తాడేపల్లిగూడెం : రేషన్‌కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియతో బోగస్ రేషన్ కార్డుల వ్యవహారం నిగ్గుతేలుతోంది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో కార్డుల సంఖ్య 1088 తగ్గిపోగా, రేషన్‌బియ్యం కోటా కూడా 460 క్వింటాళ్ల మేర నిలిచిపోయింది. అయితే ఇప్పటివరకు ఈ బియ్యం పక్కదారి పట్టించిన అక్రమార్కులు తమ జేబులను నింపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్డులకు కేటాయించిన ప్రతి నెలా క్రమం తప్పకుండా విడుదలైన బియ్యం ఎక్కడికి చేరాయి, ఇదంతా అధికారులకు తెలియకుండా జరిగిందా అనే విషయాలపై ఇప్పుడు ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. తాడేపల్లిగూడెం పట్టణం, మండలంలో 81 రేషన్ షాపులు ఉన్నాయి.
ఆగస్టు నాటికి తెల్లరేషన్ కార్డులు 49,055 ఉండగా, వీటికి 6025.82 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. సెప్టెంబర్ నాటికి సీడింగ్ పూర్తయ్యాక కార్డుల సంఖ్య 47,967కి తగ్గిపోగా, ఆ మేరకు బియ్యం కోటాను 5565.64 క్వింటాళ్లకు కుదించారు. దీంతో 1088 కార్డులకు 460.18 క్వింటాళ్ల రేషన్ నిలిచిపోయింది. దీంతో బినామీ కార్డుల గుట్టు రట్టయింది. బినామీ కార్డుల వ్యవహారంలో కొందరి పాత్రపై ఇటీవల కొందరు మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇవి కాకుండా రచ్చబండలో పంపిణీ చేసిన రేషన్ కార్డులను డిపోల వారీ విభజించి పంపిణీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నా, ఆధార్ సీడింగ్ తర్వాత బోగస్ వ్యవహారం అధికారికంగా బయటపడింది. సీడింగ్ అనంతరం పట్టణంలో ఒక డీలర్‌కు ఏకంగా 280 క్వింటాళ్ల బియ్యం కేటాయింపులు తగ్గాయని సమాచారం. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
1,088 బోగస్ రేషన్ కార్డులు
Published Thu, Sep 4 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement