రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించిన మహిళలు
మడకశిర: నెలల తరబడి నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఏ ఒక్కరూ చర్యలు తీసుకోకపోవడంతో పట్టణంలోని వడ్రపాళ్యం మహిళలంతా రోడ్డెక్కారు. తమ దుస్థితిని వివరిస్తూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పార్వతమ్మదాసన్న ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి గురువారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. 6వ వార్డులో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడినా.. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. మడకశిర – హిందూపురం రోడ్డుపై బైఠాయించి దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. దీంతో వాహనరాకపోకలన్నీ స్తంభించగా.. వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, తాగునీరు సరఫరా చేసే పైపులు దెబ్బతిని లీకేజీలు ఎక్కువయ్యాయనీ, అందువల్లే నీరు సక్రంగా సరఫరా కావడం లేదన్నారు.
పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించాలని మున్సిపల్ అధికారులను పలుమార్లు కోరినా వారు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా తాగునీరు సరఫరా చేయాలని కోరినా స్పందించలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆందోళన చేపట్టినట్లు మహిళలు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు కదలేది లేదని రోడ్డుపైనే కూర్చున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ లింగన్న వడ్రపాళ్యం చేరుకుని మహిళలతో చర్చించారు. ఆందోళన విరమించాలని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా... మహిళలంతా ఆయనతో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment