'జాట్'‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయండి.. ఫైర్‌ అవుతున్న తమిళులు | Know Reason Behind Why Tamil Nadu People Called Boycott Jaat Movie, Know Story About LTTE In Telugu | Sakshi
Sakshi News home page

'జాట్'‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయండి.. ఫైర్‌ అవుతున్న తమిళులు

Apr 14 2025 8:37 AM | Updated on Apr 14 2025 9:00 AM

Jaat Movie Against To LTTE Boycott Called In Tamil Nadu

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సన్నీ డియోల్‌ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం జాట్‌. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలని #BoycottJaatMovie పేరుతో ఒక హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అవుతుంది. శ్రీలంకలో (Sri Lanka) తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈని ఒక ఉగ్రవాద సంస్థగా ఈ చిత్రంలో చూపించారంటూ కొందరు తమిళియన్స్‌ విరుచుకుపడుతున్నారు. తమ కోసం ప్రాణాలకు తెగించిన వారిని ఇలా చూపించడం ఎంతమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ తమ ఎక్స్‌ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. తమిళనాడులో దర్శకుడు గోపీచంద్‌ మలినేని అడుగుపెడితే తగిన బుద్ధి చెబుతాం అంటూ భగ్గుమంటున్నారు.

సినిమా కథలో భాగంగా శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన పాత్రలో నటుడు రణతుంగ కనిపిస్తాడు. జాట్‌లో అతనే విలన్‌ కూడా.. డిప్యూటీ కమాండర్‌ ఆఫ్‌ జాఫ్నా టైగర్‌ ఫోర్స్‌ (JTF) పేరుతో పోలీసుల హిట్‌లిస్ట్‌లో రణతుంగ పేరు ఉంటుంది. ఇక్కడ  జాఫ్నా అనేది శ్రీలంకలోని ద్వీపకల్పం. అక్కడే ఎల్‌టీటీఈని స్థాపించిన  ప్రభాకరన్‌ జన్మించారు. ఇందులో విలన్‌తో నడిచే గ్యాంగ్‌ను చూపించిన తీరు అంతా కూడా ఎల్‌టీటీఈకు దగ్గరి పోలీకలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ సినిమాలో ఎల్‌టీటీఈ పేరు చెప్పనప్పటికీ ఆ మార్క్ చూపుతూ సినిమా తీశారని చెబుతున్నారు. ఎల్‌టీటీఈని ఒక ఉగ్రవాద సంస్థగా ఎందుకు చూపారంటూ కామెంట్లు చేస్తున్నారు. తమిళులు ఈ చిత్రాన్ని చూడొద్దంటూ వైరల్‌ చేస్తున్నారు. 

శ్రీలంకలోని తమిళుల కోసం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల హక్కుల కోసం పోరాడిన వారి గురించి ఇలా చూపిస్తారా అంటూ దర్శకుడు గోపీచంద్‌ మలినేనిపై విరుచుకుపడుతున్నారు.  కొందరు తెలుగువారు  తమిళుల పట్ల ఇంతలా  ద్వేషం చూపుతున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఈ తెలుగు దర్శకుడు తమిళ స్వాతంత్ర్య సమరయోధులు LTTEపై అంత ద్వేషం కక్కడానికి కారణం ఏమిటి..? LTTEపై ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తమ కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని ఉగ్రవాదులుగా ఎందుకు చూపుతున్నారు అంటూ ఫైర్‌ అవుతున్నారు.

తమిళుల హక్కుల కోసం ఎల్‌టీటీఈ.. దాని గురించి తెలుసా..?
అణచివేతకు గురైన తమిళులకు స్వేచ్ఛ పేరిట ఉత్తర శ్రీలంకలోని వన్నీ అటవీ ప్రాంతం నుంచి ఎల్‌టీటీఈ సాయుధ పోరాటం కొనసాగించింది. శ్రీలంకలో ఉన్న తమిళుల హక్కుల కోసం తమిళ్‌ న్యూటైగర్స్‌(TNT) పేరుతో 1972లో ఈ సంస్థను ప్రభాకరణ్‌ ప్రారంభించాడు.  అయితే, 1975లో జాఫ్నా మేయర్‌ను  అతి సమీపం నుంచి ప్రభాకరణ్‌ కాల్చి చంపాడు. ఆపై 1976లో టీఎన్‌టీ పేరును లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం(LTTE)గా మార్చాడు. దానికి తనే లీడర్‌గా ఉంటూ తమ ప్రత్యర్థుల్ని నిర్ధాక్షిణ్యంగా హత్య చేయడం ప్రారంభించారు. ప్రభాకరణ్‌ నాయకత్వంలో ఎల్‌టీటీఈ మరింత పవర్‌ఫుల్‌ అయింది. ఏకంగా గెరిల్లా దళంగా ఎదిగింది.  సుమారు మూడున్నర దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో మొత్తం 60వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

శ్రీలంకలోని తమిళ ప్రజల దీనస్థితి తనను ఆయుధం పట్టేలా చేసిందని ప్రభాకరన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్లాన్‌ ప్రకారమే తమపై నరమేధం సాగుతోందని ఆయన చెప్పాడు. తమ జాతిని కాపాడుకునేందుకు ఈ నిరంకుశ రాజ్యం నుంచి ప్రజలను రక్షించేందుకే సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నాని ఆయన మరణానికి ముందు చెప్పాడు. 2009లో శ్రీలంక సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రభాకరణ్‌ హతమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement