ఖాసీంకోట (విశాఖపట్నం): జిల్లా పరిధిలోని ఖాసీంకోట మండలం అమీన్ సాహెబ్ పేట జంక్షన్ వద్ద బుధవారం సుమారు రెండు టన్నుల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జి.మాడుగుల మండలం నుంచి హైదరాబాద్‌కు వ్యాన్‌లో తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో గంజాయి బయటపడింది. గంజాయి బయటపడకుండా ఉండేందుకు ఊక బస్తాల మధ్య దాచి ఉంచారు. వ్యాన్ డ్రైవర్లు కె.కొండబాబు, సత్తిబాబులతో పాటు యజమాని మాచినేని నాగేశ్వరరావులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.