
‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్.. పక్కా లోకలే...’ అంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వేసిన డ్యాన్సుల్ని ప్రేక్షకులు అంత సులువుగా మరచి పోలేరు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’(2016) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో సందడి చేశారీ బ్యూటీ. ఎన్టీఆర్‌కి సమానంగా డ్యాన్సులతో అదరగొట్టారామె. ఆ చిత్రం తర్వాత మరో ప్రత్యేక పాట చేయలేదు కాజల్. అయితే ఆమె తెలుగులో రెండోసారి స్పెషల్ సాంగ్ చేయనున్నారని టాక్. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ పాటకి కాజల్‌ని తీసుకోవాలన్నది బుచ్చిబాబు ఆలోచనట. సినిమాకి ఓ హైలెట్‌గా నిలవనున్న ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి ఆమె డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్‌చరణ్ –కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన తొలి చిత్రం ‘మగధీర’ (2009) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ద్వితీయ చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే’ (2014) కూడా విజయం అందుకుంది. ఇప్పుడు ‘పెద్ది’లో కాజల్ ఐటమ్ సాంగ్ చేస్తే... దాదాపు పదకొండేళ్ల తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. మరి.. ‘పెద్ది’లో ఐటమ్ సాంగ్ ఉందా? ఉంటే కాజల్ అగర్వాల్ నటిస్తారా? అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాలంటే వేచి చూడాలి. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు కెమేరామేన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రం రామ్‌చరణ్ బర్త్ డేకి 2026 మార్చి 27న విడుదల కానుంది.
