అన్నీ ఆటంకాలే | BJP in talks with DMDK, Sushma Swaraj says | Sakshi

అన్నీ ఆటంకాలే

Feb 1 2014 11:41 PM | Updated on Sep 2 2017 3:15 AM

అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకేకు ప్రస్తుతం భలే గిరాకీ ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో

సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకేకు ప్రస్తుతం భలే గిరాకీ ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీని తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే, బీజేపీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. చాపకింద నీరులా కాంగ్రెస్ వర్గాలు విజయకాంత్‌తో మంతనాలు సాగిస్తున్నాయి. ప్రజాభీష్టం మేరకు తన నిర్ణయం ఉంటుందని, మహానాడులో పొత్తు ఎవరితోనన్న విషయాన్ని ప్రకటిస్తానంటూ విజయకాంత్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. దీంతో ఆయన దారి ఎటో అన్న ఉత్కంఠ పెరిగింది.ఆటంకాలు: విల్లుపురం జిల్లా ఉలందూరుపేట వేదికగా పార్టీ మహానాడుకు ఏర్పాట్లు చేస్తూ వచ్చా రు. పార్టీ జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేల నేతృత్వంలో భారీ హంగులతో ఏర్పాట్లు సాగినా, పోలీసుల అనుమతి దక్కేనా అన్న ఉత్కంఠ నెలకొంది. మహానాడు తేదీ సమీపించేకొద్దీ ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 
 
 ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ఆ మహానాడుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఏర్పాట్లలో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ వచ్చిన పోలీసు యంత్రాంగం, 24 నిబంధనలు విధించింది. తమ సూచనల మేరకే ఏర్పాట్లు ఉండాలని, తాము సూచించే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారుల్లో వాహనాలు నిలిపేందుకు వీలు లేదని, ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకూడదని, రాత్రి పది గంటల్లోపు ముగించాలని, ఇలా డీఎండీకే వర్గాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ నిబంధనలను విధించారు. నిబంధనలతో కూడిన అనుమతి దక్కడంతో ఊపిరి పీల్చుకున్న డీఎండీకే వర్గాలు ఆగమేఘాలపై ఏర్పాట్లు పూర్తి చేశాయి. శనివారం ఈ పనులను పోలీసులు అడుగడుగున అడ్డుకోవడంతో పలు చోట్ల ఆ పార్టీ వర్గాలు ఆందోళనలకు దిగాల్సి వచ్చిం ది. పలువురిపై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. 
 
 సర్వం సిద్ధం: ఉలందూరు పేటలో మహానాడుకు సర్వం సిద్ధం చేశారు. 250 ఎకరాల స్థలంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేదికను మూడు విభాగాలుగా తీర్చిదిద్దారు. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్, కాంచీపురం కోట తరహాలో 150 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో వేదికను సిద్ధం చేశారు. ప్రవేశ మార్గానికి ఇరు వైపులా సినీ స్టైల్ సెట్టింగ్‌లు, అశ్వదళాలు ఆహ్వా నం పలుకుతున్నట్టుగా బొమ్మల్ని కొలువు దీర్చారు. 7200 ప్రదేశాల్లో డీఎండీకే చిహ్నం అతిపెద్ద ఢంకాలను తీసుకొచ్చి పెట్టారు. సర్వం సిద్ధం చేసినా, ఆదివారం మహానా డు వేళ మరెన్ని ఆటంకాలు ఎదురు కాబోతున్నాయో, మరెందరిపై కేసుల పెట్టనున్నారోనన్న ఆందోళనలో డీఎండీకే వర్గాలు ఉన్నాయి. ఇందుకు కారణం పోలీసుల ఆటంకాలే. పోలీసుల చర్యలను విజయకాంత్ తీవ్రంగా ఖండించారు. కార్యకర్తలు సంయమనం పాటించి మహానాడును విజయవంతం చేద్దామని పిలుపు నిచ్చారు. 
 
 పొత్తు ప్రకటించేనా: మరికొన్ని గంటల్లో విజయకాంత్ తన ప్రసంగం ద్వారా పొత్తు ఎవరితో అన్నది ప్రకటించేనా అన్న ఉత్కంఠ పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ  అన్నాడీఎంకేతో జత కడుతున్నట్టు స్వయంగా తాను చెప్పకుండా, అప్పటి పార్టీ ప్రిసీడియం చైర్మన్ బన్రూటి రామచంద్రన్ ద్వారా చెప్పించారు.  దీంతో తాజాగా జరిగే మహానాడులో పొత్తుపై విజయకాంత్ స్పష్టమైన ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిలుపు: అవినీతి వ్యతిరేక నినాదంతో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని విజయకాంత్ పిలుపు నిచ్చారు. పార్టీ ప్రకటించిన మేరకు  రిస్ట్ బ్యాండ్ ధరించి చూపుడు వేలు సంకేతాన్ని ఎత్తిచూపుతూ మహానాడుకు హాజరు కావాలని కోరారు. అవినీతిని రాష్ట్రం నుంచి తరిమి కొడదామని, అవినీతి పరులను ఏరి పారేద్దామన్న నినాదాలతో మహానాడు పరిసరాలు మార్మోగాలని పిలుపు నిచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement