
ప్రపంచ వాణిజ్య సంఘర్షణలు, పెరిగిన సుంకాల అనిశ్చితులు, యూఎస్‌లో ధరలు తగ్గడం కారణంగా భారత్‌కు అమెరికా మెట్ట ప్రాంత పత్తి ఎగుమతులు అధికమయ్యాయి. ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఎగుమతులు గణనీయంగా పెరిగి 2.5 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. భారతదేశం ఉత్పత్తి లోటుతో ఇతర పరిస్థితులు యూఎస్ పత్తిని దిగుమతి చేసుకోవడానికి కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు భారత్‌కు పత్తి ఎగుమతులు 25,901 బేళ్ల నుంచి 1,55,260 బేళ్లకు పెరిగాయి. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఎగుమతులు రెండున్నరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. యూఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాటు చైనాకు అమెరికా పత్తి ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో ఈ పెరుగుదల చోటు చేసుకుందని నిపుణులు చెబుతున్నారు. అసలు భారత్‌లో పత్తి గణనీయంగా పండిస్తున్నా యూఎస్ నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారో కొన్ని కారణాలు తెలుసుకుందాం.
పొడవైన పత్తి పీజలు
చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా, అత్యధిక పత్తి నూలు ప్రాసెసర్లు, ఎగుమతిదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. కానీ ఇటీవల కాలంలో భారత్‌తో పత్తి దిగుబడి తగ్గుతుంది. దాంతో దేశం పత్తి నికర ఎగుమతిదారు నుంచి దిగుమతిదారుగా మారింది. స్థానికంగా పండుతున్న పత్తి నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతుంది. మెరుగైన నాణ్యతతో యూఎస్ మెట్ట ప్రాంతాల్లోని పత్తికి గిరాకీ అధికంగా ఉంది. యూఎస్ పత్తి ముఖ్యంగా ఎక్స్‌ట్రాలాంగ్ స్టేపుల్ (ఈఎల్ఎస్)ను కలిగి ఉంటుంది. అంటే పీజల(పత్తి పువ్వులోని రెక్కల్లాంటి భాగాలు) పొడువు ఎక్కువగా ఉంటుంది. ఇది నాణ్యమైన వస్త్రాలకు అనువైనది.
అధిక జిన్నింగ్ సామర్థ్యం
యూఎస్ పత్తి అధిక జిన్నింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. యూఎస్‌లో భారత్‌లో మాదిరి కూలీల ద్వారా పత్తిని సేకరించరు. యంత్రాలతోనే దీన్ని ప్రాసెస్ చేస్తారు. దాంతో నాణ్యమైన పత్తి సమకూరుతుంది. భారత్‌లో పత్తి పంటకు అధికంగా రసయనాలు వాడుతారు. ఇది ఎక్కువ మలినాలకు దారితీస్తుంది. వస్త్ర తయారీ కంపెనీలు దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంలేదు.
ఇదీ చదవండి: మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
ధరలు క్షీణత
యూఎస్ పత్తి ధరలు ఇటీవల క్షీణించాయి. ఇది భారతీయ కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. భారత పత్తి ధరలు సాపేక్షంగా అధికంగా ఉన్నాయి. దాంతో దిగుమతులు పెరగడానికి దారితీసింది. దీనికితోడు చైనా కూడా అమెరికా దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఫలితంగా యూఎస్ పత్తిని భారత్‌లో మార్కెట్ చేసుకుంటున్నారు.