సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బలుపు కాదు వాపు అని కాంగ్రెస్‌కు, ఇంకా బతికే ఉందని టీడీపీకి, ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియజెప్పిన సంవత్సరం 2013. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం జిల్లా బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపగా, వామపక్షాలు మునుపటి నిస్తేజంతోనే ఎన్నికల సంవత్సరంలోకి వెళ్తున్నాయి.
స్థానిక, సహకార సంఘాల అధికారం అండతో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటకీ పంచాయతీ ఎన్నికల్లో వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నాయకులు కొందరు ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారు. సమైక్యాంధ్ర సమరంలోనూ కాంగ్రెస్, టీడీపీలు మొక్కుబడిగా పాల్గొనగా వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరుబాటన నడిచింది. ఇదీ స్థూలంగా 2013లో రాజకీయపార్టీల పరిస్థితి. మరోవైపు ఏడాదంతా సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.
అధికారానికి ఎదురొడ్డి విజయాలు సాధించిన వైఎస్సార్‌సీపీ
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రజల హృదయాల్లోనే నిలిచి ఉందని ఈ ఏడాది కూడా నిరూపించుకుంది. ప్రజల పక్షాన ఒక వైపు పోరాటం చేస్తూనే అధికారపక్షాన్ని ఎదురొడ్డి విజయాలను సొంతం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించి సత్తా చాటుకుంది. జిల్లాలో పార్టీకి లభిస్తున్న ఆదరణతో రాష్ట్ర నాయకత్వం కూడా కొందరు నేతలను సీఈసీలోకి తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేయడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరైంది.
కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ రాష్ట్ర విభజన నిర్ణయం వెలువరించిన రోజు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకొని పనిచేసింది. సమైక్య శంఖారావంలో భాగంగా వైఎస్ షర్మిల జిల్లా పర్యటన జరిపారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కావలి పట్టణాల్లో నిర్వహించిన సభలకు జనం వేలాదిగా తరలివచ్చారు.
గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ ...
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కనుమరుగయ్యే దశకు చేరింది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున నలుగురు శాసనసభ్యులు ఉండగా అందులో ఇద్దరు ఇతర పార్టీలకు వలస వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. మిగిలేదల్లా ఆనం సోదరులు మాత్రమే. ఇక చాలా నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.
పంచాయతీలో బతికే ఉన్నాననిపించిన టీడీపీ..
ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికలు జిల్లాలో టీడీపీకి ఊపిరిపోశాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడం ద్వారా జిల్లాలో ఆ పార్టీ ఇంకా బతికే ఉందన్న అభిప్రాయాన్ని కల్పించాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలో అవకాశం దొరక్క దేశంవైపు చూస్తున్నారు. ఇది ఆ పార్టీలో ఇప్పటికే అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న నేతల అసంతృప్తికి దారి తీస్తోంది.
కార్యకర్తలు సంతోషపడాలో, బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. జిల్లా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి 2013లో పొలిట్‌బ్యూరోలో స్థానం దక్కింది. కాగా పార్టీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగుదేశం కీలక పాత్ర పోషించలేక విమర్శలపాలైంది.