ఛార్మినార్
రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నేపథ్యంలో మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఒక్క హైదరాబాద్ విషయంలోనే పీటముడి పడింది. ఆరు దశాబ్దాలుగా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌పై హక్కులు ఎవరివనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ప్రత్యేక తెలంగాణ ప్రకటన కూడా ఎలాంటి స్పష్టత లేకుండా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎవరి సొత్తు? భాగ్యనగర అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎంత?. హైదరాబాద్ విలువ ఎంతో లెక్క కట్టడం సాధ్యమయ్యే పనేనా?! అసలు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏంచెబుతోంది? రాష్ట్రం విడిపోతే వాటాల పంపకాలు ఎలా జరుగుతాయి? ....ఇలా అనేక ప్రశ్నలు తలెత్తాయి.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై గతంలో పెద్దగా చర్చ జరగలేదు. అసలు రాష్ట్రం విడిపోతుందా లేదా అనే ఊహాగానాలను తెరదించుతూ గత నెల 30న కేంద్రం ప్రకటన వెలువడింది. దాంతో ఇన్నాళ్లు జరిగిన చర్చలు మూలన పడి అసలు వాదనలు మొదలయ్యాయి. రాష్ట్రం విడిపోతే కొత్త రాష్ట్రాల ఏర్పాటు - అక్కడి అభివృద్ధి - కేంద్ర ప్యాకేజీలు ఇలాంటి విషయాలు పక్కన పెడితే అసలు రాజకీయమంతా హైదరాబాద్ చుట్టూనే తిరుగుతోందనేది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్ అవతరించి సుమారు 60 సంవత్సరాలు కావస్తోంది. ఈ ఆరు దశాబ్దాల పాటు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌పై హక్కులు తెలంగాణ వాసులవా లేకపోతే ఉమ్మడి సీమాంధ్రులకు కూడా చెందుతుందా అనేది ఇపుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.
1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణతో హైదరాబాద్ రాజధాని నగరమైంది. ఆంధ్రా - తెలంగాణ - రాయలసీమ మూడు ప్రాంతాలకు రాజధాని కావడంతో భాగ్యనగరంలో అభివృద్ధి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒక పెద్ద రాష్ట్రానికి రాజధాని నగరం కావడంతో అప్పటికే దేశ ప్రధాన నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ మరింత బలపడింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెరిగాయి. అంతే కాకుండా పరిశ్రమలు - విద్యా సంస్థలు - పరిశోధనా సంస్థలు - హైటెక్ హంగులు - అంతర్జాతీయ విమానాశ్రయం - ఫ్లైఓవర్లు.....ఇలా ఒక రాష్ట్ర రాజధానిలో ఉండవలసిన హంగులన్నీ సమకూరాయి. దాంతో హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా పెరుగుతూ వచ్చింది. ఈ నగరానికి జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు పెరగంతో అందరి దృష్టి పడింది. జాతీయ వ్యాపార వేత్తలతో పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వ్యాపారస్తులు తమ పెట్టుబడులకు అనుకూలంగా హైదరాబాద్‌ను ఎన్నుకున్నారు. దాంతో ఆంధ్ర, రాయలసీయ ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద ఎత్తున వలసలు కూడా పెరిగాయి. అదే ఈ రోజు రాష్ట్ర విభజనకు ప్రధాన అడ్డంకిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాజధాని కావడంతో హైదరాబాద్ అభివృద్ధి చెందినట్లుగా రాష్ట్రంలో వేరే ఏ ఒక్క నగరం కూడా అభివృద్ధి చెందలేదు. అప్పటి వరకు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న పలు జాతీయ స్థాయి సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, పరిశ్రమలు క్రమక్రమంగా హైదరాబాద్ పరిసరాలకు చేరుకున్నాయి. జాతీయ భధ్రతకు సంబంధించి - అలాగే కీలకమైన రక్షణ రంగానికి సంబంధిచినవి - వ్యూహాత్మక సంస్థలు...ఇలా మొత్తంగా 28 కేంద్ర సంస్థలు హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఇవి కాకుండా జాతీయ విద్య, పరిశోధన,అభివృద్ధి రంగాలకు సంబంధించిన మరో 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 9 విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు ఉన్న చాలా వరకు యూనివర్శిటీలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేవే. దాంతో హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలోని ఇతర జిల్లాలు, సీమాంధ్ర ఇతర జిల్లాల కంటే అధికంగా ఉంది. మూడు ప్రాంతాలకు హైదరాబాద్ రాజధాని కావడంతో రోడ్డు రవాణా వ్యవస్థలు, రైలు మార్గాలు, విమానయానం వంటి రవాణా వ్యవస్థలు మెరుగు పడ్డాయి. ఇదివరకే పెద్ద నగరాల్లో ఒకటిగా ఉండి, రాష్ట్ర రాజధాని కూడా కావడంతో అభివృద్ధి ఒక్క హైదరాబాద్ నగరానికే పరిమితమైంది. మిగిలిన ప్రాంతాలన్నీ కూడా నేటికీ హైదరాబాద్ కంటే వెనుకబడి ఉన్నాయనేది అందరికీ తెలిసిన సత్యమే.