సర్కారీ స్కూళ్లకు ‘జన్మభూమి’ సంకెళ్లు | Criticisms janmabhoomi and maa vooru programme | Sakshi
Sakshi News home page

సర్కారీ స్కూళ్లకు ‘జన్మభూమి’ సంకెళ్లు

Published Wed, Jan 3 2018 8:44 AM | Last Updated on Wed, Jan 3 2018 8:44 AM

Criticisms janmabhoomi and maa vooru programme - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ విద్యార్ధులకు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్స్, 28 నుంచి పబ్లిక్‌ పరీక్షలు.. జేఈఈ, ఎంసెట్‌తో సహా అనేక పోటీ పరీక్షలకు ప్రిపేరవ్వాల్సిన తరుణం.. పాఠశాలల్లోనూ సిలబస్‌లో అతి ముఖ్యమైన చాప్టర్లపై బోధన, పబ్లిక్‌ పరీక్షల కోసం సాధన జరిగే సమయం... ఇలాంటి కీలకమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు అటు ఉపాధ్యాయులను, విద్యార్థులను చదువుకు దూరం చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో వీరిని బలవంతంగా భాగస్వాములను చేయడం, అనేక బరువు బాధ్యతలు మోపడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

ప్రజల సమస్యలను పరిష్కరించే పేరుతో నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం వల్ల ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడమే కాక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమం పెద్ద సమస్యగా మారడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్ధుల చదువులు ఎలా పోయినా ఫర్వాలేదు, ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థల విద్యార్ధులకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  బోధనేతర కార్యక్రమాల్లో టీచర్లు, విద్యార్ధులను భాగస్వాములను చేయరాదని విద్యాహక్కు చట్టం స్పష్టంగా పేర్కొన్నా ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఏడాది పొడవునా పలు కార్యక్రమాలకు ప్రభుత్వ టీచర్లు, విద్యార్ధులను తరలిస్తోంది. మంగళవారం నుంచి ప్రారంభమైన జన్మభూమిలో టీచర్లు, విద్యార్ధులను భాగస్వాములను చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఆదేశాలు జారీచేయడం గమనార్హం. 

ప్రభుత్వ టీచర్లు, విద్యార్ధులకు ముఖ్యమంత్రి అప్పగించిన పనులివే...
ప్రతి గ్రామంలో, మున్సిపల్‌ వార్డులో నోడల్‌ ఆఫీసర్లుగా టీచర్లను నియమించాలి.  గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోడల్‌ ఆఫీసరు అవుతారు.    
నోడల్‌ ఆఫీసర్‌ మున్సిపల్, వార్డు అభివృద్ధి ప్లాన్‌ను అమలు చేయాలి.  
గ్రామ, మున్సిపల్‌ వార్డు డెవలప్‌మెంటు ప్లాన్‌లో 2014–15 నుంచి 2017–18 వరకు పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను నమోదు చేయాలి.  
2017–18కి సంబంధించిన గ్రామ, వార్డు అభివృద్ధి ప్లాన్‌ను విడిగా తయారు చేసుకోవాలి. 2018–19, 2019–20 లకు విద్యాపరమైన  లక్ష్యాలను తయారు  చేసుకోవాలి.  
గడచిన మూడేళ్లలో వివిధ ప్రభుత్వ పధకాల  ద్వారా పాఠశాలకు అందించిన నిధులు, మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను రూపొందించాలి.  
పాఠశాల అకడమిక్‌కు సంబంధించిన నివేదిక రూపొందించుకోవాలి. పాఠశాల అకడమిక్‌ మరియు అభివృద్ధి గురించి ఫ్లెక్సీలు వేయించి గ్రామంలో జన్మభూమి జరిగే ప్రదేశంలో, పాఠశాల వద్ద ప్రదర్శించాలి.  
ప్రతి రోజు గ్రామంలో నోడల్‌ ఆఫీసరు తమ పాఠశాలలో ఆరోజు జన్మభూమికి సంబంధించిన అంశంపై విద్యార్ధులకు వ్యాస, మౌఖిక, ఉపన్యాస, చర్చ పోటీలు నిర్వహించాలి. అదేవిధంగా పి.ఇ.టి.సహాయంతో క్రీడలను నిర్వహించాలి.  
ప్రతి రోజూ ఉపాధ్యాయులు, విద్యార్థులు జన్మభూమిలో ఆరోజుకు సంబంధించిన అంశంపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలి.  
ప్రతి రోజు గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలపై డాక్యుమెంటేషన్, ఫోటోలను మధ్యాహ్నం 3  గంటలలోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపాలి.  
ఈనెల 5న జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేకించి విద్యాశాఖ కార్యక్రమాన్ని నిర్వహించాలి.  ఉదయం ర్యాలీ నిర్వహించాలి. తరువాత 15 నిమిషాలు ముఖ్యమంత్రి ఉపన్యాసం ఉంటుంది. తదుపరి కూచిపూడి, భరత నాట్యం, జానపద నృత్యం వంటి జానపద కళలను ప్రదర్శించాలి.  పిల్లలు తయారు చేసిన బొమ్మలు, సైన్సు ప్రయోగాలు ప్రదర్శించాలి.  
జన్మభూమి రోజుల్లో విద్యార్ధులు గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై సర్వే చేయాలి.  
మండల, పంచాయతీ స్థాయిలో 5కె రన్‌ను నిర్వహించాలి. విద్యార్థులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.

ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థలకు మినహాయింపు..
ప్రభుత్వ విద్యాసంస్థల టీచర్లు, విద్యార్ధులను జన్మభూమిలో తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని ఆదేశాలు ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం అదే సమయంలో ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థలను పూర్తిగా మినహాయించింది. ఆయా విద్యాసంస్థల్లో బోధనాభ్యసన కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తోంది. జేఈఈ, ఎంసెట్‌తో సహా అనేక పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే సమయంలో ఇంటర్మీడియెట్‌ విద్యార్థులను సైతం ఈ జన్మభూమికి తరలించేలా ఇంటర్మీడియెట్‌ బోర్డు ద్వారా ఆదేశాలు జారీ చేయించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, విద్యార్ధులను అనేక బోధనేతర కార్యక్రమాల్లో వినియోగిస్తోంది. దోమలపై దండయాత్ర, పుష్కరాల్లో సేవలు, మరుగుదొడ్ల నిర్మాణం పర్యవేక్షణ ఇలా ప్రతి కార్యక్రమానికి విద్యార్ధులను, టీచర్లను తరలిస్తోంది. ఇక ఆయా ప్రాంతాలకు సీఎంతో సహ ముఖ్యులు ఎవరు వచ్చినా వారికి స్వాగతం కోసం విద్యార్ధులను తరలిస్తున్నారు. 

పాఠశాలలా మీ ప్రచారవేదికలా?
జన్మభూమి నోడల్‌ ఆఫీసర్లుగా, గ్రామ కోఆర్డినేటర్లుగా టీచర్లను నియమించడం సరైనది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవలి కాలంలో ప్రభుత్వంలోని వారికి పాఠశాలలను తమ ప్రచార వేదికలుగా మార్చేయడం అలవాటుగా మారింది. దోమల దండయాత్ర నుంచి గ్రామాల్లో మరుగొదొడ్లు కడిగే దాకా అన్ని పనులకూ విద్యార్ధులు, టీచర్లను వీధుల్లో తిప్పుతున్నారు. గ్రామాల్లో అనేక శాఖల ఉద్యోగులు ఉండగా టీచర్‌లను నియమించడం ఏమిటి?  ప్రతిరోజూ ర్యాలీల పేరుతో విద్యార్ధులను బయటి తిప్పితే వారి చదువులు ఏం కావాలి?   –యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబుల్‌రెడ్డి

నెలకు పదిరోజులు వీధుల్లోనే విద్యార్థులు
జన్మభూమిలో టీచర్లు, విద్యార్ధులను భాగస్వామ్య చేయడం సరికాదు. రోజూ ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెబుతున్నారు. పిల్లలను ర్యాలీగా ఆయా గ్రామసభలకు తీసుకురావాలంటున్నారు. వారికి చదువు లేకుండా చేస్తున్నారు. నెలరోజులుగా టాయిలెట్లు పరిశీలన అని విద్యార్థులను గ్రామాల్లో ఇంటింటికీ తిప్పారు. ప్రతి నెలలో పది రోజులు ఈ బోధనేతర పనులతోనే సరిపోతోంది. ఇక పిల్లలకు చదువులెప్పుడు?  
–పాండురంగవరప్రసాద్‌ ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

టీచర్లకు బోధనేతర బాధ్యతలు
టీచర్లను స్కూళ్లు వదిలి గ్రామసభల్లో ఉండాలంటున్నారు. గ్రామ పంచాయతీ బాధ్యతలు అప్పగించారు. మండలం స్థాయిలో ఏర్పాటయ్యే అధికారుల బృందాలకు సహాయకులుగా టీచర్లను నియమిస్తున్నారు. జన్మభూమి నిర్వహణ బాధ్యతలు పెడుతున్నారు. పది రోజులు స్కూళ్లను వదిలి గ్రామ సభల్లో పాల్గొనాలి. ఆ  గ్రామ సభల ఇన్‌ఛార్జి బాధ్యతలను పెట్టడం అన్యాయం. జన్మభూమి పేరిట ప్రభుత్వానికి నివేదికలు, ఇతర సన్నాహాల కోసం రాత్రి పది వరకు టీచర్లు నానా యాతనలు పడుతున్నారు. ––శ్రీనివాసరాజు, పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి

పరీక్షల సమయంలో ఇదేం తీరు?
ఇంటర్మీడియెట్‌తో సహ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధులను జన్మభూమి కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయడం సరికాదు. ఇంటర్మీడియెట్‌ విద్యార్ధులకు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్స్, 28 నుంచి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో విద్యార్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రయివేటు కార్పొరేట్‌ కాలేజీల్లోని విద్యార్ధులను జన్మభూమిలో ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదు? ––రవిచంద్ర, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement