- హిందూపురంలో తాగునీటి సమస్యపై మహిళల ఆగ్రహం
- ఆరునెలలుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదని మండిపాటు
- వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా
- శాంతియుత నిరసన చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జి
హిందూపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో తాగునీటి సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే రూ. 250 కోట్లతో ప్రత్యేక పైపులైన్ వేయించి పట్టణ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా తీరుస్తానని హామీ ఇచ్చిన బాలకృష్ణ.. ఆరు నెలలుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో వేలాదిమంది మహిళలు ఖాళీ బిందెలను తలపై పెట్టుకుని స్థానిక చిన్నమార్కెట్ వద్ద నుంచి సద్భావన సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో దున్నపోతులపై ‘ఎమ్మెల్యే బాలకృష్ణ’ అని రాసి తీసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దున్నపోతులను తీసుకువచ్చిన వారిపై లాఠీచార్జి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. పోలీసులు అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ శాంతియుత నిరసనను అడ్డుకుంటున్నారని నవీన్‌నిశ్చల్ ధ్వజమెత్తారు. అనంతరం సద్భావన సర్కిల్‌లో మండుటెండలోనే రోడ్డుపై బైఠాయించారు. 15 మంది వైఎస్సార్ సీసీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తెరపై హీరో.. రియల్‌గా జీరో..
మహిళలంతా ఖాళీబిందెలు నెత్తిన పెట్టుకుని ‘నీళ్లు కావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘చూడు.. పురం వైపే చూడు.. మరోవైపు చూస్తే ప్రజాగ్రహాన్ని తట్టుకోలేవు..’, ‘తెరపై హీరో.. రియల్‌గా జీరో..’, ‘గుక్కెడు నీటికోసం శోధన.. గుండె లోతుల్లో వేదన.. వద్దురా నాయనా టీడీపీ పాలనా..’ అనే నినాదాలను హోరిత్తిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శిం చారు. ప్రధాన రహదారిలో ఖాళీబిందెలతో తోరణాలు కట్టారు. సుమారు రెండు గంటల పాటు ప్రధాన రహదారిలో రాకపోకలు స్తంభించి పోయాయి. ప్రజల దాహార్తి తీర్చలేని గుడ్డి, చెవిటి ప్రభుత్వానికి ప్రజాగళాన్ని వినిపించడానికే తాము మహాధర్నా చేపట్టామని నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ తెలిపారు. హిందూపురంలో నీటిఎద్దడి నివారణకు బాలకృష్ణ శాశ్వత పరిష్కరం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.