గళం విప్పండి !
- నేటి నుంచి శాసనసభా పర్వం
- సమస్యలపై సభ్యులు స్పందించాలి
- జిల్లావాసిగా సీఎం ఏంచేస్తారో !
- ఆశల పల్లకిలో జనం
చిత్తూరు టౌన్: జిల్లాకు చెందిన చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఒకరు తొ మ్మిదేళ్లు.. మరొకరు మూడేళ్లకు పైబడి ఉన్నప్ప టికీ జిల్లా అభివృద్ధికి బాటలు పడలేదు. మళ్లీ జిల్లావాసే సీఎం పీఠమెక్కారు. అభివృద్ధికి ఇప్పుడైనా బీజం పడుతుందా? తాగు, సాగునీరుతో పాటు ఉపాధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయాభివృద్ధికి నిధుల వరద పారించి కష్టాల నుంచి గట్టెక్కిస్తారా అని జిల్లా వాసులు బాబుపై కోటి ఆశలతో ఉన్నారు. సభ్యులు అసెంబ్లీలో గళంవిప్పి ప్రధాన సమస్యల పరిష్కారానికి దోహదపడతారని, ముఖ్యంగా రైతు, డ్వాక్రా రుణాలమాఫీపై చర్చించి పరిష్కారమార్గం చూపుతారని ఆశిస్తున్నారు.
తీరని తాగునీటి సమస్య
జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికారుల లెక్కల ప్రకారం 1,222 గ్రామాలు సమస్యను ఎదుర్కొంటుండగా అధికారుల లెక్కల్లోకి రాని గ్రామాలు మరో 500 వరకు ఉన్నాయి. 1,063 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా, 159 గ్రామాల్లో టైఅప్ ద్వారా నీళ్లు అందిస్తున్నారు. అధికారుల లెక్కల్లోకి రాని 500 గ్రామాలు నీటి కోసం అలమటిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు తాగునీటి ఎద్దడి నివారణ కోసం జిల్లా ప్రజాపరిషత్ నుంచి రూ.13కోట్లు, కలెక్టర్ విడుదల చేసిన రూ. 4.48 కోట్లు ఖర్చయిపోయాయి.
నష్టాల వ్యవసాయం
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌లో వేరుశెనగ పంట పూర్తిస్థాయిలో సాగు కాలేదు. జిల్లాలో మొత్తం 1.36 లక్షల హెక్టార్లలో సాగవ్వాల్సి ఉన్నప్పటికీ 1.06 లక్షల హెక్టార్లు మాత్రమే సాగయింది. సకాలంలో విత్తు పడకపోవడంతో 50 శాతం కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది జిల్లాకు మంజూరు కావాల్సిన రూ.108 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇంతవరకు విడుదల కాలేదు. పంటల బీమా మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు బీమా కంపెనీలు చెల్లించలేదు.
రుణమాఫీపైనే అందరి దృష్టి
ఖరీఫ్ మొదలై రెండు నెలలు దాటుతున్నా బ్యాంకర్లు ఇప్పటి వరకు రుణాలు ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు రుణాలు చెల్లించలేదు. బ్యాంకర్లు బకాయిలు చెల్లించేదాకా కొత్త రుణాలు ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. దీంతో రీషెడ్యూలుకూ దిక్కులేకుండా పోయింది.
పెండింగ్ ప్రాజెక్టులు
సాగు, తాగునీటి కోసం రూ. 4,076 కోట్లతో చేపట్టిన హంద్రీ-నీవా రెండో దశ పనులు ఇప్పటి దాకా 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్‌లో దీనికి కేటాయింపులు జరగలేదు. లక్ష ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంగా రూ. 450 కోట్లతో చేపట్టిన సోమశిల-స్వర్ణముఖి ప్రాజెక్టు పనులకు భూసేకరణ కూడా పూర్తికాలేదు. అటవీశాఖ క్లియరెన్స్ రాలేదు. పలమనేరు దాహార్తి తీర్చేందుకు రూ.53 కోట్లతో చేపట్టిన వైఎస్‌ఆర్ జలాశయం (కౌండిన్య ప్రాజెక్టు) పనులు ఆగిపోయాయి. బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్లు ఎత్తిపోతల పథకం, 33 చెరువుల అనుసంధానం పనులు జీవోలకే పరిమితమయ్యాయి. నిధుల కేటాయింపు జరగలేదు. చిత్తూరు తాగునీటి కోసం తీసుకొస్తున్న తెలుగుగంగ ప్రాజెక్టు పని ఇంకా ప్రారంభం కాలేదు.