ఎటూ తేలని 'చిన్నారి' పంచాయితీ
ఇద్దరు తల్లుల నడుమ నలిగిపోతున్న 2 సంవత్సరాల చిన్నారి పంచాయితీ ఎటూ తేలకపోవడంతో స్త్రీ శిశుసంక్షేమ శాఖాధికారులు శుక్రవారం బిడ్డను బుద్ధవరంలోని చైల్డ్‌కేర్‌సెంటరుకు అప్పగించారు. దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న చిన్నారి వివాదం ముదిరిపాకాన పడడంతో తిరువూరు పోలీసుస్టేషనులో గురువారం పంచాయితీ చేసిన విషయం విదితమే. అయితే చిన్నారి కోసం కన్నతల్లి హేమలత, పెంచిన తల్లి విమల ఎవరికి వారే పట్టుదలకు పోవడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని ఐసీడీఎస్ సీడీపీవో అంకమాంబను కోరారు. దీంతో ఇరువురి వాదనల్లో నిజమెంతో తేలేవరకు ఆ బిడ్డను చైల్డ్ కేర్ సెంటరుకు అప్పగించామని సీడీపీవో అంకమాంబ తెలియజేశారు.కాగా చైల్డ్‌కేర్ సెంటరుకు బిడ్డను అప్పగిస్తారని తెలియడంతో హేమలత, విమలల మధ్య రాజీకుదర్చడానికి కొందరు పెద్దలు చేసిన ప్రయత్నం విఫలమయింది.
పత్తాలేని మధ్యవర్తులు...
హేమలత బిడ్డను పెంచుతామని డబ్బులు తీసుకున్న తిరువూరుకు చెందిన విజయనాధం అనే వ్యక్తి కనిపించకపోవడంతో సమస్య జఠిలమైంది. విజయనాథం నుంచి ఆ బిడ్డను తీసుకున్న మరో వ్యక్తి తన సమీపబంధువైన విమలకు సంతానం లేకపోవడంతో పెంపకం నిమిత్తం అప్పగించారు. అయితే తాము పెంచుకుంటున్న పాపను విక్రయించడానికే హేమలత మళ్లీ వివాదం సృష్టిస్తోందని విమల ఫిర్యాదులో పేర్కొంది.
పాపం పసిపాప....
ఆ పాపకు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తనను అల్లారు ముద్దుగా పెంచుతున్న వారితో బోసినవ్వులు నవ్వుతూ, నవ్విస్తూ 19 నెలలు గడిపింది. దేవుడిచ్చిన వరంగా భావించిన ఆ దంపతులు ఈ పాపను అపురూపంగా పెంచుకున్నారు. విధి ఎంత విచిత్రంగా ఉంటుందటే ఆ పాపతో పాటు పెంచుకుంటున్న వారిలోనూ వేదన మిగిల్చింది. పాప తన కూతురంటూ వచ్చిన తల్లిలోనూ అదే వేదన మిగిలింది. ఈ పాపను ఎవరి వద్ద ఉంచాలనేది అధికారులతో పాటు ఎవరూ తేల్చి చెప్పలేని పరిస్థితి వచ్చింది.
అసలేం జరిగిందంటే....
నాలుగేళ్ల క్రితం తిరువూరుకు చెందిన బల్లిపర విజయనాధంకు నెల్లూరుకు చెందిన హేమలత చెన్నైలో పరిచయం అయింది. ఆమె వద్ద ఉన్న తొమ్మిది నెలల కుమార్తెను విజయనాధంకు ఇచ్చి కనిపిచకుండా పోయింది. విజయనాధం ఆ పాపను తిరువూరులోని గద్దల సందీప్, విమల దంపతులకు ఇచ్చాడు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయినా పిల్లలు పుట్టలేదు. విజయనాధం ఈ పాపను ఇవ్వడంతో దేవుని ప్రసాదమని భావించి తీసుకున్నారు.
నా బిడ్డను నాకివ్వండి...
పందొమ్మిది నెలల్లో రెండుసార్లు హేమలత విమల దంపతుల వద్దకు వచ్చింది. తన కుమార్తెను తనకు ఇవ్వాలని కోరింది. అయితే వారు ఆమె కోరికను తిరస్కరించారు. నాలుగు నెలల క్రితం మరోసారి వచ్చిన హేమలత ఇలాగే అడిగి వెళ్లిపోయింది. అయితే వారం రోజుల క్రితం తిరువూరు వచ్చి తన కుమార్తెను తనకు ఇవ్వాలంటూ గొడవ చేసింది. దీంతో విమల దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్‌స్టేషన్లో జరిగిన పంచాయితీ ఎటూ తేలకపోవడంతోనూ, కన్నతల్లినని చెప్పుకుంటున్న హేమలత వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పాపను పోలీసులు ఐసీడీఎస్ వారికి అప్పగించారు.