
రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం
సీతారాముల కల్యాణంలో శివుడితో వివాహం
రాజన్నే వరుడుగా భావించి వివాహం
వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం
వేములవాడ: రాజన్నను వరుడిగా భావించి వివాహమాడటం.. వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణోత్సవానికి సామాన్య భక్తులతోపాటు అధిక సంఖ్యలో హిజ్రాలు, జోగినులు హాజరవుతుంటారు. కానీ కల్యాణోత్సవానికి హాజరైన హిజ్రాలు, జోగినులు శివుడినే వరుడిగా భావించి వివాహమాడుతుంటారు. మంగళసూత్రం ధరించి, తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడుపుతారు. రాష్ట్రంలో వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే శ్రీరామనవమి సందర్భంగా ఆవిష్కృతమయ్యే ఈ ఆచార, వ్యవహారాలపై ప్రత్యేక కథనమిది.
నవమి రోజే ఏడడుగులు
ఏటా శ్రీరామ నవమి రోజు జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు పాల్గొంటారు. వీరంతా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలు, ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కల్యాణానికి హాజరవుతారు. తమను తాము.. రాజరాజేశ్వరస్వామికి భార్యలుగా భావించి.. వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవడం విశేషం. ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను.. ఆత్మవివాహం(స్వయంపరిత్యాగం)గా పరిగణిస్తుంటారు.
వేడుక వెనుక భక్తి భావన
ఈ వేడుక ద్వారా శివపార్వతులు, జోగినులు, హిజ్రా సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతంగా నిలుస్తోందని భావిస్తుంటారు. వారి ఆత్మాభిమానం పెంచేందుకు, భగవంతుని కటాక్షానికి హిజ్రాలు కూడా పాత్రులనే భావనను చాటి చెప్పేలా ఈ ఉత్సవం సాగుతోంది. భక్తికి లింగ భేదం లేదని, దేవునికి ప్రతి ఒక్కరూ సమానమేనని ఈ వేడుకలు నిరూపిస్తున్నాయి. వారం రోజులపాటు వేములవాడలో వేడుకగా జరిగే ఈ తంతును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
సమాజంలో మార్పుకిది సంకేతం
హిజ్రాలను అనాదిగా సమాజం అంగీకరించక, వారిని అటకెక్కించిన తీరు తెలిసిందే. కానీ వేములవాడ రాజన్న ఆలయంలో హిజ్రాలకు ప్రత్యేక గౌరవం కల్పించడం విశేషంగా భావిస్తారు. ఇక్కడ హిజ్రాలు దేవునితో ఆత్మీయబంధం కలిగి, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం పొందుతున్నారు. హిజ్రాలకు దేవతల మన్నింపు, ఆశీస్సులు లభిస్తున్నాయని భావించడంతో.. భక్తుల మధ్య వారికి గుర్తింపు పెరుగుతోంది. సామాజికంగా హిజ్రాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. కానీ ఈ కల్యాణోత్సవం ద్వారా వారికి భక్తిపూర్వకమైన గుర్తింపు లభిస్తోంది. తాము సమాజంలో ఒంటరి కామని, గుర్తింపు ఉందని హిజ్రాలు స్వయంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇటీవల హిజ్రాలకు ప్రభుత్వం కొన్ని హక్కులు, వసతులు కల్పించినా, సాధారణ ప్రజానీకంలో ఇప్పటికీ వారిపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి.