సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు పడకేశాయి. ప్రభుత్వం కొత్త మందులు కొనకపోగా.. స్టోర్‌లో ఉన్న మందులూ ఇవ్వడంలేదు. మరోవైపు రూ.కోట్లాది విలువై న మందులు కాలం చెల్లి వృథాగా మారుతున్నా పట్టించు కోవడంలేదు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులనుంచి డబ్బులిస్తామన్నా మందులు సరఫరా చేయడంలేదు. తాజాగా అత్యంత ప్రధానమైన 170 రకాల మందులను ఆఫ్‌లైన్ చేయడంతో సమస్య తీవ్రమైంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కారణంగా మందులకు నిధుల వినియోగం తగ్గించేందుకు సర్కారు తీసుకుంటున్న చర్య లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకూ మందుల కోసం అల్లాడుతున్నాయి. రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా పేదరోగుల మందుల పంపిణీ వ్యవస్థ దారుణంగా తయారైంది.
కాలం చెల్లిన రూ.20 కోట్ల మందులు
ఇటీవల ఏ ఆస్పత్రికి మందులు కావాలన్నా ఆన్‌లైన్‌లో ఇండెంట్ (కావాల్సిన సరుకు) పెట్టాల్సి ఉంటుంది. ఇందులో అనుమతి లభించాకే సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది. రేటు కాంట్రాక్టు ప్రకారం 270 రకాలకు పైగా మందులు ఆన్‌లైన్‌లో ఉంటాయి. అయితే ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు... ఆన్‌లైన్‌లో ఉన్న మందులో 170 రకాల మందులను ఆఫ్‌లైన్‌లో పెట్టారు. అంటే ఆ మందులు ఆన్‌లైన్‌లో కనిపించకుండా బ్లాక్ చేసేశారు. మరోవైపు జిల్లా కేంద్రాల్లో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లలో మందులున్నా ఇవ్వకపోవడంతో అవి ఎక్స్‌పైరీ అయిపోయాయి. వీటి విలువ దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. శస్త్రచికిత్సల సమయంలో వాడే ఇంజక్షన్లు, ఎక్స్‌రే ఫిల్ములు... ఆఖరుకు నీటిలో వేసే క్లోరిన్ టాబ్లెట్స్ కూడా ఎక్స్‌పైరీ అయ్యాయంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.
డబ్బులిస్తామన్నా కొనడం లేదు
ఆఫ్‌లైన్ మందులు ఏ ఆస్పత్రికి ఇవ్వలేమని, వాళ్లకు ఇవ్వాల్సిన బడ్జెట్ ఎప్పుడో అయిపోయిందని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు తెగేసి చెబుతున్నారు. దీంతో ప్రధానంగా బోధనాసుపత్రుల్లో తీవ్రమైన పరిస్థితి నెలకొని ఉంది. కొన్ని బోధనాసుపత్రులకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీల్లో డబ్బుంది. ఆ డబ్బులిస్తాం మాకు కావాల్సిన మందులివ్వండని లేఖలు రాసినా స్పందించడంలేదు. తాజాగా విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రిలో మందులు లేక, రోగులు అల్లాడుతూంటే ఆస్పత్రి సూపరింటెండెంట్ తమ వద్ద రూ.3 కోట్ల నిధులున్నాయని, తమకు కావాల్సిన మందులు కొనుగోలు చేసి ఇవ్వాలని లేఖ రాశారు. మీ దగ్గర డబ్బులుంటే మా దగ్గర మందులుండాలి కదా అన్న సమాధానం రావడంతో ఆయన అవాక్కయ్యారు.
చేతులెత్తేసిన ఈ–ఔషధి, కోల్డ్‌చైన్ నిర్వాహకులు
రాష్ట్రంలో గత ఏడాదిన్నర క్రితం ఈ–ఔషధి విధానం అమల్లోకి తెచ్చారు. పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మందుల పంపకం చేస్తారు. ఈ విధానాన్ని నిర్వహణకోసం ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చారు. దీంతో పాటు కోల్డ్ చైన్ (కొన్ని ఇంజక్షన్లు, మందులు, వ్యాక్సిన్‌లు) కూలింగ్‌లో ఉంచాలి. ఈ నిర్వహణను మరో సంస్థకు ఇచ్చారు. గత కొన్ని నెలలుగా నిర్వహణ నిధులు ఇవ్వకపోవడంతో ఆ రెండూ సంస్థలు చేతులెత్తేశాయి. ఈ–ఔషధిలో భాగంగా ఆన్‌లైన్‌లోకి వెళితే అసలు సర్వర్‌లే పనిచేయడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక కోల్డ్‌చైన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వ్యాక్సిన్‌లు, కొన్ని రకాల ఇంజక్షన్‌లు పాడైపోతున్నాయని సీడీఎస్‌లలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌లు చెబుతున్నారు.
ఉన్న మందులన్నీ ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి కుదరదు
ప్రస్తుతం మందుల కొనుగోలుకు సంబంధించిన టెండరు ప్రాసెస్‌లో ఉంది. కాబట్టి ఉన్నవన్నీ వాడేయకుండా 170 రకాల మందులు ఆఫ్‌లైన్ పెట్టాం. ఒకవేళ బోధనాసుపత్రుల దగ్గర డబ్బులున్నా మా దగ్గర సరుకుండాలి కదా. ఉన్నవాటిని కొద్ది కొద్దిగా సర్దుతాం. ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి కుదరదు. టెండరు పూర్తయి మళ్లీ కొనుగోళ్లు ప్రారంభిస్తే ఆఫ్‌లైన్ నిబంధన తీసేస్తాం.
–గుప్తా, జనరల్ మేనేజర్, ఏపీఎంఎస్‌ఐడీసీ
మాకు కావాల్సిన మందులు కనిపించడం లేదు
మూడవ త్రైమాసికానికి సంబంధించి 22 రకాల మందులు లేవు. ఆన్‌లైన్‌లో చూస్తే ఆ మందులే కనిపించడం లేదని గుంటూరు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ 2017 అక్టోబర్ 10న వైద్య విద్యా సంచాలకులకు లేఖ రాశారు. తమకు కావాల్సిన మందులతో పాటు శస్త్రచికిత్సలకు అవసరమైనవి కూడా ఆన్‌లైన్‌లో తీసుకోవాలంటే ఆ జాబితానే కనిపించడం లేదని, అత్యవసర మందులు లేకపోవడంతో ఇన్‌పేషెంట్లతో పాటు ఔట్‌పేషెంట్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించాలని వైద్యవిద్యా సంచాలకులను కోరినా ఇప్పటికీ స్పందన లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment