పుంగనూరు,న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధినేత, సీమాం ధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల రుణాలు పూర్తిగా మాఫీ చేయకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పుంగనూరు ఎమ్మెల్యే డా క్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆ యన పుంగనూరు సమీపంలోని భీమగానిపల్లె వద్ద ఓ డీజిల్ ఏజెన్సీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం అమలుకు సాధ్యంకాని హామీలను ఇచ్చి, ఓట్లు వేయించుకుని అధికారాన్ని చేపట్టిందన్నారు. నేడు రుణాల మాఫీల విషయంలో రకరకాల డ్రామాలు ఆడడం బాధాకరమన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు తీసుకున్న రుణాల్లో పరిమితి విధించరాదని సూచించారు. పరిమితులు విధిస్తే కొంత మందికి మాత్రమే లబ్ధిచేకూరుతుందని, మిగిలిన వారు వీధిన పడతారన్నారు. డ్వాక్రా రుణాల్లో సైతం పరిమితులు విధించకుండా అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఎటువంటి పొరబాట్లు చేసినా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజలను మరింతగా చైతన్యపరచి, పార్టీని బలపరుస్తామన్నారు. పెట్రోల్‌బంక్ యజమాని కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వెంకటరెడ్డి యాదవ్, రుక్మిణమ్మ, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి , మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాదర్‌ఖాన్, ఏఎంసీ మాజీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు గంగిరెడ్డి, సీడీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రుణాలన్నీ మాఫీ చేయాలి
Published Mon, Jun 9 2014 2:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement