉద్యోగితో జరిగిన గొడవ అతడి ధ్యాస ఇంటిపైకి మళ్లేలా చేసింది. తన తమ్ముడు సంతోష్(అంకుశ్ పక్కనున్న యువకుడు) పేరును ఫేస్బుక్లో కొట్టి.. వెతికాడు. లక్కీగా దొరికాడు. దీంతో జూలై 21న ‘నేను నీ సోదరుడిని. ఈ నంబర్‌కు నాకు ఫోన్ చేయి’ అంటూ సంతోష్‌కు మెసేజ్ పెట్టాడు. నిజమా కాదా అంటూ సంతోష్ ఫేస్బుక్లో అంకుశ్ ఫొటో చూశాడు. చూస్తే.. సిక్కులా గడ్డం పెంచుకుని కనిపించాడు. దీంతో గందరగోళంలో పడిపోయాడు. అయితే, తల్లి హేమలత అతడి ముఖకవళికలు, బుగ్గపై ఉన్నగాటును చూసి గుర్తుపట్టింది. అంతే.. సంతోష్ ఫోన్ చేయడం.. అంకుశ్ జూలై 28న జీలం ఎక్స్‌ప్రెస్‌లో లూధియానా నుంచి పుణే వచ్చేయడం జరిగిపోయాయి. ఇక పుణేలోనే ఉంటాలనుకుంటున్న అంకుశ్ అలియాస్ గురుబజ్ సింగ్ మతం మార్చుకునే ఉద్దేశాలేవీ లేవంటున్నాడు. అటు వాళ్లమ్మ ఇంకెప్పుడూ నిన్ను తిట్టనురా కన్నా అంటూ కొడుకును గారం చేసే పనిలో మునిగిపోయింది.