మా ఆయన బంగారం అనుకుంది కానీ..
సాలూరు: ప్రేమించానని చెప్పి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. బంగారం షాపు నిర్వహిస్తున్నాడు. అతని మనసు కూడా బంగారమే అయి ఉంటుందని భావించి కోటి ఆశలతో ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టిన ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో సోమవారం అర్ధరాత్రి మృతిచెందింది. సాలూరు పట్టణంలోని నాయుడు వీధిలో జరిగిన సంఘటనకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో బంగారం షాపు నిర్వహిస్తున్న కొల్లేపర మధు గరివిడికి చెందిన కాదవం శార్వాణి(24)ని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె తల్లిదండ్రుల సమ్మతితో 2009లో సింహాచంలంలో వివాహం చేసుకున్నాడు.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నాలుగేళ్ల దీక్షిత్, ఏడాదిన్నర యశ్మిత్ ఉన్నారు. అయితే గత మూడేళ్ల నుంచి శార్వా ణిని భర్త నిత్యం అదనపు కట్నం కోస వేధిస్తూ హతమార్చాడని మృతురాలి తల్లిదండ్రులు, ఇతర మహిళలు మంగళవారంఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో శార్వాణి ఫోన్‌చేసి భర్త కొడుతున్నాడని తెలిపిందని మృతురాలి తల్లి సూర్యకళ తెలిపారు. రాత్రి 12గంటల ప్రాంతంలో కాలిపోయి చనిపోయిందని సమాచారం తెలియడంతో హుటాహుటిన ఇక్కడికి వచ్చామని వాపోయారు.
భార్య ఆత్మహత్య చేసుకుందంటూ ఫిర్యాదు చేసిన భర్త
తన భార్య ఇంటిలో కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని, తాను కాపాడే ప్రయత్నం చేశానని, ప్రయోజనం లేకపోయిందంటూ సోమవారం అర్ధరాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి మధు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాలుతున్న శార్వాణి మృతదేహాన్ని చూసి భర్తపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు.
మహిళల ఆందోళన
ఇదిలా ఉండగా తమ బిడ్డను అల్లుడే హత్యచేశాడని, అనంతరం, కిరోసిన్‌పోసి నిప్పంటించాడని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు రోదించడంతో వారికి ఐద్వా నాయకురాలు లక్ష్మి, సీపీఎం నాయకులు గేదెల సత్యనారాయణ, శ్రీను, ఎన్‌వై నాయుడు తదితరులు సంఘీభావం తెలుపుతూ ఇతర మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు. బాధ్యులను కఠినంగాశిక్షించాలని డిమాండ్ చేశారు.
ఏఎస్పీ విచారణ;
ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఈఘటనపై విచారణ జరి పారు.ఆధారాల సేకరణకోసం క్లూస్‌టీంను రప్పిం చారు. తహశీల్దార్ కె ఆనందరావు సహకారంతో శవపంచనామా నిర్వహించారు. ఆందోళనకు దిగినవారి తో ఏఎస్పీ మాట్లాడుతూ సంఘటనపై విచారణ చేస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హా మీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
అదుపులో నిందితులు
మృతురాలి భర్తతోపాటు అతని తమ్ముడు రమేష్, తల్లి సుశీల,మరదలు సౌజన్య, సోదరి సరస్వతి, బావ శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఏఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా క్లూస్‌టీంకు కీలక ఆధారం లభించినట్టు సమాచారం. భర్త తనను హింసిస్తున్నాడని, తనకు ఏక్షణమైనా ప్రాణహాని తప్పదని, తన బిడ్డలను మీరే చూసుకోవాలని తలిదండ్రులను ఉద్దేశించి శార్వాణి డైరీలో రాసుకున్నట్టు క్లూస్ టీం గుర్తించారు. అయితే ఆకాగితాన్ని డైరీనుంచి చింపేశారని, కానీ పెన్నురాతతో కింది కాగితంపై ఏర్పడ్డ గీతల ఆనవాళ్ల ఆధారంగా వివరాలను సేకరించి నట్టు తెలిసింది.