రుణాలకు వేలల్లో దరఖాస్తులు
కేవలం 167 మందికే రుణాలు
విశాఖపట్నం : ‘‘కాపుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం... కాపులను ఉద్దరిస్తాం.. కాపులను బీసీల్లో చేర్చేస్తాం.. కాపు యువతకు రుణాలిస్తాం.. చేయూతనిస్తాం’’ అంటూ గొప్పలు చెప్పుకున్న టీడీపీ సర్కారు వారిని నిలువునా మోసగిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ కాపు సామాజిక వర్గీయులు చేపట్టిన ఉద్యమం జాతీయ స్థాయిలో చర్చకు తెరతీసింది. దీంతో ఉలిక్కి పడిన సర్కారు ఆగమేఘాల మీద కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్లు కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఏకంగా వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు గొప్పలకు పోయింది. కానీ కాపు యువతకు చేయూత నిచ్చింది శూన్యమని లెక్కలు చెబుతున్నాయి.
ఎంత మందికి ఇచ్చారంటే?
2015-16లో జిల్లాలో కాపు యువతకు రూ.4.5 కోట్లతో 1500 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. జనవరిలో హడావుడిగా దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక చేపట్టారు. రికార్డు స్థాయిలో ఏకంగా 19,703 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 1500 యూనిట్లు మంజూరు చేయాల్సి ఉండగా.. కేవలం 581 మంది మాత్రమే అర్హులుగా లెక్కతేల్చి అడ్మినిస్ట్రేషన్‌కు ఇచ్చారు. ప్రతీ సంక్షేమ పథకానికి మోకాలొడ్డినట్టే వీరి విషయంలో కూడా బ్యాంకర్లు మోకాలొడ్డారు. కేవలం 167 మందికి మాత్రమే బ్యాంకర్ల నుంచి అంగీకారం వచ్చింది. కనీసం వీరికైనా ప్రభుత్వం సబ్సిడీ రిలీజ్ చేస్తుందనుకుంటే అదీ లేదు. బ్యాంకుల అంగీకారం పొందిన 167 మందికి రూ.1.40 కోట్ల సబ్సిడీ కింద విడుదల చేయాల్సి ఉండగా కేవలం 92 మందికి మాత్రమే రూ.71.80 లక్షలు మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుంది. వీటిలో ఏ ఒక్కటి ఇప్పటి వరకు గ్రౌండింగ్ అయిన పరిస్థితి లేదు.
ఈ ఏడాది పరిస్థితి ఏంటి?
ఇదేమిటని ప్రశ్నిస్తే గతేడాది చివరి నిమిషంలో ఈ స్కీమ్ ప్రకటించడం, ఆలస్యంగా విధివిధానాలు ఖరారు చేయడం వల్లే లబ్ధిదారుల ఎంపిక జరప లేకపోయామని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు బ్యాంకుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం లభించక పోవడం, సకాలంలో సబ్సిడీ విడుదల కాకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని అంటున్నారు. 2016-17 బడ్జెట్‌లో కాపులకు ఏకంగా రూ.1000 కోట్లు కేటాయించిన ట్టు గొప్పలు చెప్పుకున్న సర్కారు రెండు నెలలు కావస్తున్నా జిల్లా వారీగా యాక్షన్ ప్లాన్ కానీ.. నిధుల కేటాయింపులు కానీ.. విధి విధానాలు కానీ ఖరారు చేయలేదు. మరో నెల గడిస్తే ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం ముగిసిపోతున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు.