
శ్రీమహావిష్ణువు కూర్మ రూపంలో వెలసిన చోట అరుదైన నక్షత్ర తాబేళ్ల మృత్యువాత
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయకుండా తాబేళ్ల దహనం
తాబేళ్ల సంరక్షణ గాలికి.. అస్తవ్యస్తంగా తాబేళ్ల పార్కు నిర్వహణ
గార: సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు కూర్మ (తాబేలు) రూపంలో వెలసిన అరుదైన దేవాలయం.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యస్థలిగా ఈ దివ్యక్షేత్రం భాసిల్లుతోంది. మనరాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా శ్రీకూర్మనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తుంటారు. ఇక్కడి తాబేళ్లను శ్రీమహావిష్ణువు ప్రతిరూపంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. ఆదికూర్మ క్షేత్రం కావడంతో.. తాబేళ్ల పార్కును కూడా నిర్వహిస్తున్నారు.
అయితే ఈ పుణ్యక్షేత్రంలో అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. పార్కు నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేయడంతో ఎన్నడూ లేని విధంగా శ్రీకూర్మంలో వరుసగా తాబేళ్లు మరణిస్తున్నాయి. పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. మృత్యువాత పడ్డ కూర్మాలకు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయాల్సి ఉన్నా.. అవేమీ చేయకుండా వాటిని ఆలయ ఈవో కార్యాలయం వెనుక భాగంలోనే దహనం చేస్తుండటం గమనార్హం.
గత ప్రభుత్వ హయాంలో ప్రతి తాబేలుకి నంబర్..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తాబేళ్ల పార్కులో ప్రతి తాబేలుకి నంబర్ కేటాయించేవారు. వాటి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు నమోదు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. సాక్షాత్తూ దేవదేవుడు శ్రీకూర్మనాథుడిగా వెలసిన శ్రీకూర్మంలోనే వరుసగా అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నా కూటమి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.
