
కాకినాడ, సాక్షి: ఎమ్మెల్సీగా జనసేన నేత కొణిదెల నాగబాబు తొలి అధికారిక ప్రకటన ఉద్రిక్తతకు దారి తీసింది. గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్‌ను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అయితే ప్రారంభ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ‘‘జై వర్మ’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో..
తమ్ముళ్లకు కౌంటర్‌గా జనసైనికులు జై జనసేన అంటూ కౌంటర్ నినాదాలు చేశారు. నాగబాబు ప్రారంభ హడావిడిలో ఉండగానే కాసేపు ఆ పోటాపోటీ నినాదాల పర్వం కొనసాగింది. దీంతో ఆయన వాళ్ల వంక ఓ లుక్కేసి.. ఏమీ పట్టనట్లు తన కార్యక్రమంలో మునిగిపోయారు. ఈలోపు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచే ప్రయత్నం చేశారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ నెగ్గినప్పటి నుంచి టీడీపీ ఇంఛార్జి వర్మకు రాజకీయ ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో.. ఆ మధ్య వర్మ చేసి, ఆపై డిలీట్ చేసిన ఓ పోస్టు తీవ్ర దుమారం రేపింది. ఈలోపు ఈ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ గెలుపునకు ఎవరూ కారణం కాదని.. అలా ఎవరైనా అనుకుంటే వాళ్ల ‘ఖర్మ’ అని నాగబాబు వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
టీడీపీ కార్యకర్తలు, వర్మ అనుచరులు నాగబాబును సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ తరుణంలో నాగబాబు తాజా పర్యటనలో జరిగిన పరిణామం ఇరు వర్గాల మధ్య విబేధాలను మరోసారి బయటపెట్టింది.
