ఆటోలో ఎర్రచందనం దుంగలు బయటపడడంతో మృతులు స్మగ్లర్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పూతలపట్టు, న్యూస్‌లైన్:
పోలీసుల కథనం మేరకు.. ఏపీ04 7083 నంబర్ గల ఆటో ఐదు ఎర్రచందనం దుంగలతో గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో తిరుపతి వైపు నుంచి చిత్తూరు వైపునకు బయలుదేరింది. అలాగే ఏపీ16 టీఎక్స్ 8193 నంబర్ గల లారీ చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతోంది. పి.కొత్తకోట బ్రిడ్జి సమీపంలో ఆటో ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా వస్తున్న లారీ వెనుక చక్రాన్ని వేగంగా ఢీకొంది. తర్వాత ఇన్నోవా కారును ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని రామాంజనేయులు, గంగేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మల్లికార్జున, శివశంకర్ తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 30 నిమిషాలు పూతలపట్టు 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులు నరకయాతన అనుభవించారు.
సంఘటన స్థలానికి పాకాల సీఐ వెంకటనారాయణ, పూతలపట్టు ఎస్‌ఐ నిత్యబాబు చేరుకున్నారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతులు వైఎస్‌ఆర్ జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని తిమ్మరాజుపల్లెకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇదిలావుండగా తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి సంఘటనను చూసి వెంటనే 108 వాహనానికి సమాచారమిచ్చారు. సుమారు 30 నిమిషాలకూ 108 వాహనం రాకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ప్రమాదంలో ఇద్దరి మృతి
Published Fri, Dec 13 2013 3:15 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement
Advertisement