టీడీపీ నేతలు.. అక్రమార్జనకు అలవాటుపడ్డారు. ఇన్నాళ్లూ అధికార అండతో సహజ సంపదను దోచుకున్నారు. కొండలపై కన్నేసి వాటిని పిండి చేశారు. అక్రమంగా క్వారీ, క్రషర్లు నిర్వహిస్తూ రూ.కోట్లకు పడగలెత్తారు. కంకర కోసం నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ నేతలు సాగిస్తున్న క్వారీల దందాతో నిరుపేదల ఇళ్లు బీటలువారగా.. సమీపంలోని పచ్చని పొలాలన్నీ దుమ్ముకొట్టుకుపోయాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. – రాయదుర్గం/ రాయదుర్గం రూరల్
క్వారీ, క్రషర్ నిర్వహించాలంటే రెవెన్యూ, మైనింగ్, పర్యావరణ శాఖ అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి. అనుమతులన్నీ వచ్చినా.. క్రషర్, క్వారీ ఏర్పాటు చేయకముందుగానే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కానీ టీడీపీ నేతలు ఇవేమీ పాటించలేదు. అధికారం అండతో అధికారులను మచ్చికచేసుకుని రాయదుర్గం నియోజకవర్గంలో ఇష్టానుసారం క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. అయితే సమీపంలోనే ఓ టీడీపీ నాయకుడు క్వారీ ఏర్పాటు చేసి ఇష్టానుసారం బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. దీంతో కాలనీలోని ఇళ్లు బీటలు వారాయి. క్రషర్, క్వారీ నుంచి వస్తున్న దుమ్ము, ధూళి ఇళ్లలోకి రావడం.. బ్లాస్టింగ్ జరిగిన ప్రతిసారీ భూమి కంపిస్తుండడంతో భయాందోళన చెందిన నిరుపేదలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇక క్వారీ దుమ్ము సమీపంలోని పొలాలపై దుమ్ముధూళి పడటంతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి.
పేలుళ్ల ధాటికి బీటలు వారిన ఇందిరమ్మ ఇల్లు
నిబంధనలకు నీళ్లు
నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య మాత్రమే బ్లాస్టింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో పేలుళ్లు జరుపుతున్నారు. ఇక క్వారీ సమీపంలో చెట్లును పెంచి వాటిని సంరక్షించే బాధ్యతను నిర్వాహకులే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఎక్కడా ఒక్క మొక్కను కూడా నాటలేదు. బ్లాస్టింగ్ కోసం ఉపయోగించే మందుసామగ్రిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. లైసెన్స్ ఉన్న వారితో మెటీరియల్‌ను కొనుగోలు చేయాలి. ఇందులో ఏ ఒక్కటీ పాటించడం లేదు.
ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్
క్వారీ, క్రషర్ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై మల్లాపురం వాసులు మూకుమ్మడిగా రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్వాహకులిచ్చే మామూళ్లు తీసుకుని వారికే వంతుపాడారు. పైగా మంత్రి కాలవ జోక్యం చేసుకోవడంతో క్వారీలపై ఫిర్యాదు చేసిన గ్రామస్తులపైనే కేసులు పెట్టించారు.
కాలవ అండదండలతోనే...
క్వారీల నిర్వాహకులకు అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని మరింత రెచ్చిపోయారు. కొందరైతే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే క్రషర్లు నిర్వహిస్తున్నారు. దీనిపై మల్లాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో గతంలో విజిలెన్స్, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి సుమారు రూ. కోటి వరకు జరిమానా విధించారు. క్రషర్‌ను సీజ్ చేయాలని ప్రయత్నించగా... అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు అధికారులకు ఫోన్ చేసి క్రషర్ సీజ్ చేయకుండా చూశారు. ఇక జరిమానా కూడా సగానికి పైగా తగ్గించేలా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.
పెద్దఎత్తున కంకరను నిల్వచేసిన క్వారీ, క్రషర్ నిర్వాహకులు
ఖజానాకు భారీ గండి
క్వారీ, క్రషర్ల నిర్వాహకులు రాయల్టీ సైతం చెల్లించకుండా ఖజానాకు భారీ గండి కొట్టారు. ఒకటి, రెండు పర్మిట్లు తెచ్చుకుని వాటిపై తేదీలు వేయకుండా వాటితోనే వందల ట్రిప్పులు కంకరను తరలిస్తున్నారు. ఇక రాత్రిపగలు తేడా లేకుండా మిషన్లు నడిపిస్తూ అనుమతులకు మించి బ్లాస్టింగ్‌లు చేస్తూ సంవత్సరంలో తరలించే కంకరను మూడు నెలల్లోనే రవాణా చేసుకుంటున్నారు. అంతేకాకుండా రెండు మొబైల్‌క్రషర్ యూనిట్ల సాయంతో కంకరను తీసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోనట్లు తెలుస్తోంది.
‘నితిన్ సాయి’ నిర్వాకం
అనంతపురం నుంచి 56 కిలోమీటర్ నుంచి 106 కిలోమీటర్ మొళకాల్మూరు రోడ్డు వరకు 46 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి, టీడీపీ నాయకులు పురుషోత్తంనాయుడుకు చెందిన లేఖాన్ కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకున్నాయి. ఈ రోడ్డుకు కావాల్సిన కంకర కోసం ఈ రెండు కంపెనీలు రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో సర్వేనంబర్ 132లోని 11.70 ఎకరాల విస్తీర్ణంలో (దొణగుడ్డం)డోలగుట్ట కొండను లీజుకివ్వాలని దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అధికారులు అనుమతులు ఇవ్వకుండానే కొండను పిండి చేస్తూ కంకరను తరలిస్తున్నాయి.
ఇక వేపరాల క్రాస్ సమీపం సర్వేనంబర్ 270జీ, ఎఫ్‌లలో ఇద్దరు నిరుపేద రైతులకు చెందిన డీ పట్టాభూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఎంసీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి డీ పట్టాభూములను వ్యవసాయానికి మాత్రమే వినియోగించాల్సి ఉన్నప్పటికీ, కార్యాలయం కోసం గది ఏర్పాటు చేసుకుని కార్మికులకు కూడా ఇక్కడే తాత్కాలిక ఇళ్లను నిర్మించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు మేల్కొని కంకర క్వారీ, క్రషర్ యూనిట్‌లో అక్రమాల నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
క్వారీ, క్రషర్‌పై దాడులు నిర్వహిస్తాం. అనుతులు ఉన్నాయో లేదో చూస్తాం. త్వరలోనే విచారణాధికారిని నియమించి నిబంధలను పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నుడుతుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– వెంకటరమేష్‌బాబు, తహసీల్దార్, రాయదుర్గం
Comments
Please login to add a commentAdd a comment