Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Fires On Chandrababu for Aqua sector crisis1
ఆక్వా ఆక్రందన పట్టదా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే.. ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతులను దోచుకు తింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఆక్వా ధరలు రోజు రోజుకూ పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు..?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘ప్రభుత్వ స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘రైతులంతా గగ్గోలు పెడితే.. మీడియా, వైఎస్సార్‌సీపీ నిలదీస్తే కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? వంద కౌంట్‌ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200– 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్‌ హాలిడే మినహా వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?’ అని సీఎం చంద్రబాబును నిలదీస్తూ ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబూ..! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా.. ఇలా ప్రతి పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దళారులు రైతుల కష్టాన్ని దోచుకు తింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది గానీ ఎక్కడా బాధ్యత తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే! ⇒ ఎగుమతుల్లోనూ, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వా రంగం దేశంలోనే నంబర్‌ వన్‌. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి మా హయాంలో ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్, ఫీడ్‌ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తెచ్చాం. సిండికేట్‌గా మారి దోపిడీ చేసే విధానాలకు చెక్‌ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం. దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్‌ సమయంలో 100 కౌంట్‌కు కనీస ధరగా రూ.210 నిర్ణయించి ఆ విపత్తు రోజుల్లో రైతులకు బాసటగా నిలిచాం. మా ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడుసార్లు ఫీడ్‌ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్‌ ఆయిల్, సోయాబీన్‌ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15 నుంచి 5 శాతం తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్‌ ధరలు ఒక్క పైసా కూడా తగ్గలేదు. మేం ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నా సరే రేట్లు తగ్గడం లేదు.⇒ గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్‌ పరిధిలో కేవలం 80 – 90 వేల ఎకరాలు మాత్రమే ఉంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 4.22 లక్షల ఎకరాలు ఆ జోన్‌ పరిధిలోకి తెచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64 వేల విద్యుత్‌ కనెక్షన్లు ఉంటే అందులో జోన్‌ పరిధిలో ఉన్న 54 వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్‌ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చు చేశాం. ఆక్వా జోన్లలో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్‌ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి ఎప్పుడు సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరి­ష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేయ­డంతోపాటు అత్యధికంగా ఆర్జి­స్తున్న రంగాన్ని దెబ్బ తీస్తున్నారు. ⇒ చంద్రబాబూ..! ఇప్పటికైనా కళ్లు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్‌లు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. ఇక ముందు కూడా ఇవి కొనసాగుతాయి కాబట్టి ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం సరికాదు.

JEE candidates miss exam over 2 minute delay: blame traffic snarls caused by Deputy CM convoy in Visakhapatnam2
ఈ పాపం.. ఎవరిది పవన్‌?

పెందుర్తి: వారంతా తన కలను సాకారం చేసుకునేందుకు నిద్రాహారాలు మాని తపించారు. జీవిత లక్ష్యం నెరవేరే రోజు వచ్చింది.. కానీ ఎన్నో ఆశలతో పరీక్షకు సిద్ధమైన ఆ విద్యార్థులకు సోమవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పర్యటన శాపంగా మారింది. ఉదయం నుంచే కూటమి నేతల కోలాహలం.. కఠినమైన ఆంక్షల కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకుని 23 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్షకు దూరమయ్యారు.పవన్‌కళ్యాణ్‌ కాన్వాయ్‌ కోసం ఎన్‌ఏడీ నుంచి పెందుర్తి వరకు వాహనాలను నిలిపివేయడంతో జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులంతా చిక్కుకుపోయారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో నిర్వాహకులు వారిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పవన్‌కళ్యాణ్‌ రాక సందర్భంగా ట్రాఫిక్‌ను ఆపలేదని.. బీఆర్‌టీఎస్‌ మధ్య రోడ్డులో ఆయన వెళ్లారని.. మిగిలిన సర్విస్‌ రోడ్లపై ఇతర వాహనాలు యథావిధిగా ముందుకు సాగాయని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అసలేం జరిగింది..! అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో ఎన్‌ఏడీ కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు ఉదయం నుంచి పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. పవన్‌ ప్రత్యేక విమానంలో ఉదయం 8.15 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోగా 6.30 నుంచే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వచ్చారు. పవన్‌ కాన్వాయ్‌కు కేటాయించిన బీఆర్‌టీఎస్‌ మధ్య రోడ్డులో ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేయగా.. ఎడమ, కుడి మార్గాల్లోనూ ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్‌ మందకొడిగా సాగింది. ఈ రోడ్డులో 7.30 నుంచి ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రించారు.దీంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్‌ను కఠినంగా నియంత్రించడం.. జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడంతో బీఆర్‌టీఎస్‌ సర్విస్‌ రోడ్డుపై రద్దీ పెరిగిపోయి విద్యార్థులు జేఈఈ పరీక్షకు ఆలస్యమైనట్లు స్పష్టమవుతోంది. మరోపక్క పవన్‌ ఎయిర్‌పోర్టులో ఉదయం 8.21 గంటలకు బయల్దేరగా వేపగుంట నుంచి పెందుర్తి మార్గంలో అన్ని వైపులా ఉదయం 8.10 గంటలకే ట్రాఫిక్‌ను నిలిపివేసేలా జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.దీనివల్ల పవన్‌వెళ్లే వరకు ఆ మార్గంలో వాహనాలు కదల్లేదు. దీంతో వేపగుంట నుంచి చినముషిడివాడ కేంద్రానికి కేవలం 10 నిమిషాల లోపు చేరుకోవాల్సిన విద్యార్థులు ఆలస్యమయ్యారు. మరోవైపు జనసేన పార్టీ నిబంధనల ప్రకారం గజమాలతో అధినేతను గానీ ఇతర నాయకులను గానీ సత్కరించడం నిషిధ్ధం. కానీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గజమాలతో పవన్‌ను (షెడ్యూల్‌ ప్రకారం పవన్‌కళ్యాణ్‌ ఎక్కడా ఆగే వీలు లేదు) సత్కరించేందుకే ఇంత హడావిడి చేసి విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయేలా చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.పవన్‌ వెళుతున్న రోడ్డులోనే ఉన్న చినముషిడివాడలోని అయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో 1,350 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్షకు హజరవుతున్నారని తెలిసి కూడా అధికారులు దానిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్‌కళ్యాణ్‌ పర్యటన కారణంగా ట్రాఫిక్‌ నిలిపివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. చినముషిడివాడ కేంద్రంలో జేఈఈ పరీక్షకు సగటున 50 నుంచి 70 మంది గైర్హాజరు అవుతున్నట్లు సీపీతో పాటు వెస్ట్‌ జోన్‌ ఏసీపీ పృధ్వితేజ పేర్కొన్నారు.అలా ఎలా సార్‌!!సాధారణంగా ఎన్‌ఏడీ కొత్త రోడ్డు నుంచి బీఆర్‌టీఎస్‌ మీదుగా చినముషిడివాడ చేరుకోవడానికి వాహనం / ట్రాఫిక్‌ పరిస్థితిని బట్టి 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కాన్వాయ్‌ చినముషిడివాడ అయాన్‌ డిజిటల్‌ కేంద్రాన్ని ఉదయం 8.41 గంటలకు (ఎయిర్‌పోర్టులో బయలుదేరిన సమయం ఉదయం 8.21 గంటలు అని చెబుతున్నారు) దాటిందని చెబుతున్నారు. ఒక వీవీఐపీ వస్తున్నారంటే కనీసం గంట ముందు నుంచే ఇటు పోలీసులు అటు పార్టీ అభిమానులు, నాయకుల హడావుడి ఉంటుంది. అంటే ఉదయం 7 నుంచే రోడ్లపై వారి హంగామా మొదలైంది.బీఆర్‌టీఎస్‌ మధ్య మార్గంలో ఇతర వాహనాలపై నిషేధం విధించడం.. వాటిని సర్విసు రోడ్డులోకి మళ్లించడం.. జనసేనతో పాటు ఇతర కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల ఓవరాక్షన్‌ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని జేఈఈ పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే పోలీసులు తప్పుడు వివరణలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఎయిర్‌పోర్టు నుంచి చినముషిడివాడకు డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ రావడానికి 20 నిమిషాల సుదీర్ఘ సమయం (వీవీఐపీల ప్రయాణ సమయం సుమారుగా 10 నిమిషాలు) పట్టడం మరో ఆశ్చర్యకరమైన విషయం.నా కల చెదిరింది..జేఈఈ రాసి ఉన్నతస్థాయిలో నిలవాలన్నది నా కల. దీని కోసం చాలా కష్టపడ్డా. మా ఇంటి (కంచ­రపాలెం) నుంచి చినముషిడివాడకు ఎంత ట్రాఫిక్‌ ఉన్నా 30–40 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఎన్‌ఏడీ కొత్త రోడ్డుకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్‌ ఉంది. అక్కడి నుంచి చినముషిడివాడ చేరుకోవడానికి 45–50 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయా. నా కల చెదిరిపోయింది. – బొడ్డు జశ్వంత్, జేఈఈ అభ్యర్థి, కంచరపాలెంవిచారణ చేపట్టండి: పవన్‌కళ్యాణ్‌సాక్షి, అమరావతి: పెందుర్తి ప్రాంతంలో జేఈఈకి కొందరు విద్యార్థులు హాజరుకాలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఆదేశించారు. తన కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్‌ని ఆపేశారు, పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్‌ పరిస్థితి, సర్వీసు రోడ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించారా? వంటి అంశాలపై విచారించాలని సూచించారు. రేయింబవళ్లు కష్టపడి.. జేఈఈ పరీక్ష కోసం మా అబ్బాయి రేయింబవళ్లు కష్టపడి చదివాడు. చినముషిడివాడ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ఉదయం 6.30కే ఇంటి నుంచి బయలుదేరాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిపేయడంతో చిక్కుకుపోయాం. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో లోపలికి అనుమతించలేదు. మా అబ్బాయి మళ్లీ పరీక్ష రాసేలా పవన్‌కళ్యాణ్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సత్యవతి, కంచరపాలెం, విద్యార్థి తల్లిఏం చేయాలో.. మాది సాధారణ కుటుంబం. జేఈఈపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. తుని నుంచి వేకువజామున బయలుదేరి వచ్చా. ఎన్‌ఏడీ వచ్చేసరికి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పరీక్షా కేంద్రానికి మరో 10 నిమిషాల్లో చేరుకుంటాననగా ట్రాఫిక్‌ను ఆపేశారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో అనుమతించలేదు. ఇప్పుడు నా భవిష్యత్‌ ఏమిటో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – ఆళ్ల హేమంత్, తునిమరో అవకాశం ఇవ్వాలి.. బాబు, పవన్‌ స్పందించాలి ముమ్మాటికి పవన్‌కళ్యాణ్‌ పర్యటన కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ వల్లే మా పిల్లలు పరీక్షకు ఆలస్యం అయ్యారు. లేదంటే నిర్దేశిత సమయానికి చాలా ముందే కేంద్రానికి చేరుకునేవాళ్లు. పరీక్షకు అనుమతించకపోవడంతో పిల్లల భవిష్యత్‌ పాడవుతుంది. మంగళవారం వరకు పరీక్షలు ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ మరో అవకాశం ఇవ్వాలి. దీనిపై పవన్, చంద్రబాబు ఉన్నత స్థాయిలో మాట్లాడాలి. – అనిల్, విద్యార్థి తండ్రిట్రాఫిక్‌ వల్లే.. ఎన్‌ఏడీ నుంచి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయా. చాలా దూరం ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అయినా ఏదోలా కేంద్రానికి చేరుకున్నా రెండు నిమిషాలు ఆలస్యం అయ్యానని పరీక్షకు అనుమతించలేదు. కేవలం ట్రాఫిక్‌ వల్లే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయా. – ఆర్యన్‌రాజ్‌

Rs 14 lakh crore wiped off from Indian stock market as Trump tariffs3
మార్కెట్లు భగ భగ

‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్‌... ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న భగభగలు చల్లారటం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్నీ కాళ్ల బేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్‌ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా, జపాన్‌ సహా పలు దేశాల అధినేతలు ట్రంప్‌తో చర్చలకు వెళుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా... చైనా మాత్రం దిగిరాలేదు. పైపెచ్చు ట్రంప్‌ టారిఫ్‌లకు జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచటంతో ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సోమవారం అమెరికా మార్కెట్లు మొదట్లో కోలుకున్నట్లు కనిపించినా ఈ ట్రేడ్‌ వార్‌ భయాలతో మళ్లీ భారీ పతనం దిశగా కదిలాయి. మరోవంక ట్రంప్‌ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60 శాతానికి చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి. దీంతో భారత్‌ సహా ప్రపంచ మార్కెట్లన్నీ సోమవారం భారీ పతనాన్ని చూశాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 4 వేల పాయింట్ల వరకూ నష్టపోయినా చివరకు కాస్త కోలుకుని 2,226.79 పాయింట్లు (–2.95%) క్షీణించి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (–3.24%) పడిపోయి 22,160 వద్ద ముగిసింది. ఈ పతనంతో రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనంఅవుతున్నాయి. మరోవైపు హాంకాంగ్‌ సూచీ హాంగ్‌సెంగ్‌ 15% నష్టపోగా... తైవాన్‌ వెయిటెడ్‌ 11%, జపాన్‌ నికాయ్‌ 8%, సింగపూర్‌ స్ట్రెయిట్‌ టైమ్స్‌ 8%, చైనా షాంఘై 7% చొప్పున నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ట్రంప్‌ టారిఫ్‌ వార్‌తో ప్రపంచ మార్కెట్లను బేర్‌ చీల్చిచెండాడింది. ఆసియా నుంచి అమెరికా దాకా బ్లాక్‌ మండే దెబ్బకు ఇన్వెస్టర్లు కుదేలయ్యారు. అమెరికా సుంకాలకు చైనా ప్రతీకార టారిఫ్‌లు విధించడం.. ఇతర దేశాలూ అదే బాటలో వెళ్తుండటంతో వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ద్రవ్యోల్బణం ఎగబాకి ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చనే భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఈ ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్‌పైనా విరుచుకుపడింది. ఫలితంగా భారత స్టాక్‌ సూచీలు పది నెలల్లో (2024 జూన్‌ 4 తర్వాత) అతిపెద్ద నష్టాన్ని చూశాయి. సెన్సెక్స్‌ 2,227 పాయింట్లు క్షీణించి 73,138 వద్ద, నిఫ్టీ 743 పాయింట్లు నష్టపోయి 22,162 వద్ద నిలిచింది. ఈ క్రాష్‌తో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ సోమవారం ఒక్కరోజే రూ.14.09 లక్షల కోట్లు ఆవిరై రూ.389 లక్షల కోట్ల (4.54 ట్రిలియన్‌ డాలర్లు)కు పడిపోయింది. ఒకానొక దశలో సంపద రూ.20.16 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ముంబై: గత వారాంతంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో సోమవారం ఆసియా మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఆ సెగతో మన సూచీలు కూడా భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా 3,915 పాయింట్ల క్షీణతతో 71,450 వద్ద, నిఫ్టీ 1,146 వద్ద పతనంతో 21,758 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 3,940 పాయింట్లు, నిఫ్టీ 1160 పాయింట్లు దిగజారాయి. జాతీయ, అంత్జాతీయ ప్రతికూలతల ప్రభావంతో రోజంతా భారీ నష్టాల్లో కదలాడాయి. అయితే కనిష్టాల వద్ద కొన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత భర్తీ అయ్యాయి.→ సెన్సెక్స్‌ సూచీలో ఒక్క హెచ్‌యూఎల్‌ (0.25%) మినహా మిగిలిన 29 షేర్లు నష్టాలు చవిచూశాయి. రంగాల వారీగా సూచీల్లో మెటల్‌ 6.22%, రియల్టీ 5.69%, కమోడిటీస్‌ 4.68%, ఇండ్రస్టియల్‌ 4.57%, కన్జూమర్‌ డి్రస్కేషనరీ 4%, ఆటో 3.77%, బ్యాంకెక్స్‌ 3.37%, ఐటీ, టెక్‌ మూడు శాతాలు క్షీణించాయి. బీఎస్‌ఈలో 3,515 షేర్లు నష్టపోయాయి. 570 స్టాక్స్‌ లాభపడ్డాయి. మిగిలిన 140 షేర్లలో ఎలాంటి మార్పుల్లేవు. 775 స్టాక్స్‌ ఏడాది కనిష్టాన్ని , 59 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి.ఐటీ షేర్లు.. హాహాకారాలు... ఆర్థిక మాంద్య భయాలతో అమెరికా నుంచి అధిక ఆదాయాలు ఆర్జించే ఐటీ షేర్లు భారీ క్షీణించాయి. ఆన్‌వర్డ్‌ టెక్నాలజీస్‌ 14%, జెనెసిస్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ 11% క్షీణించాయి. క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ 10%, జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషియన్‌ సరీ్వసెస్, డేటామాటిక్స్‌ గ్లోబల్‌ సరీ్వసెస్‌ 9%, న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ 8%, హ్యాపియెస్ట్‌ మైండ్స్, సొనాటా సాఫ్ట్‌వేర్, టాటా టెక్నాలజీ, ఎంఫసిస్‌ 6% క్షీణించాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్‌ 4%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3%, టెక్‌ మహీంద్రా 2.50%, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 2%, విప్రో ఒకశాతం, టీసీఎస్‌ అరశాతంనష్టపోయాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ గడిచిన మూడు ట్రేడింగ్‌ సెషన్లలో 8 శాతం క్షీణించింది.టాటా.. టప టపా!టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్స్‌ రంగాల్లో అధిక భాగం వ్యాపారాలు కలిగిన టాటా గ్రూప్‌ షేర్లు డీలా పడ్డాయి. టాటా ట్రెంట్‌ షేరు 15%, టాటా స్టీల్‌ 9%, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీ 6%, టీసీఎస్, టాటా కెమికల్స్, టైటాన్, ఇండియన్‌ హోటల్స్‌ షేర్లు 5–2% నష్టపోయాయి. ఈ గ్రూప్‌లో మొత్తం 16 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.90,000 కోట్లు హరించుకుపోయి రూ.25.3 లక్షల కోట్లకు దిగివచి్చంది. ఒకానొక దశలో రూ.2.3 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ కోల్పోయింది.అప్రమత్తత అవసరం: నిపుణులుతీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్‌ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పట్టకీ.., ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగా ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చు. రక్షణాత్మక రంగాల్లో పెట్టుబడి మరీ మంచిది అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యూహకర్త వి.కే. విజయ్‌కుమార్‌ తెలిపారు.

Deputy CM Bhatti orders withdrawal of cases against HCU students4
కేసులు ఎత్తేయండి.. హెచ్‌సీయూ విద్యార్థులపై భట్టి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్‌ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్‌ కమిటీ సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన సమావేశమైంది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివధర్‌రెడ్డి, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అభిషేక్‌ మహంతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (యూహెచ్‌టీఏ), పౌర సమాజ ప్రతినిధులు కూడా వారితో సమావేశమై పలు డిమాండ్లు ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్కడ పోలీసు పహారా తప్పనిసరి పౌర సమాజ ప్రతినిధులు, యూహెచ్‌టీఏ ప్రస్తావించిన పలు అంశాలు, డిమాండ్లపై మంత్రుల ఉప కమిటీ కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాల ఉప సంహరణ కోసం హెచ్‌సీయూ వీసీకి లేఖ రాస్తామని హామీ ఇచి్చంది. విద్యార్థులు, హాస్టళ్ల భద్రతకు సంబంధించి వీసీ హామీ ఇస్తే బలగాలను ఉపసంహరిస్తామని పేర్కొంది. అయితే వివాదానికి కేంద్ర బింధువుగా ఉన్న 400 ఎకరాల్లో మాత్రం పోలీసు బందోబస్తు కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 400 ఎకరాల భూమిని రక్షించేందుకు పోలీసు పహారా తప్పనిసరి అని పేర్కొన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరినీ 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేమని తెలిపారు. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని, అయితే సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు యూనివర్సిటీకి రాలేమని చెప్పారు. అయితే విద్యార్థులపై కేసులను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకునేలా పోలీసు, న్యాయ శాఖతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. డిమాండ్లు అంగీకరిస్తేనే జేఏసీ నేతలు వస్తారు: యూహెచ్‌టీఏ మంత్రుల సబ్‌ కమిటీని కలిసిన యూనివర్సిటీ అధ్యాపక, పౌర సమాజ ప్రతినిధులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్‌ను సందర్శించే ముందు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టాన్ని అంచనా వేయడంతో పాటు జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే విద్యార్థి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఈ సమావేశానికి హాజరు కాలేదని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. పైన పేర్కొన్న తక్షణ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే విద్యార్థి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు మంత్రుల కమిటీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారని యూహెచ్‌టీఏ, పౌర సమాజ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రొఫెసర్లు సౌమ్య, శ్రీపర్ణ దాస్, భంగ్యా భూక్యా, పౌర సమాజ ప్రతినిధులు విస్సా కిరణ్‌ కుమార్, వి.సంధ్య, కె.సజయ, ఇమ్రాన్‌ సిద్దికీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

YS Jagan Questions To CM Chandrababu Naidu: Andhra pradesh5
జీఎస్‌డీపీపై ఇన్ని బోగస్‌ మాటలా బాబూ?

సాక్షి, అమరావతి: ‘‘గత ఆర్థిక సంవత్సరం (2024–­25)లో మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16 శాతం మాత్రమే నమోదైతే... రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీ­యమేనా?’’ అని సీఎం చంద్రబాబును ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే.. మీ ప్రభుత్వ మొదటి ఏడాది పనితీరు, ఆర్థిక అరాచకాలను కప్పి పుచ్చేందుకే జీఎస్‌డీపీ వృద్ధి రేటును పెంచారన్న వాస్తవం వెల్లడవు­తుం­దని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రం విశ్వసనీయ­తను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర విశాల ప్రయోజనాలు, ప్రతిష్ట, విశ్వసనీయతను కాపా­డేం­దుకు.. జీఎస్‌డీపీలో అతిగా వేసిన అంచనాలను సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలి­కారు. ఈమేరకు సోమవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. అందులో ఏమన్నారంటే..è చంద్రబాబూ..! మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. మీ అనుభవం, సమర్థతతో వాటిని అధిగమించి రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా సంస్థలతో కలసి మీరు విశ్రాంతి లేకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేసిందన్న దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ⇒ నాడు కోవిడ్‌ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2019–24లో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పెరుగుదలలో వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 13.57 శాతం మాత్రమే. అదే 2014–19లో కోవిడ్‌ లాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా సరే రాష్ట్ర అప్పుల వార్షిక వృద్ధి రేటు 22.63 శాతంగా ఉంది. వీటిని బట్టి చూస్తే.. 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరు ప్రశంసించ దగ్గదన్నది స్పష్టమవుతోంది. ⇒ కోవిడ్‌ ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ 2019–24 మధ్య ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో దేశ వృద్ధి రేటును రాష్ట్ర వృద్ధి రేటు అధిగమించింది. 2025 మార్చిలో విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, ఎంవోఎస్‌పీఐ నివేదికలే అందుకు నిదర్శనం. అయినప్పటికీ 2019–24లో రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఉందని మీరు చెబుతున్నారు.⇒ మరోవైపు మీ పాలనలో మొదటి సంవత్సరంలో చాలా ఆందోళనకరమైన ధోరణి ఆవిష్కృతమైంది. కోవిడ్‌ లాంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ.. 2024–25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు, పన్నే­తర ఆదాయాల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా పెరగకపోతే, అప్పులు చేయక­పోతే.. మీ ప్రభుత్వం ప్రాథమిక ఖర్చులను కూడా తీర్చలేకపోయేది. మీ అసమర్థ పాలన.. అసంబద్ధ విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఇంకా ప్రధానమైన విషయం ఏమిటంటే .. మీ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది.⇒ రాష్ట్ర ఆర్థిక పనితీరును బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సిన అవసరాన్ని పూర్తిగా విస్మరించి.. రాష్ట్ర ఆర్థిక పనితీరుపై తప్పుడు ప్రచారం చేయడానికి మీ ప్రభుత్వం అన్ని ప్రయత్నా­లను చేస్తుండటం ఆందోళనకరం. రాష్ట్ర ఆర్థిక పనితీ­రును ఒక్కసారి పరిశీలిస్తే.. ఎంత ఇబ్బంది, దోపిడీ జరుగుతుందో తెలుస్తుంది. అయినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని మీరు అబద్ధం చెబుతున్నారు.⇒ ఎంవోఎస్‌పీఐ విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్రం ఈమేరకు పనితీరు కనబరుస్తున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం వెల్లడిస్తోంది. నిజానికి ఎంవోఎస్‌పీఐ విడుదల చేసే డేటాకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్‌ డేటానే మూలం. దీన్ని బట్టి చూస్తే.. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన డేటా మినహా మరొకటి కాదు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ముందస్తు అంచనాలు మాత్రమే. వాటిని ఎంవోఎస్‌పీఐ వంటి ఏ స్వతంత్ర సంస్థ ధృవీకరించలేదు. ⇒ 2024–25లో కేంద్ర పన్నుల ఆదాయాలు ఫిబ్రవరి 25 వరకూ 10.87 శాతం వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2024–25లో దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 6.48 శాతంగా అంచనా వేసింది. ఇది సమర్థనీయమే. ⇒ తమిళనాడు ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి 2025 వరకు 13.01 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు జీఎస్‌డీపీ వృద్ధి రేటు 9.69 శాతంగా అంచనా వేసింది. ఇది కూడా సమర్థనీయమే.⇒ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి వరకు 2.16 శాతం మాత్రమే పెరిగితే.. జీఎస్‌డీపీ వృద్ధి రేటు 8.21 శాతంగా ఉంటుందని మీ ప్రభుత్వం అంచనా వేసింది. మరి ఇది సమర్థనీ­యమైన­దేనా? పన్ను ఆదాయాల వృద్ధి రేటు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయం 33.35 శాతం తగ్గింది. మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది. ⇒ గత సంవత్సరం మీ ప్రభుత్వ ఆర్థిక పనితీరు పేలవంగా ఉండటం ఆదాయాల తీరును బట్టి స్పష్టంగా కనిపిస్తున్నందున.. ఈ సంవత్సరం ఇంత బలమైన ఆర్థిక పనితీరు గురించి మీ ప్రభుత్వ అంచనాను మీరు ఎలా సమర్థిస్తారు? ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్ను ఆదాయంలో పెరుగుదల ముందస్తు జీడీపీ వృద్ధి అంచనా కంటే ఎక్కువగా ఉంది. ఇది సముచితం. ఎందుకంటే, ప్రస్తుత ధరల వద్ద వినియోగం, పెట్టుబడి వ్యయంపై పన్నులు విధిస్తారు కాబట్టి.. ఇది వాస్తవ జీడీపీ వృద్ధి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుంది.

IPL 2025: Royal Challengers Bangalore vs Mumbai Indians Live Updates and Highlights6
IPL 2025 RCB vs MI: ఉత్కంఠ‌పోరులో ఆర్సీబీ విజయం

Rcb vs MI Live Updates:ఉత్కంఠ‌పోరులో ఆర్సీబీ విజయంవాంఖడే వేదిక‌గా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 222 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 209 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ‌(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 56) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు. హార్దిక్ ఔట్‌..తిల‌క్ వ‌ర్మ‌(56), హార్దిక్ పాండ్య(35) వికెట్లను ముంబై ఇండియ‌న్స్ వ‌రుస క్ర‌మంలో కోల్పోయింది. ముంబై విజ‌యానికి 11 బంతుల్లో 28 ప‌రుగులు కావాలి.దూకుడుగా ఆడుతున్న తిల‌క్‌, పాండ్యా16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. తిల‌క్ వ‌ర్మ‌(46), హార్దిక్ పాండ్యా(34) దూకుడుగా ఆడుతున్నారు. ముంబై విజ‌యానికి 24 బంతుల్లో 52 ప‌రుగులు కావాలి.ముంబై నాలుగో వికెట్ డౌన్‌సూర్య‌కుమార్ యాద‌వ్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 28 ప‌రుగులు చేసిన సూర్య‌కుమార్‌.. య‌శ్‌ద‌యాల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 116 ప‌రుగులు చేసింది. క్రీజులో తిల‌క్ వ‌ర్మ‌(30), హార్దిక్ పాండ్యా(0) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్‌..విల్ జాక్స్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ మూడో వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన విల్ జాక్స్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.5 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 52/25 ఓవ‌ర్లు ముగిసే సరికి ముంబై ఇండియ‌న్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 52 ప‌రుగులు చేసింది. క్రీజులో విల్ జాక్స్‌(13), సూర్య‌కుమార్ యాద‌వ్‌(5) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్‌..ర్యాన్ రికెల్ట‌న్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన రికెల్ట‌న్‌.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై..222 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్ త‌గిలింది. 17 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ‌.. య‌శ్‌ద‌యాల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ వికెట్ న‌ష్టానికి 25 ప‌రుగులు చేసింది.ముంబై ముందు భారీ టార్గెట్‌వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాట‌ర్లు ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(67), ర‌జిత్ పాటిదార్‌(64) హాఫ్ సెంచ‌రీలు సాధించ‌గా.. ప‌డిక్క‌ల్‌(37), జితేష్ శ‌ర్మ‌(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో బౌల్ట్‌, హార్దిక్ పాండ్యా త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. విఘ్నేష్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్‌..లివింగ్ స్టోన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఖాతా తెర‌వ‌కుండానే లివింగ్ స్టోన్ పెవిలియ‌న్‌కు చేరాడు. 15 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆర్సీబీ 4 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్‌.. కోహ్లి ఔట్‌విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. నిల‌క‌డ‌గా ఆడుతున్న విరాట్‌, పాటిదార్‌13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ రెండు వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(60), పాటిదార్‌(19) ఉన్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్‌..దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 37 ప‌రుగులు చేసిన ప‌డిక్క‌ల్‌.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ రెండు వికెట్ల న‌ష్టానికి 95 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. 53 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న కోహ్లి..విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. 25 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్టానికి 43 ప‌రుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు ప‌డిక్క‌ల్‌(13) ఉన్నారు.ఆర్సీబీకి భారీ షాక్‌.. సాల్ట్ ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. 4 ప‌రుగులు చేసిన ఫిల్ సాల్ట్‌.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్టానికి 17 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ప‌డిక్క‌ల్‌(4) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, రోహిత్ శ‌ర్మ తిరిగి తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.తుది జ‌ట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రా

Sakshi Guest Column On Donald Trump7
ట్రంప్‌ విధ్వంసం

‘గ్రేట్‌ డిక్టేటర్‌’ చిత్రంలో హిట్లర్‌ పాత్రధారిగా అభినయించిన చార్లీ చాప్లిన్‌ గ్లోబ్‌తో ఇష్టానుసారం ఆటలాడుకుంటున్న దృశ్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కేవలం రెండేళ్లలో మీరు ప్రపంచానికే చండశాసనుడు కావొచ్చని చెప్పిన సలహాదారును... తనకు కాసేపు ఏకాంతం కావాలని బయటకు పంపి ఆ గ్లోబ్‌తో రకరకాల విన్యాసాలు చేస్తాడు. చివరికది మొహమ్మీదే భళ్లున బద్దలుకావటంతో ఆ ముచ్చట ముగుస్తుంది. జాత్యహంకారం తలకెక్కి ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని కలలుగన్న హిట్లర్‌పై అది తిరుగులేని వ్యంగ్యాస్త్రం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అలాంటి ఆశలేం లేవుగానీ... వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమరికను తలకిందులు చేయాలన్న సంకల్పం... అందువల్ల అమెరికా భారీగా లాభపడుతుందన్న మూఢ విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసా నంగా గత గురువారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లన్నీ అధోగతిలో పయనిస్తున్నాయి. ట్రంప్‌ విధించిన ప్రతిచర్య సుంకాలతో మాంద్యం ముప్పు తప్పదన్న భయం వెన్నాడుతుండగా ప్రధాన ఈక్విటీల విచ్చలవిడి అమ్మకాలతో మార్కెట్లు పతనమవుతున్నాయి. మన బీఎస్‌ఈ, నిఫ్టీల్లో ఒక్క రోజులో రూ. 14 లక్షల కోట్ల సంపద ఆవిరైందని చెబుతున్నారు. ఆఖరి క్షణంలో స్వల్పంగా కోలుకో వటం వల్ల ఇక్కడితో ఆగింది గానీ రేపన్నరోజు బాగుంటుందన్న భరోసా చాలామందికి లేదు. దేన్నయినా తట్టుకోగల సామర్థ్యమున్న మన ఆర్థిక వ్యవస్థవల్ల త్వరలోనే సాధారణ స్థితి ఏర్పడగల దని చెబుతున్న నిపుణులూ ఉన్నారు. అంతర్జాతీయంగా అయితే ఎక్కడా ఆశారేఖ కనబడటం లేదు. డాలర్‌ బలహీనపడటం, చమురు ధరలు పడిపోవటంలాంటి పరిణామాలన్నీ కేవలం మదుపరుల్లో తాత్కాలికంగా అలుముకున్న నిరాశా నిస్పృహల వల్లే అని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చిత్రమేమంటే... ఇంత జరుగుతున్నా ఈ సంక్షోభాన్ని తాత్కాలికమైనదిగానే ట్రంప్‌ పరిగణిస్తు న్నారు. తానిచ్చిన డోస్‌ పనిచేయటం మొదలెట్టాక అమెరికా ఆర్థిక వ్యవస్థ శరవేగంతో ఎదుగుతుందని విశ్వసిస్తున్నారు. ఇదంతా చూస్తూ కూడా అధికార రిపబ్లికన్లు నోరెత్తరు. విపక్ష డెమాక్రాట్లూ మౌనంగానే ఉంటారు. సాధారణ ప్రజానీకం ‘హ్యాండ్సాఫ్‌ ట్రంప్‌’ అంటూ వేలాదిగా రోడ్లపైకొస్తున్నారు. మొత్తానికి ప్రపంచీకరణ కళ్లముందు కుప్పకూలుతోంది. ఈ ప్రపంచీకరణలో భాగస్వాములు కావటానికి ససేమిరా అన్న వర్ధమాన దేశాల పాలకులను నయానో భయానో దారికి తెచ్చి అక్కడి వనరులన్నిటినీ అమె రికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎడాపెడా వాడుకున్న అమెరికా... ట్రంప్‌ ఏలుబడి వచ్చాక దానికి విరుద్ధమైన పోకడలకు పోతోంది. ఇన్నేళ్లుగా అమెరికాను అన్ని దేశాలూ దోచుకున్నాయని ఎదురు ఆరోపిస్తోంది. గతవారం ‘అమెరికా విముక్తి దినం’ రోజున మిత్రులు, ప్రత్యర్థులన్న విచక్షణ కూడా లేకుండా సుంకాల మోత మోగించేందుకు ట్రంప్‌ అధ్యక్షుడికి వుండే ‘ఎమర్జెన్సీ’ అధికారాలను వినియోగించుకున్నారు. కేవలం యుద్ధ సమయాల్లో వాడుకోవాల్సిన ఈ అధికారాలను రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆయన చేజిక్కించుకున్నా అమెరికన్‌ కాంగ్రెస్‌గానీ, ఇన్నాళ్లుగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిన రిపబ్లికన్లు గానీ, బహుళజాతి కార్పొరేషన్లు గానీ నోరెత్తక పోవటం ఆశ్చర్యకరం. కేవలం కెనడాపై విధించిన అదనపు సుంకాలను రద్దు చేయటం వంటి పరిమిత చర్య మినహా సెనేట్‌ మౌనంగా ఉండిపోయింది. ఈమాత్రం చర్యను కూడా ట్రంప్‌ మద్దతుదారులు సహించలేకపోతున్నారు. మాదకద్రవ్య ముఠాలను అదుపు చేయటా నికి విధిస్తున్న సుంకాలను వ్యతిరేకిస్తారా అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఈ సుంకాల విధింపు గుడ్డెద్దు చేలో పడిన చందాన ఉన్నదని జనాభా పెద్దగాలేని హెర్డ్‌ అండ్‌ మెక్‌డోనాల్డ్‌ ద్వీపాల వంటి అతి చిన్న ప్రాంతాలను సైతం వదలని తీరు గమనిస్తే తెలుస్తుంది. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని కైవసం చేసుకుని, అగ్రగామిగా నిలబడాలని దశాబ్దాలుగా చైనా పథకాలు పన్నుతోంది. ట్రంప్‌ దాన్ని వేగవంతం చేశారు. సుదీర్ఘకాలం నిర్మించుకున్న అనుబంధం కారణంగా ఇన్నాళ్లూ పాశ్చాత్య ప్రపంచం అమెరికాను సమర్థిస్తూ పోయింది. కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటివన్నీ అమెరికా ఏం చేసినా అది లోకకల్యాణం కోసమే నన్నట్టు వంతపాడాయి. ఇలాంటి అనుకూలతలు లేని కారణంగానే పూర్వపు సోవియెట్‌ అయినా, ప్రస్తుత రష్యా అయినా, చైనా అయినా దీటుగా నిలబడలేకపోయాయి. కానీ ట్రంప్‌ దాన్ని కాస్తా మార్చేశారు. కెనడా కొత్త ప్రధాని మార్క్‌ కేర్నీ మాటల్లో చెప్పాలంటే ‘అమెరికా ఇక విశ్వసించదగ్గ భాగస్వామి కాద’ని తేలిపోయింది. జర్మనీ చాన్సలర్‌ కాబోతున్న ఫ్రెడరిక్‌ మెర్జ్‌ అయితే ఇంకాస్త ముందుకుపోయారు. అమెరికా నుంచి యూరప్‌ స్వాతంత్య్రాన్ని సాధించాలని పిలుపు నిచ్చారు. ఇదంతా చివరకు ప్రపంచంలో చైనా పలుకుబడి పెరగడానికి దోహదపడుతుందన్న స్పృహ ట్రంప్‌కు లేకుండా పోయింది. నియమాల ఆధారిత ప్రపంచమే ధ్యేయం అంటూ ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా క్వాడ్‌ను రూపొందించి అమెరికా మనల్ని అందులో భాగస్వా ముల్ని చేసింది. సందర్భం వేరు కావొచ్చుగానీ ఆర్థికరంగంలో ఇవాళ అన్ని నియమాలనూ ఉల్లంఘిస్తున్న అమెరికాను క్వాడ్‌ విషయంలో మనం విశ్వసించవచ్చా అన్న సందేహం కలిగితే ఆశ్చర్యమే ముంది? మౌలికంగా మార్కెట్లు కచ్చితమైన అంచనాల ఆధారంగా ముందుకు కదులుతాయి. మదుపుదార్లు స్వేచ్ఛగా, నిర్భయంగా పెట్టుబడులు పెడతారు. సంపద పోగవుతుంది. కానీ ట్రంప్‌ చర్యలతో అంతా తలకిందులైంది. ఇక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం ఇప్పట్లో సాధ్యమా?

Sakshi Guest Column On PM Modi Two useful trips8
రెండు ఉపయోగకర పర్యటనలు

ప్రధాని మోదీ ఈ నెల మొదటి వారంలో రెండు ఉపయోగకరమైన విదేశీ పర్యటనలు జరిపారు. మొదటిది – 4వ తేదీన థాయ్‌ లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ‘బిమ్‌ స్టెక్‌’ శిఖరాగ్ర సమావేశం కోసం. రెండవది – ఆ మరునాడు శ్రీలంకకు! ఈ రెండూ దేశ ప్రయోజనాలకు అవసరమైనవి కాగా, అద నంగా మరొకటి చెప్పుకోవాలి. బ్యాంకాక్‌లో ఆయన బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ప్రధాన సలహా దారు మహమ్మద్‌ యూనుస్‌తో విడిగా సమావేశం కావటం.లుక్‌ ఈస్ట్‌ – యాక్ట్‌ ఈస్ట్‌వివిధ దేశాల మధ్య పరస్పర సహకారాలే కాకుండా ఒక ప్రాంతానికి చెందిన దేశాల మధ్య అందుకోసం ప్రాంతీయ సంస్థలు ఏర్పడటం ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత నుంచి ఉండగా, ఆ క్రమంలో ఇండియాకు సంబంధించి 1997లో వచ్చిందే ‘బిమ్‌స్టెక్‌’. ఇటువంటివి సార్క్, హిందూ మహాసముద్ర తీర దేశాల సంస్థల పేరిట కూడా ఏర్పడ్డాయి గానీ, కారణాలు ఏవైనా అవి సంతృప్తికరంగా పనిచేయలేదు. ఆగ్నేయాసియాకు సంబంధించి 1967 నుంచి గత 57 ఏళ్లుగా విజయవంతంగా పనిచేస్తున్నది ‘ఆసి యాన్‌’ (అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియన్‌ నేషన్స్‌) ఒక్కటే. ‘ఆసియాన్‌’ దేశాలన్నీ భారత్‌ కన్నా చాలా చిన్నవి. వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్నవే. ఆ పరిస్థితితో పోల్చినప్పుడు భారత్‌ కేంద్రంగా ఒక బలమైన ఆర్థిక సహకార వ్యవస్థ ఎప్పుడో ఏర్పడి బల పడ వలసింది. కానీ, విధానపరమైన లోపాల వల్ల ప్రభుత్వాలు కొంత కాలం అప్పటి సోవియట్‌ వైపు, తర్వాత పాశ్చాత్య ప్రపంచంవైపు చూశాయి గానీ చుట్టూ గల ఆసియా దేశాలను నిర్లక్ష్యం చేశాయి. ఈ వెనుకటి విధానాలకు భిన్నంగా మొదటిసారిగా ‘లుక్‌ ఈస్ట్‌’ పేరిట కొత్త విధానాన్ని ముందుకు తెచ్చింది, 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు. ఆ విధంగా కొత్త దృష్టి అయితే ఏర్పడింది గానీ, ఆయనే అమలుకు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, వాటి అవసరాలను బట్టి అయినా తూర్పు దేశాలతో ఆర్థిక సంబంధాలు తగినంత అభివృద్ధి చెందలేదు. పీవీ ఐదేళ్ల పాలన తర్వాత రాజకీయ అస్థిరతలు ఏర్పడటం అందుకొక ముఖ్య కారణం. అప్పటికీ, విదేశాంగ వ్యవహారాలలో నిపుణుడైన గుజ్రాల్‌ నేషనల్‌ ఫ్రంట్, యునై టెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాల కాలంలో విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా పని చేసినపుడు 1997లో ‘బిమ్‌స్టెక్‌’ కోసం చొరవ తీసుకున్నారు.‘బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ– సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ కో ఆపరేషన్‌’ పేరిట ఏర్పడిన ఆ సంస్థలో మొదట ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ సభ్య దేశాలు కాగా, తర్వాత నేపాల్, భూటాన్, మయన్మార్‌ చేరాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ‘లుక్‌ ఈస్ట్‌’ను ‘యాక్ట్‌ ఈస్ట్‌’గా మార్చి కొంత చురుకుదనం తెచ్చారు.సుదీర్ఘ అశ్రద్ధఇతర ఆసియా దేశాలతో కన్నా ‘బిమ్‌స్టెక్‌’ మధ్య సంబంధాలు మందకొడిగానే ఉన్నాయి. సంస్థ ఆర్థిక, రక్షణ సహకార విషయాలు అధికారుల స్థాయికి పరిమితం కాగా, ఈ నెల నాల్గవ తేదీ నాటి శిఖరాగ్ర సమావేశం ఏడేళ్ల తర్వాత జరగటం గమనించదగ్గది. ఏడు సభ్య దేశాలలో నేపాల్, భూటాన్‌ చిన్నవి, సముద్ర తీరం లేనివి అను కున్నా, తక్కిన అయిదు కూడా ముఖ్యమైనవి, సముద్ర తీరం గలవి. సముద్ర మార్గ రవాణాలు, రక్షణలకు కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ రెండు అంశాలను ‘బిమ్‌స్టెక్‌’ లక్ష్యాలలో ప్రముఖంగా పేర్కొ న్నారు కూడా! అయినప్పటికీ ఇంతకాలం కనిపించిన అలసత్వ వైఖరులు వాటికవే సరైనవి కాదు. ఈ పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో చైనా సన్నిహితమయ్యింది. అనగా, ఇండియాకు భౌగోళికంగా దగ్గరగా ఉండి, బంగాళాఖాత తీర ప్రాంతానివి అయి కూడా భారత్‌ వాటిని ‘బిమ్‌ స్టెక్‌’ ఏర్పాటు తర్వాత సైతం దగ్గర చేసుకోలేక, చైనాతో పోటీపడాల్సి వస్తున్న దన్నమాట. సంస్థలోని తక్కిన దేశాలకన్న భారత ప్రయోజనాలు విస్తృతమైనవి కావటం, బంగాళాఖాతం కీలక ప్రాంతంలో, అందులోనూ హిందూ మహాసముద్రానికి అనుసంధానమై ఉండ టాన్ని బట్టి అటువంటి చొరవలు ఇండియాకే ఎక్కువ అవసరం. అయినా సుదీర్ఘ కాలం అశ్రద్ధలన్నవి ఎంత పొరపాటో చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తిరిగి శిఖరాగ్ర సమావేశం జరగటం మంచి పని. ట్రంప్‌ సుంకాల హెచ్చింపు చర్యలు సృష్టిస్తున్న ఒత్తిడుల మధ్య జరగటం మరింత మంచిదవు తున్నది. సమావేశంలో చర్చించిన ఆర్థిక సహకారం, అభివృద్ధి, శాస్త్ర–సాంకేతిక రంగాలు, రక్షణ వంటి అంశాలు షరా మామూలువే అయినా, ‘ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా పరస్పర అభివృద్ధిపై దృష్టి పెట్టడం’ అన్నది ప్రత్యేకంగా గమనించ వలసిన ప్రకటన. బంగ్లా, లంకలతో సంబంధాలుపోతే, ఇదే సంస్థలోని పొరుగు దేశమైన బంగ్లా నాయకునితో మోదీ సమావేశం, సంబంధాల పునరుద్ధరణకు దారితీసినట్లయితే ఉభయులకూ మేలు చేస్తుంది. ఇండియా జోక్యంతో 1971లో ఏర్ప డిన ఆ దేశంతో సంబంధాలు ఈ 55 ఏళ్ళలో తరచూ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాని షేక్‌ హసీనా పతనం నుంచి కొద్ది నెలలుగా తిరిగి అదే పరిస్థితి తలెత్తింది. ఈ నాయకులిద్దరూ బ్యాంకాక్‌లో అసలు విడిగా సమావేశమవుతారా అనే సందేహాలుండేవి. కానీ, భారత ప్రధానికి అందజేసేందుకు బంగ్లా నాయకుడు జ్ఞాపక చిహ్నంగా ఒక పాత చిత్రాన్ని వెంట తీసుకువచ్చారంటేనే సామరస్య వైఖరి కనిపిస్తున్నది. బంగ్లాలో త్వరలో జరుగనున్న ఎన్నికలలో ఎవరు అధికారానికి రాగలదీ తెలియదు. ఇండియా మిత్ర పక్షమ నుకునే షేక్‌ హసీనా ‘అవామీ లీగ్‌’కు మాత్రం అవకాశాలు కన్పించటం లేదు. ఇండియాలో అనధికార శరణార్థి రూపంలో ఉన్న ఆమెను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని బ్యాంకాక్‌లో మోదీని బంగ్లా నాయకుడు మరొకమారు కోరారు. ఇరు దేశాల సంబంధాలలో ఇదొక చిక్కు ప్రశ్న. అక్కడ హిందువులపై దాడుల సమస్య అట్లానే ఉంది. వీటన్నింటినీ అధిగమిస్తూ ‘బిమ్‌స్టెక్‌’ లక్ష్యాల వైపు కదలటం రెండు దేశాలకూ పెద్ద పరీక్షే. కానీ ఉత్తీర్ణత సాధించక తప్పని పరీక్ష. శ్రీలంక విషయానికి వస్తే, భౌగోళికతలు, ఆర్థిక, రక్షణ అవస రాలు, పరస్పర సహకారాలు, విభేదాలు అన్నింటి విషయాలలోనూ ఇండియా సంబంధాలు బంగ్లాదేశ్‌ను పోలి ఉండటం యాదృచ్ఛికమే కావచ్చు. అక్కడ సరికొత్త శక్తులు పూర్తి మెజారిటీలతో గెలిచి అధికారానికి రావటంతో పరిస్థితులు మారాయి. కొత్త అధ్యక్షుడు దిస్సనాయకే, దేశంలో నెలకొని ఉన్న సమస్యలు, వాటి నుంచి బయటపడి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే పట్టుదల వల్ల, భారతదేశంతో గతంలో ఉండిన విభేదాలను మరచిపోయి పరస్పర సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. చైనాకు ఎంత సన్నిహితమైనా, తమ విధానం సంతులనమని కొత్తలోనే ప్రకటించటం, చైనా కన్న భారత్‌ను మొదట సందర్శించటం దిస్సనాయకే దౌత్యనీతికి రుజువులు. మోదీ సందర్శన సందర్భంగా ఇండిపెండెన్స్‌ స్క్వేర్‌ వద్ద స్వాగతం చెప్పిన అసాధారణ చర్య, ఆయనకు ‘మిత్ర విభూషణ’ పురస్కారం, తమ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించనివ్వబోమన్న హామీ ఇదే కోవలోకి వస్తాయి. వివిధ ఆర్థిక, రక్షణ ఒప్పందాలు రెండు వైపుల నుంచి సజావుగా అమలైతే, ట్రంప్‌ ఆవిష్కరిస్తున్న కొత్త ప్రపంచపు సాధక బాధకాలను సమష్టిగా ఎదుర్కొన వీలవుతుంది.టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Supreme Court Slams UP Police9
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీలో చట్టాన్ని అతిక్రమించే చర్యలే ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తాను తిరిగి తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అసలు యూపీలో ఏం జరుగుతుందని సూటిగా ప్రశ్నించింది సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్శనాథన్‌లతో కూడిన ధర్మాసనం.‘ఇదొక సివిల్ కేసు.. దీన్ని క్రిమినల్ కేసు కింద ఎందుకు ఫైల్ చేశారు. యూపీ పోలీసుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదు. సివిల్ నేపథ్యం ఉన్న కేసుల్ని క్రిమినల్ కేసుగా ఎందుకు మార్చి రాశారు. చట్ట ప్రకారం ఇది సరైనది కాదు. ఒక మనిషి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేని పక్షంలో అది క్రిమినల్ కేసులోకి రాదు యూపీలో ప్రతీరోజూ చాలా వరకూ ఈ తరహా కేసులే కనిపిస్తున్నాయి. సివిల్ కేసుల్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసుల కింద ఎలా ఫైల్ చేస్తారు. ఇది కంప్లీట్ గా చట్టాన్ని అతిక్రమించడమే’ అని ధర్మాసనం చురకలు అంటించింది. ఇదీ చదవండి: మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు

Trump Doubles Down On Tariffs Says This on Inflation10
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్‌ ఆసక్తికర ప్రకటన

ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బకు.. ఆసియా, యూరప్‌ దేశాల స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అయినా కూడా వాణిజ్య సుంకాల విషయంలో తన నిర్ణయమే కరెక్ట్‌ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ‘‘సవరించేదే లే..’’ అని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లు కుదేలు అవుతున్న వేళ తాజాగా మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారాయన. వాషింగ్టన్‌: ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald rump) తోసిపుచ్చారు. ట్రూత్‌ సోషల్‌లో ఆయన చేసిన తాజా పోస్ట్‌ సారాంశం.. ‘‘ చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గాయి. కాబట్టి ద్రవ్యోల్బణం లేదు. చాలాకాలంగా అన్యాయానికి గురైన అమెరికా, ప్రతీకార సుంకాల ద్వారా సంబంధిత దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తీసుకు వస్తోందని అన్నారాయన. అన్నింటికంటే.. అతిపెద్ద దుర్వినియోగదారు దేశమైన చైనా(China) మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, ఆ దేశంపై సుంకాలను 34% పెంచినప్పటికీ.. ప్రతీకారానికి దిగొద్దన్న నా హెచ్చరికను పట్టించుకోలేదు. అమెరికా గత నాయకుల వల్లే దశాబ్దాలుగా వాళ్లు అడ్డగోలుగా సంపాదించున్నారు. ఇక.. అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దండి! అని పోస్ట్‌ చేశారాయన. ఇదిలా ఉంటే.. అమెరికా వేసిన సుంకాలకు దీటుగా స్పందించిన చైనా (China) అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా (USA) విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ఆరోపించింది. ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ క్రమంలో.. వాషింగ్టన్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను (US tariffs) విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని చైనాకు చెందిన ది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టారిఫ్‌ కమిషన్‌ వెల్లడించింది. ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) స్పందించారు. చైనా భయపడిందని, తప్పు నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘చైనా తప్పిదం చేసింది. వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వారికి మరో మార్గం లేదు’’ అని అన్నారాయన.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement