24గంటల సేవలు | 24 hours services | Sakshi
Sakshi News home page

24గంటల సేవలు

Published Sun, Dec 15 2013 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

రోడ్డు ప్రమాదాలలో గాయపడేవారికి మెరుగైన వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

కామారెడ్డి/దేవునిపల్లి, న్యూస్‌లైన్ :  రోడ్డు ప్రమాదాలలో గాయపడేవారికి మెరుగైన వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శనివారం ఆయ న కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. ట్రామా కేర్ కేంద్రాలు 24 గంటలపాటు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది, వైద్యుల కొరతతోనే ప్రస్తుతం అవి పనిచేయడం లేదన్నారు. ఈ సమస్య ను త్వరలోనే అధిగమిస్తామన్నారు. వైద్యుల నియామకానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. స్థానికంగా ఉండే ప్రత్యేక వైద్యులతో సేవలు అందిస్తున్నామని చెప్పారు. న్యూరోసర్జన్లు, సర్జన్లు, ఆర్థోపెడిక్ సర్జన్ల కొరత ఉందని పేర్కొన్నారు.
 ‘ఉన్నతులు’ అందుబాటులో లేకనే
 ఉన్నత విద్యాభ్యాసం చేసినవారు స్థానికంగా సేవలందిం చడానికి ఆసక్తి చూపకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎల్వీ తెలిపారు. వైద్యశాస్త్రంలో పీజీ చది విన వారు కచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలన్న నిబంధన విధించిన నేపథ్యంలో 62 మంది ప్రత్యేక  వైద్యులు అందుబాటులోకి రానున్నారని పేర్కొన్నారు. ట్రామాకేర్ సెంటర్ భవన నిర్మాణానికి రూ 44 లక్షలు, పరికరాల కొనుగోలుకు రూ 61 లక్షలు మంజూరు చేశామన్నారు. ఉన్నతాధికారులు వస్తున్నారని ఆస్పత్రిని శుభ్రం చేశారని, ట్రామాకేర్ సెంటర్‌లో ఈరోజే పేషెంట్ల ను దింపారని విలేకరులు అధికారుల దృష్టికి తీసుకురాగా.. కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. అన్ని వసతులు కల్పించిన తర్వాత పరిస్థితులు మెరుగుపడుతాయన్నారు. ఏరియా ఆస్పత్రిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. టాయిలెట్ల నిర్మాణానికి బల్దియా నిధులు కేటాయించి, నిర్వహించాలని ఆ శాఖ అధికారులకు సూచించామన్నారు.
 ఇందూరులోనే జిల్లా ఆస్పత్రి
 నిజామాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిని ఎక్కడికీ తరలించబోమని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటైనందున జిల్లా వైద్యశాలను ఇతర ప్రాంతాలకు తరలించే ఉద్దేశమే లేదన్నారు. వైద్యకళాశాల ఉంటే అక్కడ మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు.
 ఆస్పత్రిలో కలియ తిరిగి
 వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితోపాటు ట్రామాకేర్ సెంటర్, ఇతర విభాగాలలో సుమారు రెండు గంటలపాటు కలియతిరిగారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కేశవ్ దేశ్‌రాజ్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్య దర్శి అజయ్ సహానీ, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వైవీ అనురాధ, వైద్య ఆరోగ్య మిషన్ డెరైక్టర్లు డాక్టర్ బుద్ధ ప్రకాశ్, జ్యోతి శనివారం ఉదయం 9.30 గంటలకు ఆస్పత్రికి వచ్చారు. వీరికి కలెక్టర్ ప్రద్యుమ్న స్వాగతం పలికారు. వీరు మొదట ఏరియా ఆస్పత్రిలోని మహిళల ఇన్‌పేషెంట్ వార్డును పరిశీలించారు. పురుషుల వార్డులోనూ పర్యటించి రోగులకు అందుతున్న సేవలగురించి తెలుసుకున్నారు. ట్రామాకేర్ సెంటర్‌ను పరిశీలించారు. థియేటర్‌ను పరిశీలించి, రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో వివరాలను ఆరా తీశారు. ప్రసూతి విభాగంలో రోగులతో మాట్లాడారు. ఈవోపీ, ఆరోగ్యశ్రీ విభాగం రికార్డులను పరిశీలించారు. ఏఆర్‌టీ సెంటర్‌ను సందర్శించి,  ఎయిడ్స్ రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని సిబ్బందికి సూచించారు. డీఎస్‌పీ సురేందర్‌రెడ్డి, ప్రొబేషనరీ డీఎస్‌పీ రమణారెడ్డి, సీఐలు కృష్ణ, సుభాష్‌చంద్రబోస్, ఎస్‌ఐలు అశోక్, సంగమేశ్వర్ బందోబస్తు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement