
స్లాట్ బుకింగ్ సౌలభ్యంతోపాటు అధికభారం తగ్గించేలా కొత్త కార్యాలయాల ఏర్పాటు
జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 15 చోట్ల కొత్తవాటికి ప్రతిపాదనలు
త్వరలోనే ఆమోదం తెలపనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించే కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం వేగ వంతం చేసింది. ఇప్పటికే అధికభారంతో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడంతోపాటు కొత్తగా అమల్లోకి వచ్చి న స్లాట్ బుకింగ్ సౌలభ్యాన్ని ప్రజలు వినియోగించు కునేలా త్వరలోనే ఈ పునర్వ్యవస్థీ కరణకు ఆమోద ముద్ర పడనున్నట్టు తెలిసింది.
ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు 15 కొత్త సబ్‌రిజిస్ట్రార్ కార్యాల యాల ఏర్పాటుకు స్టాంపు లు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని, అతి త్వరలోనే వీటికి ఆమోదముద్ర పడుతుందని తెలుస్తోంది.
» శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మహేశ్వరం, పటాన్ చెరు, గండిపేట, మూసాపేట, మేడ్చల్ కార్యాలయాల పరిధిని విభజించి కొత్తగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయా లను ఏర్పాటు చేయనున్నారు.
» ఇప్పటికే కుత్బుల్లాపూర్ సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయానికి ఇద్దరు సబ్ రిజిస్ట్రా ర్లను అదనంగా నియమించగా, త్వర లోనే మిగిలిన చోట్ల కూడా కొత్త సబ్ రిజిస్ట్రార్లను నియమించనున్నారు.
» మరోవైపు తక్కువ పనిఉండే సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల పరిధిని విలీనం కూడా చేయనున్నారు. అందులో భా గంగా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా లోని చంపాపేట, సరూర్‌నగర్ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల అధికార పరి ధిని విలీనం చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా మరో ఏడెనిమిది కార్యాలయాల పరిధిని విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది.
» అవినీతికి చెక్‌పెట్టడం, పనిభారాన్ని తగ్గించడం, ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
మొదటి రోజు 626 రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో స్లాట్‌బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 626 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించింది. గురువారం నుంచి 22 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్‌బుకింగ్ విధానం అమల్లోకి వచ్చిందని, ప్రజల నుంచి మంచి స్పందన కనిపించిందని తెలిపారు. అయితే, ఉదయం కొంతసేపు ప్రధాన సర్వర్ మొరాయించడంతో కొంత ఇబ్బంది కలిగినా అ తర్వాత రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నట్టు సమాచారం.
తొలిరోజు కావడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులంతా పైలట్ ప్రాజెక్టు అమలుపైనే దృష్టి సారించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా డీఐజీ స్థాయి అధికారులు వెళ్లి అక్కడే ఉండి రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. స్లాట్‌బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరు, ప్రజల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విధానం అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు సులువైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చామని, తద్వారా 10–15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుండడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సేవల్లో జాప్యం, సిఫారసులు, దళారుల జోక్యం లాంటి వాటి నుంచి క్రయ విక్రయదారులకు ఈ విధానం ఉపశమనం కలిగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.