వరాలు 15 అమలు చేసింది 0 | 15 gifts and implemented 0 | Sakshi
Sakshi News home page

వరాలు 15 అమలు చేసింది 0

Published Mon, Jun 8 2015 4:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

15 gifts and implemented 0

సాక్షి ప్రతినిధి, అనంతపురం : టీడీపీ ప్రభుత్వం ఏర్పడి సోమవారానికి సరిగ్గా ఏడాది అవుతుంది. జిల్లా అభివృద్ధి కోసం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రకటించిన 15 వరాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. ఏడాది కాలంలో ఐదుసార్లు ‘అనంత’ పర్యటనకొచ్చిన ‘బాబు’ కోటలు దాటేలా మాటలు చెప్పారు కా నీ..వాటి ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఈ హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవడంలో జిల్లా నేతలు కూడా పూర్తిగా విఫలం చెందారు. దీంతో ఏడాదిగా జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది.

 జిల్లా ప్రజలు నిత్యం కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్నారు. రైతు ఆత్మహత్యలు, రైతులు,  కూలీల వలసలు లేని సంవత్సరం  జిల్లా చరిత్రలో లేదంటే వ్యవసాయం ఎంత ఆందోళనకర స్థితిలో ఉందో అర్థమవుతుంది. ఇలాంటి జిల్లా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పారిశ్రామిక, విద్యారంగాలు పురోగతి సాధించాలని నిపుణులు చెబుతూనే ఉన్నారు. విద్య, సాగునీటి రంగాలపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు.

జేఎన్‌టీయూను స్థాపించి విద్యారంగ అభివృద్ధికి దోహదం చేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును చేపట్టి వ్యవసాయ రంగానికి దన్నుగా నిలిచారు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను కూడా చేపట్టారు. ఇవి పూర్తయి కేటాయింపుల మేరకు నీటిని జిల్లాకు రప్పించగలిగితే సాగునీటి కష్టాలు దాదాపుగా తీరినట్లే. ఇక 2014 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు జిల్లా సాగునీటి రంగానికి చేసింది దాదాపు ఏమీ లేదు.

 పూర్తిగా సన్నగిల్లిన నమ్మకం
 జిల్లా అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రకటించిన 15 వరాల్లో సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్, టెక్స్‌టైల్‌పార్క్ కీలకమైనవి. వీటితో పాటు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చడం, పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, సోలార్, విండ్ పవర్‌ను అభివృద్ధి చేయడం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు నిర్మించి పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇస్తామని ప్రకటించారు.

జిల్లాకు అత్యంత ప్రాధానమైన హంద్రీ-నీవా ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామన్నారు. అయితే.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలో హంద్రీ-నీవాకు ఒకసారి రూ.వంద కోట్లు, మరోసారి రూ.221 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టు మొదటి విడత పనులు పూర్తి కావాలంటే రూ.450 కోట్లు అవసరం. ప్రాజెక్టు మొత్తం పూర్తికావాలంటే మరో రూ.1700 కోట్లు కావాలి. ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఏడాదిగా చెబుతున్న చంద్రబాబు ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న 15శాతంలో ఐదు శాతం పనులను కూడా పూర్తి చే యలేకపోయారు.

కేటాయించిన బడ్జెట్ క రెంటు బిల్లుల బకాయిలు, ఉద్యోగుల వేతనాలకు కూడా సరిపోని పరిసి ్థతి. ఏడాది కాలంలో పుట్టపర్తి, కళ్యాణదుర్గం, సోమందేపల్లి, గొల్లపల్లి, గొట్లూరుకు వచ్చిన చంద్రబాబు.. జిల్లా రుణం తీర్చుకుంటానని, జిల్లా అభివృద్ధి బాధ్యత తనదీ అని పదేపదే చెప్పారు. కానీ ఇచ్చిన  15 హా మీల్లో కనీసం ఒక్కటైనా కార్యరూపం దాల్చిఉంటే బాబుపై జిల్లా వాసులకు నమ్మకం ఉండేదేమో! ఒక్కటీ నెరవేర్చకపోవడంలో బాబు మాటల్లో నిజాయితీ ‘నేతిబీరలో నెయ్యి’ చందమని తేలిపోయింది. పైగా డ్వాక్రా, రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వంపై ఓ అవగాహనకు వచ్చిన జిల్లా వాసులకు బాబు హామీలు నెరవేరుస్తారన్న ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి.

 ఒత్తిడి తేవడంలో ప్రజాప్రతినిధులు విఫలం
 రాష్ట్రంలో టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాలలో ‘అనంత’ కూడా ఒకటి. రెండు ఎంపీలతో పాటు 12 అసెంబ్లీస్థానాలను  ఆ పార్టీకి జిల్లా ప్రజలు కట్టబెట్టారు. అయితే టీడీపీపై తాము పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అని ఏడాదిలోనే ప్రజలకు అర్థమైపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి హామీలను అమలు చేయించడంలో విఫలమయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement